Skip to main content

JEE Main 2022: తుది ఫలితాలు తేదీ ఇదే..

Indian Institute of Technologies (IITs), National Institute of Technology (NIT)ల్లో ప్రవేశానికి నిర్వహించిన Joint Entrance Examination (JEE) మెయిన్‌–2022 తుది ఫలితాలు ఆగస్టు 6న వెలువడనున్నాయి.
JEE Main 2022
జేఈఈ మెయిన్–2022 తుది ఫలితాలు తేదీ ఇదే..

అభ్యర్థుల స్కోరుతోపాటు ర్యాంకులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలను జూలై 25 నుంచి 30 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 6.29 లక్షల మంది హాజరయ్యారు. కంప్యూటరాధారితంగా నిర్వహించిన ఈ పరీక్షల ప్రాథమిక కీని ఎన్‌టీఏ ఆగస్టు 3న రాత్రి విడుదల చేసింది. ఈ ప్రాథమిక కీపై అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఆగస్టు 5 (శుక్రవారం) సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేయడానికి అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఒక్కొక్క ప్రశ్నకు ఇచ్చిన కీపై ఆధారాలతో రూ.200 చొప్పున ఫీజు చెల్లించి చాలెంజ్‌ చేయొచ్చని వెల్లడించింది. పేపర్‌–1.. బీఈ, బీటెక్, పేపర్‌ 2ఏ.. బీఆర్క్, పేపర్‌ 2బీ.. బీప్లానింగ్‌ పరీక్షల ప్రాథమిక కీలను వేర్వేరుగా ఎన్‌టీఏ https://jeemain.nta.nic.in లో పొందుపరిచింది. ఈ పోర్టల్‌ ద్వారా అభ్యర్థులు తమ అభ్యంతరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వీటిని నిపుణుల కమిటీతో పరిశీలన చేయించి ఎన్‌టీఏ తుది నిర్ణయం తీసుకోనుంది. అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు సరైనవి అయితే ప్రాథమిక కీని సవరించి తుది కీని విడుదల చేస్తుంది. కాగా తుది కీ అనంతరం ఆగస్టు 5 అర్ధరాత్రి లేదా 6న జేఈఈ మెయిన్‌ స్కోరు, ర్యాంకుల వారీగా తుది ఫలితాలను విడుదల చేయనుంది.

చదవండి: JEE Main 2022: ర్యాంకెంత? సీటెక్కడ?

7 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్లు

కాగా జేఈఈ మెయిన్‌లో టాప్‌ 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ అభ్యర్థులు ఆగస్టు 7 నుంచి 11లోపు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 28న అడ్వాన్స్‌డ్‌ పేపర్‌–1 పరీక్షను ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, పేపర్‌–2ను మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తుది ఫలితాలను సెప్టెంబర్‌ 11న ప్రకటించనున్నారు.

చదవండి: ఐఐటీల్లో 4,500 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీ

Published date : 05 Aug 2022 04:55PM

Photo Stories