Skip to main content

JEE Main 2022: పరీక్ష షెడ్యూల్‌ విడుదల.. ఇలా ప్రిపేర్ అయితే విజయం మీదే..

జేఈఈ–మెయిన్‌.. బీటెక్‌ ఔత్సాహిక విద్యార్థులకు పరిచయం అక్కర్లేని పరీక్ష! ఈ ఎంట్రన్స్‌లో మంచి స్కోర్‌తో ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ముఖ్యంగా.. ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావాలంటే.. జేఈఈ–మెయిన్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇంతటి కీలకమైన ఈ పరీక్ష ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రెండు సెషన్లలో జరుగనుంది. దీనికి సంబంధించి పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. విద్యార్థులు బోర్డ్‌ సిలబస్, అడ్వాన్స్‌డ్‌ సిలబస్‌లతో సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్‌ సాగిస్తే.. విజయం సాధించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలో..జేఈఈ మెయిన్‌పై సమగ్ర కథనం..
JEE Main 2022 notification released, Syllabus, Preparation Tips, Guidence and more details here
JEE Main 2022 notification released, Syllabus, Preparation Tips, Guidence and more details here
  • జేఈఈ మెయిన్‌ 2022 షెడ్యూల్‌ విడుదల
  • మొదటి సెషన్‌ దరఖాస్తులకు చివరి తేది 31.03.2022
  • ఈ ఏడాది రెండుసార్లు మాత్రమే జేఈఈ–మెయిన్‌
  • ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు మొదటి సెషన్‌ పరీక్షలు
  • మే 24 నుంచి 29వ తేదీ వర కూ రెండో సెషన్‌ ఎగ్జామ్స్‌
  • ఇంటర్, అడ్వాన్స్‌డ్‌ సిలబస్‌తో సమన్వయం చేసుకుంటే సత్ఫలితం
  • జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ తేదీ ఖరారు.. జూలై 3న పరీక్ష

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)జేఈఈ–మెయిన్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొదటి సెషన్‌కు దరఖాస్తుల ప్రక్రియ సైతం ప్రారంభించింది. జేఈఈ–మెయిన్‌–2022లో ప్రధానమైన మార్పు.. ఈ ఏడాది ఈ పరీక్షను రెండు సెషన్లలో మాత్రమే నిర్వహించాలని నిర్ణయించడం. తొలి సెషన్‌ను ఏప్రిల్‌లో, రెండో సెషన్‌ను మే నెలలో నిర్వహించనున్నారు. గత ఏడాది జేఈఈ–మెయిన్‌ను నాలుగు సెషన్లుగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం రెండు సెషన్లకే పరిమితం చేశారు.

చ‌ద‌వండి: JEE Mains- 2022 : జేఈఈ మెయిన్స్‌ షెడ్యూల్ విడుద‌ల‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..

కారణాలు ఇవే

  • గత ఏడాది కోవిడ్‌ రెండో దశ కారణంగా.. బోర్డ్‌ పరీక్షల నిర్వహణలో సందిగ్ధ పరిస్థితులు, జాప్యం వంటివి ఎదురయ్యాయి. దీంతో విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు నాలుగు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. కానీ.. ఈ ఏడాది పరిస్థితులు గాడిన పడి బోర్డ్‌ పరీక్షలు జరగనున్నాయి. దాంతో రెండు సెషన్లకు పరిమితం చేశారు. 
  • గత ఏడాది నాలుగు సెషన్లకు హాజరైన వారి సంఖ్య మొత్తం అభ్యర్థుల్లో 27 శాతంగానే ఉంది. అంటే.. విద్యార్థులు ఏదో ఒక సెషన్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకొని చదువుతున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్‌టీఏ ..జేఈఈ–మెయిన్‌–2022ను రెండు సెషన్లకే పరిమితం చేయాలని నిర్ణయించింది.

బోర్డ్‌ పరీక్షల ఒత్తిడి

  • జేఈఈ–మెయిన్‌–2022ను రెండు సెషన్లు.. ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాలనే నిర్ణయంతో విద్యార్థులు బోర్డ్‌ పరీక్షల గురించి కొంత ఆందోళన చెందుతున్నారు.
  • జేఈఈ–మెయిన్‌కు అర్హతగా పేర్కొంటున్న ఇంటర్మీడియెట్, సీబీఎస్‌ఈ +2 పరీక్షలు ఏప్రిల్‌ నెలలోనే మొదలవుతున్నాయి. 
  • తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ 8 నుంచి, తెలంగాణలో ఏప్రిల్‌ 20 నుంచి ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 
  • సీబీఎస్‌ఈ.. +2 పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి మొదలు కానున్నాయి. 
  • తొలి సెషన్‌.. ఏప్రిల్‌లో జరిగే పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అటు బోర్డ్‌ పరీక్షల ఒత్తిడి, ఇటు జేఈఈ–మెయిన్‌ ఒత్తిడితో ఆందోళనకు గురయ్యే ఆస్కారం ఉందని అంటున్నారు.


