Skip to main content

ఇదే కృషితో ఐఏఎస్‌ కొట్టాలి: సీఎం

ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చున్న చోట రోజు వారీ సమావేశాల్లో ఐఏఎస్‌ అధికారులు కూర్చుంటారు. వారితో కలిసి వివిధ రంగాల్లో స్థితిగతులు, రాష్ట్రంలో పరిస్థితి, వివిధ పథకాల అమలుపై సమీక్షలు చేస్తాం. ఇప్పుడు ఏ స్ఫూర్తితో అయితే మీరు కష్టపడి ఐఐటీల్లో చేరడానికి మంచి ర్యాంకులు సాధించారో.. అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో, కష్టపడి ఐఏఎస్‌ అధికారులు కావాలని నేను ఆకాంక్షిస్తున్నా. అప్పుడు మీరూ ఇదే స్థానాల్లో కూర్చుని పరిపాలనలో భాగస్వాములు కావచ్చు.
ys jagan mohan reddy
ఇదే కృషితో ఐఏఎస్‌ కొట్టాలి: సీఎం

రాష్ట్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, గిరిజన రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివి ప్రతిష్టాత్మక ఐఐటీ ఇతర ఉన్నత విద్యాసంస్థల ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఈ కృషిని ఇలాగే కొనసాగిస్తే కచ్చితంగా ఐఏఎస్ స్థానాల్లో కూర్చుంటారని విద్యార్ధుల్లో స్ఫూర్తి నింపారు. జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్ధులు అక్టోబర్ 26న సీఎం జగన్ ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించి ల్యాప్టాప్లను బహూకరించారు. వారితో ప్రత్యేకంగా సమావేశమై ప్రతి ఒక్కరినీ పరిచయం చేసుకున్నారు. విద్యార్థుల నేపథ్యాన్ని అడిగి తెలుసుకుని మరింత రాణించాలని ప్రోత్సహించారు.

స్ఫూర్తి రగిలించే కథలు ఇక్కడే..

విద్యారంగంపై ప్రభుత్వాలు చూపే శ్రద్ధ, ధ్యాస పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతాయనడంలో ఎలాంటి సందేహం లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. విద్యారంగాన్ని సంస్కరిస్తూ అమ్మఒడి, నాడు–నేడు సహా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే అధికారులు మన ముందే ఉన్నారన్నారు. ‘మీ ముందే ఇద్దరు ఐఏఎస్ అధికారులు కాంతిలాల్ దండే, సునీత మాట్లాడారు. వారు కూడా మీలాంటి వారే. ఐఏఎస్ అధికారులయ్యారు. మీరంతా వారి నుంచి స్ఫూర్తి పొందాలి. ఇది అసాధ్యం కానే కాదు. ఐఐటీ వరకూ మీరు చేరుకోగలిగారు. ఇది దాటితే ప్రపంచం మీకు మెరుగైన అవకాశాల రూపంలో ద్వారాలు తెరుస్తుంది. మీరు ఇప్పటికే ఒక స్థాయికి చేరుకున్నారు. తొలి అడుగు వేసినట్లే భావించండి’ అని విద్యార్థులనుద్దేశించి సీఎం పేర్కొన్నారు. దేవుడి దయతో కష్టపడి చదువుతున్నారని, ఇలాగే కొనసాగించి దృష్టి కేంద్రీకరిస్తే కచ్చితంగా ఐఏఎస్ల స్థానాల్లో కూర్చుంటారని భరోసా కల్పించారు.

అత్యంత సాధారణ నేపథ్యాలే..

ఐఏఎస్ల్లో చాలామంది నేపథ్యాలు అత్యంత సాధారణమైనవని, సీఎంవోలో అదనపు కార్యదర్శిగా ఉన్న ముత్యాలరాజే దీనికి నిదర్శనమని సీఎం జగన్ చెప్పారు. ‘ముత్యాలరాజు జీవితం మన హృదయాలను కదిలిస్తుంది. వాళ్ల ఊరికి వెళ్లాలంటే పడవలే మార్గం. మనకు స్ఫూర్తినిచ్చే కథలు ఎక్కడో లేవు. ఇదే గదిలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల రూపంలో ఉన్నాయి. మీరు ఇదే కృషి కొనసాగిస్తే కచ్చితంగా ఆ స్థాయికి చేరుకుంటారు. నా పక్కనున్న స్థానాల్లో మీరు కనిపిస్తారు’ అని సీఎం పేర్కొన్నారు.

ఏ సహాయం కావాలన్నా సరే..

తన వైపు నుంచి సీఎంవో అదనపు కార్యదర్శి ముత్యాలరాజు అందుబాటులో ఉంటారని, ఫోన్ నంబరు ఇస్తారని, ఎప్పుడు అవసరమున్నా.. ఏం కావాలన్నా సహాయంగా నిలుస్తారని విద్యార్థులకు సీఎం భరోసానిచ్చారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నారు. ఈ అధికారులంతా మీ స్థాయి నుంచే వచ్చారు కాబట్టి ఎలాంటి సమస్యలు వస్తాయి? ఎలా పరిష్కరించాలి? ఏ రకంగా మీకు తోడుగా నిలవాలనే విషయాలు వారికి బాగా తెలుసని సీఎం విద్యార్థులతో పేర్కొన్నారు.

మొత్తం వ్యవస్థే మారిపోతుంది..

గిరిజన ప్రాంతాల నుంచి, కర్నూలులోని ఎమ్మిగనూరు తదితర చోట్ల నుంచి విద్యార్థులు ఐఐటీలో ర్యాంకు సాధించడం గర్వించదగ్గ విషయమని సీఎం అభినందించారు. ‘నేను పాదయాత్ర చేసినప్పుడు ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని ఎంత వెనకబడి ఉన్నాయో చూశా. అలాంటి ప్రాంతం నుంచి ఇద్దరు ముగ్గురు కలెక్టర్లు వస్తే మొత్తం వ్యవస్థే మారిపోతుంది. అక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలు పెరుగుతాయి. పెద్ద పెద్ద చదువులు చదవాలన్న తపన పెరుగుతుంది. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మార్గదర్శకంగా భావించి మెరుగైన చదువులు చదివే పరిస్థితి వస్తుంది. మొత్తం మార్పు కనిపిస్తుంది. ఇది జరగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా’ అంటూ సీఎం స్ఫూర్తినిచ్చేలా మాట్లాడారు.

వైఎస్సార్ చొరవతో మూడేళ్లలోనే ఊరికి బ్రిడ్జి: ముత్యాలరాజు

విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా తన ప్రస్థానాన్ని తెలియజేయాలని సీఎం కోరడంతో సీఎంవో అదనపు కార్యదర్శి ముత్యాలరాజు తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ‘మాది కృష్ణా జిల్లా సరిహద్దులోని చిన్న గొల్లపాలెం. మా ఊరు ఒక దీవి. అటు పశ్చిమ గోదావరి ఇటు కృష్ణా జిల్లాకు వెళ్లేందుకు ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. చాలా మంది గర్భిణులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. నా సొంత చెల్లెలే ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నా. ఈ పరీక్షల్లో నాకు అఖిల భారత స్థాయిలో నంబర్ వన్ ర్యాంకు వచ్చింది. అప్పటి సీఎం వైఎస్సార్ పిలవడంతో నా తల్లిదండ్రులతో వెళ్లి కలిశా. ఏం కావాలని వైఎస్సార్ అడిగితే మా ఊరికి బ్రిడ్జి సదుపాయం కల్పించాలని కోరా. నేను రిటైర్ అయ్యేలోగా మా ఊరికి బ్రిడ్జి తేగలనేమోనని అనుకున్నా. వైఎస్సార్ చొరవతో మూడేళ్లలోనే బ్రిడ్జి వేయగలిగాం. దీనికోసం రూ.26 కోట్ల నిధులను ఆయన కేటాయించారు. ప్రస్తుతం విద్యా సంబంధిత అంశాలపై దృష్టిపెట్టా. అమ్మ ఒడి, నాడు–నేడు కార్యక్రమాలు చురుగ్గా చేయగలిగాం. ఏపీ చరిత్రలో ఇన్ని సీట్లు రాలేదు’ అని ముత్యాలరాజు తెలిపారు.

