Staff Nurse Jobs : స్టాఫ్ నర్సు ఉద్యోగం పేరిట టోకరా
జి.మాడుగుల: స్టాఫ్ నర్సు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.2 లక్షలు తీసుకుని నకిలీ పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చి మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ మేరకు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జి.మాడుగుల మండలం వంతాల పంచాయతీకి చెందిన బర్లు రమాదేవి విశాఖపట్నం జిల్లా మధురవాడలో సిద్ధార్థ నర్సింగ్ కాలేజీలో 2012–16 సంవత్సరం వరకు బీఎస్సీ నర్సింగ్ చదువుకుని, గీతం ఆస్పత్రిలో 2017–20 సంవత్సరం వరకు పనిచేసింది. ప్రస్తుతం పీఎంపాలెం వేదాంత ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఈ క్రమంలో 2022లో ప్రభుత్వం స్టాఫ్‌నర్సు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వటంతో ఆమె దరఖాస్తు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అల్లూరి జిల్లా పెదబయలుకు చెందిన పాంగి రాధ తన మామయ్యగా శ్రీశైలం ప్రసాదరావును విశాఖపట్నంలో పరిచయం చేసింది. అతడు అరకులోయ కమ్యూనిటీ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సు ఉద్యోగం ఇప్పిస్తానని రమాదేవిని నమ్మించి రూ.2 లక్షలు రెండు దఫాలుగా తీసుకున్నాడు. ఈ నెల 3న పోస్టింగ్ ఆర్డర్ కాపీ ఇచ్చాడు. దానిని తీసుకుని పాడేరు డీఎంహెచ్‌వో కార్యాలయానికి వెళ్లి రిపోర్టు చేయగా అధికారులు ఇది నకిలీదని చెప్పటంతో బాధితురాలు ఒక్కసారిగా షాక్‌కు గురైంది. దాంతో తనను మోసం చేసిన ప్రసాదరావుపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Jobs in Andhra Pradesh: స్టాఫ్‌నర్సు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం