Telangana: జీవో 46 రద్దు చేయాల్సిందే.. కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన
తెలంగాణ ప్రభుత్వం... కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించి జారీ చేసిన జీవో 46ను రద్దు చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఈ జీవోతో తమకు అన్యాయం జరుగుతోందంటూ గ్రామీణ ప్రాంత అభ్యర్థులు శుక్రవారం డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేయాలంటూ గ్రామీణ జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకుదిగారు. టీఎస్‌ఎస్‌పీతో పాటు ఐటీ అండ్ కమ్యూనికేషన్ అభ్యర్థులు డీజీపీ కార్యాలయం వైపు దూసుకెళ్లారు. ఆందోళనకు దిగిన అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నా తప్పించుకుని డీజీపీ కార్యాలయానికి చేరుకొని నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
చదవండి: ఏపీ ఎస్సై ఫైనల్ రాత పరీక్ష తేదీలు ఇవే.. ఈ పరీక్ష కేంద్రాలలోనే..
చదవండి: మహిళా రిజర్వేషన్ల ఎఫెక్ట్.. 2,125 కానిస్టేబుల్స్, 153 మంది ఎస్ఐలకు
రద్దీ సమయంలో ఆందోళన జరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అభ్యర్థులను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. తర్వాత సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ అభ్యర్థులు మాట్లాడుతూ.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోనే 50 శాతానికిపైగా పోస్టుల్ని కేటాయించడంతో గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జీవో 46ను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.