ఇప్పటివరకూ 179 మందికి మంచి ర్యాంకులు

రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల నుంచి ఇప్పటివరకూ 179 మంది విద్యార్థులు వివిధ ఐఐటీలు, ఐఐటీల్లో ప్రిపరేటరీ కోర్సులు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీట్లు సాధించారు. 2014లో ఒకే ఒక్క గిరిజన విద్యార్థి ఐఐటీకి ఎంపిక కాగా 2021లో 30 మంది సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల విద్యార్థులు సీట్లు సాధించేలా ర్యాంకులు తెచ్చుకోవడం గమనార్హం. వీరిలో 9 మంది నేరుగా ఐఐటీకి అర్హత సాధించగా 21 మంది విద్యార్థులు ప్రిపరేటరీ కోర్సు (ఏడాది పాటు ఐఐటీ నిపుణులతో శిక్షణ) అనంతరం మళ్లీ ఎలాంటి అర్హత పరీక్ష లేకుండా నేరుగా ఐఐటీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందనున్నారు. 7 వేల లోపు ర్యాంకులు సాధించిన మరో 59 మంది ఎన్ఐటీల్లో ప్రవేశాలు పొందనున్నారు. ఇంకా కౌన్సిలింగ్ జరుగుతున్నందున మరింతమందికి సీట్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వీటితోపాటు నీట్ తదితర ప్రవేశ పరీక్షల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని, వాటిలో కూడా ర్యాంకులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

సీఎం ఉన్నారనే ధైర్యంతోనే చదువుకోగలిగాం

మాది.. విశాఖ జిల్లా అనంతగిరి మండలం కోటపర్తివలస. జేఈఈ అడ్వాన్స్ డ్ ఎస్టీ కేటగిరీలో నాకు 596వ ర్యాంక్ వచ్చింది. నేను ఈ ర్యాంకు సాధించడానికి సీఎం జగనన్నే నాకు స్ఫూర్తి. అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, గోరుముద్ద వంటి పథకాలు మాకు బాగా ఉపయోగపడ్డాయి. కరోనా కష్టకాలంలో మేము భయపడకుండా చదువుకోగలిగామంటే జగనన్న ఉన్నారన్న ధైర్యమే కారణం. సివిల్స్ సాధించి నాలాంటి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అండగా ఉండటమే నా లక్ష్యం.
– వరలక్ష్మి, స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్, మారికవలస, విశాఖపట్నం జిల్లా

జగనన్న అమ్మఒడితో ఎంతో ప్రోత్సాహం..

మాది విజయనగరం జిల్లా కొట్టక్కి. జేఈఈ అడ్వాన్స్ డ్ ఎస్టీ కేటగిరీలో నాకు 333వ ర్యాంకు వచ్చింది. అమ్మానాన్న వెదురుబుట్టలు అల్లుతారు. సీఎం సారే మాకు స్ఫూర్తి. నాలాంటి విద్యార్థుల సంక్షేమం కోసం మనబడి నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి వంటి మంచి పథకాలు ప్రవేశపెట్టారు. వాటితో మా చదువులకు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు.
– పార్ధసారధి, స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్, పార్వతీపురం, విజయనగరం జిల్లా

‘నాడు–నేడు’తో మా కళాశాలను బాగా అభివృద్ధి చేశారు

నాకు జేఈఈ అడ్వాన్స్ డ్ ఎస్సీ కేటగిరీలో 507వ ర్యాంకు వచ్చింది. నేను ఎల్బీ చర్ల, నర్సాపురంలోని ఎస్సీ సంక్షేమ కళాశాలలో చదువుకున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో స్ఫూర్తి కార్యక్రమం మాకు ఎంతో ఉపయోగపడింది. మంచి శిక్షణ అందించారు. ప్రభుత్వం నాడు–నేడు ద్వారా మా కళాశాలను చాలా బాగా అభివృద్ధి చేసింది.
– బి.తరుణ్, గణపవారిగూడెం, లింగపాలెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా
చదవండి:

క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు

Education: ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చదువులు ఉండాలి: ముఖ్యమంత్రి

Bhagavad Gita: బుల్లి భగవద్గీత.. స్మాలెస్ట్‌ హ్యాండ్‌ రైటింగ్‌తో అబ్బురపరుస్తున్న విద్యార్థి

Published date : 27 Oct 2021 12:25PM

Photo Stories