చ‌ద‌వండి: JEE Main 2022: నోటిఫికేషన్, పరీక్షల సమాచారం

సిలబస్‌ సమన్వయం

జేఈఈ–మెయిన్‌–2022కు సంబంధించి తొలుత ఈ ఏడాది సిలబస్‌ను సమగ్రంగా అధ్యయనం చేసి పూర్తి అవగాహన పెంచుకోవాలి. విద్యార్థులు ఈ సిలబస్‌ను అనుసరిస్తూ తమ ప్రిపరేషన్‌కు పదును పెట్టుకుంటే.. మెయిన్‌లో మంచి స్కోర్‌ సాధించడానికి వీలవుతుంది. ఈ ఏడాది ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు.. జేఈఈ మెయిన్‌ సిలబస్‌తో సమన్వయం చేసుకుంటూ చదివితే.. ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధత పూర్తి చేసుకోవచ్చు.

అడ్వాన్స్‌డ్‌ తేదీ ఖరారు

జేఈఈ మెయిన్‌ అర్హతగా ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీ ఖరారైంది. జూలై 3న పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సిలబస్‌తోనూ అనుసంధానం చేసుకుంటూ.. మెయిన్‌కు సన్నద్ధమైతే ఒకే సమయంలో రెండు పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. 

చ‌ద‌వండి: JEE Main: జేఈఈ మెయిన్ లో మార్పులు

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌

  • జేఈఈ–మెయిన్‌ పరీక్ష కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో నిర్వహించనున్నారు. 
  • పేపర్‌–1కు బీటెక్‌/బీఈ అభ్యర్థులందరూ హాజరు కావాల్సి ఉంటుంది. 
  • పేపర్‌–2ఎ, పేపర్‌–2బి పేరిట మరో రెండు పేపర్లు నిర్వహిస్తారు.
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ అభ్యర్థులు పేపర్‌–2ఎకు హాజరవ్వాల్సి ఉంటుంది.
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అభ్యర్థులు పేపర్‌–2బికు హాజరుకావాలి.

పేపర్‌–1(బీటెక్, బీఈ) ఇలా

ఈ పేపర్‌ను మొత్తం మూడు సబ్జెక్ట్‌లలో రెండు సెక్షన్లుగా నిర్వహిస్తారు. వివరాలు..

సబ్జెక్ట్‌ సెక్షన్‌–ఎ ప్రశ్నల సంఖ్య సెక్షన్‌–బి ప్రశ్నల సంఖ్య మార్కులు
మ్యాథమెటిక్స్‌ 20 10 100
ఫిజిక్స్‌ 20 10 100
కెమిస్ట్రీ 20 10 100
మొత్తం 90 300
  • సెక్షన్‌–ఎ పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో(ఎంసీక్యూలతో) ఉంటుంది. 
  • సెక్షన్‌–బిలో న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నలుంటాయి.
  • సెక్షన్‌–బిలో 10 ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోతుంది.
  • సెక్షన్‌–ఎ, బీలకు నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు లభిస్తాయి. పొరపాటు సమాధానానికి ఒక మార్కు కోత పడుతుంది. 

బీఆర్క్‌ పరీక్ష స్వరూపం

నిట్‌లు, ట్రిపుల్‌ ఐటీలు, ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు హాజరవ్వాల్సిన పరీక్ష ఇది. పేపర్‌–2ఎగా పిలిచే ఈ పరీక్షను కూడా మూడు విభాగాలుగా నిర్వహిస్తారు.

సబ్జెక్ట్‌ ఎంసీక్యూ ప్రశ్నల సంఖ్య న్యూమరికల్‌ ప్రశ్నల సంఖ్య వాల్యూ మార్కులు
మ్యాథమెటిక్స్‌ 20 10 100
ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 50 200
డ్రాయింగ్‌ టెస్ట్‌ 02 100
మొత్తం ప్రశ్నలు 82 400 మార్కులు
  • మ్యాథమెటిక్స్‌ సబ్జెక్ట్‌ విభాగంలో ఎంసీక్యూల విషయంలో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు; అదే విభాగంలో న్యూమరికల్‌ ప్రశ్నలలో పది ప్రశ్నలకు గాను అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా ఉంటాయి. సెక్షన్‌ ఏ, సెక్షన్‌ బీ రెండింటికీ నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. 
  • డ్రాయింగ్‌ టెస్ట్‌లో మాత్రం రెండు అంశాలను ఇచ్చి డ్రాయింగ్‌ వేయమంటారు. ఒక్కో టాపిక్‌కు 50 మార్కులు.

బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ పరీక్ష స్వరూపం

బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా నిర్వహించే పేపర్‌ ఇది. పేపర్‌–2బి పేరుతో నిర్వహించే ఈ పరీక్ష మూడు విభాగాలుగా ఉంటుంది. వివరాలు..

సబ్జెక్ట్‌ ప్రశ్నల సంఖ్య న్యూమరికల్‌ ప్రశ్నల సంఖ్య మార్కులు
మ్యాథమెటిక్స్‌ 20 10 100
అప్టిట్యూడ్‌ టెస్ట్‌ 50 200
ప్లానింగ్‌ ఆధారిత  ప్రశ్నలు 25 100
మొత్తం ప్రశ్నల  సంఖ్య: 105 400 మార్కులు
  • మ్యాథమెటిక్స్‌ సబ్జెక్ట్‌ విషయంలో న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా ఉంటాయి.
     

చ‌ద‌వండి: JEE Main and Advanced Guidance

సన్నద్ధత ఇలా 
మ్యాథమెటిక్స్‌

ప్రతి చాప్టర్‌లోనూ కచ్చితంగా అవగాహన పొందాల్సిన సబ్జెక్ట్‌ మ్యాథమెటిక్స్‌.  3–డి జామెట్రీ; కో ఆర్డినేట్‌ జామెట్రీ; వెక్టార్‌ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్‌; కాంప్లెక్స్‌ నెంబర్స్‌; పారాబోలా;ట్రిగ్నోమెట్రిక్‌ రేషియోస్‌; క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌; థియరీ ఆఫ్‌ ఈక్వేషన్స్‌; పెర్ముటేషన్‌ అండ్‌ కాంబినేషన్‌; బైనామియల్‌ థీరమ్‌; లోకస్‌ అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.

ఫిజిక్స్‌

న్యూమరికల్‌ అప్రోచ్‌తో ప్రశ్నలు అడిగే ఫిజిక్స్‌లో రాణించాలంటే.. ఎలక్ట్రో డైనమిక్స్, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్‌ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెచ్‌ఎం అండ్‌ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. వీటితోపాటు సెంటర్‌ ఆఫ్‌ మాస్, మూమెంటమ్‌ అండ్‌ కొలిజన్‌; సింపుల్‌ హార్మోనిక్‌ మోషన్, వేవ్‌ మోషన్‌ అండ్‌ స్ట్రింగ్‌ వేవ్స్‌లో లోతైన అవగాహన ఏర్పరచుకుంటే.. మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. ప్రిపరేషన్‌ సమయంలో ప్రాథమిక భావనలను వాస్తవ పరిస్థితులతో అన్వయించుకుంటూ.. ప్రాక్టీస్‌ చేయాలి. తద్వారా న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నలకు సులువుగా సమాధానం ఇచ్చే నైపుణ్యం లభిస్తుంది.

కెమిస్ట్రీ

విద్యార్థులు కాసింత సులభంగా భావించే సబ్జెక్ట్‌ ఇది. గత ఏడాది నుంచి కెమిస్ట్రీ విభాగంలోనూ న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నల విధానాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో విద్యార్థులు కొన్ని ముఖ్య టాపిక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కెమికల్‌ బాండింగ్, పిరియాడిక్‌ టేబుల్, బ్రేకింగ్‌ల మూలాలపై నైపుణ్యాలను పెంచుకోవాలి. మోల్‌ కాన్సెప్ట్, కోఆర్డినేషన్‌ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి–బ్లాక్‌ ఎలిమెంట్స్, అటామిక్‌ స్ట్రక్చర్, గ్యాసియస్‌ స్టేట్, ఆల్డిహైడ్స్‌ అండ్‌ కీటోన్స్, జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, డి అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి.


చ‌ద‌వండి: AP Inter Exams : ఏపీ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల తేదీలు మార్పు.. కొత్త తేదీలు ఇవే.. ప్రాక్టికల్స్ మాత్రం..

ఇంటర్‌ సిలబస్‌తో అనుసంధానం

  • జేఈఈ–మెయిన్‌–2022 తొలి దశ పరీక్షకు హాజరవ్వాలనుకునే విద్యార్థులు ఇంటర్మీడియెట్‌ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్‌ సాగించాలి. ఏప్రిల్‌లో జరిగే తొలి సెషన్‌లో సరిగా రాయకపోయినా.. ఆందోళన చెందకుండా.. మేలో జరిగే రెండో సెషన్‌కు సన్నద్ధం అయ్యేలా ప్రణాళిక రూపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 
  • ఇదే సమయంలో జేఈఈ–అడ్వాన్స్‌డ్‌–2022 తేదీని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్‌ సాగించాలని సూచిస్తున్నారు. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ను జూలై 3వ తేదీ నిర్వహించనున్నారు. 
  • అంటే.. జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ తర్వాత జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు లభించే సమయం దాదాపు నెల రోజులు మాత్రమే. కాబట్టి జేఈఈ–మెయిన్‌ మే సెషన్‌తోపాటు అడ్వాన్స్‌డ్‌కు కూడా ఉమ్మడి ప్రిపరేషన్‌ సాగించాల్సి ఉంటుంది.

సమయ పాలన ప్రధానం

ప్రస్తుతం సమయ పాలన అత్యంత ప్రధానంగా నిలవనుంది. ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.. ఈపాటికే సిలబస్‌ పూర్తి చేసుకుని ఉండాలి. ఒక వేళ ఆన్‌లైన్‌ తరగతులు, ఇతర సమస్యల కారణంగా సిలబస్‌ పూర్తి చేయని విద్యార్థులు.. ఇప్పటి వరకు పూర్తి చేసిన ఇంటర్‌ సిలబస్‌ను.. మెయిన్‌ సిలబస్‌తో అనుసంధానం చేసుకోవాలి. ఇకపై ఇంటర్మీడియెట్‌ అంశాలను కూడా మెయిన్‌ సిలబస్‌తో పోల్చుకుంటూ అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో అభ్యసనం సాగించాలి. దీనివల్ల ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధత లభిస్తుంది.

ఇంటర్‌కు ప్రత్యేక సమయం

ఇంటర్‌ వార్షిక పరీక్షలకు విద్యార్థులు ప్రత్యేక సమయం కేటాయించాలి. ఇంటర్‌ పరీక్షలకు కనీసం నెల రోజుల ముందు నుంచి పూర్తిగా ఇంటర్‌ ప్రిపరేషన్‌కే సమయం కేటాయించాలి. ఈ సమయంలో రెండు పరీక్షలకు ప్రిపరేషన్‌ సాగించడం వల్ల మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది.

జేఈఈ–మెయిన్‌–2022 సమాచారం

  • అర్హతలు: 10+2/ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ ఉత్తీర్ణత ఉండాలి. 2020, 2021లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, 2022లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులు.
  • జేఈఈ మెయిన్‌ రెండు సెషన్లుగా.. తొలి సెషన్‌ ఏప్రిల్, రెండో సెషన్‌ మే నెలలో జరుగనుంది. 
  • ఏ పరీక్షలో అత్యుత్తమ స్కోర్‌ వచ్చిందో ఆ స్కోర్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌కు, జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది.
  • జూలై 3న జేఈఈ–అడ్వాన్స్‌డ్‌–2022 పరీక్ష నిర్వహించనున్నారు.
  • జేఈఈ–మెయిన్‌ నుంచి 2.5 లక్షల మందికి జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు అర్హత లభిస్తుంది.
  • జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • మొదటి సెషన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.03.2022
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: jeemain.nta.nic.in, https://nta.ac.in

ప్రతి సబ్జెక్ట్‌ చదివేలా

విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్టంగా కొన్ని గంటల సమయం కేటాయించాలి. చదివే ప్రతి అంశాన్ని వాస్తవ పరిస్థితులతో అన్వయం చేసుకుంటూ.. అభ్యసనం సాగించాలి. అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి ప్రాక్టీస్‌ అత్యంత ప్రాధాన్యం అని గుర్తించాలి. మార్చి పరీక్షలో మంచి మార్కుల సాధన కోసం రివిజన్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. మార్చి సెషన్‌లో సరిగా ప్రతిభ చూపకపోతే.. ఆ ఫలితాలను విశ్లేషించుకుని తదుపరి సెషన్‌కు మరింత సమర్థంగా ప్రిపరేషన్‌ సాగించాలి. మాక్‌ టెస్ట్‌లకు హాజరు కావడం, ఎన్‌టీఏ అందుబాటులో ఉంచిన ప్రాక్టీస్‌ టెస్ట్‌ సెంటర్లను వినియోగించుకోవడం మేలు చేస్తుంది.
– ఎం.ఎన్‌.రావు, సబ్జెక్ట్‌ నిపుణులు
​​​​​​​

చ‌ద‌వండి: JEE-Advanced 2022: జేఈఈ(అడ్వాన్స్‌డ్‌) 2022 ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

Published date : 03 Mar 2022 04:29PM

Photo Stories