Success Story: అన్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్... తమ్ముడు ఐపీఎస్
కోట కిరణ్ చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదివి ఐపీఎస్ సాధించారు. మొదటి ప్రయత్నంలో రాలేదు. తాను దిగులు చెందలేదు. రెండో ప్రయత్నంలోనూ రాలేదు.. అయినా చెదరలేదు. ముచ్చటగా మూడో ప్రయత్నంలో అనుకున్నది సాధించారు. సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి మొదలైన కిరణ్ ప్రస్థానం ఐఐటీ ఖరగ్‌పూర్ దాకా సాగింది. నావల్ ఆర్కిటెక్చర్, ఓషన్ ఇంజినీరింగ్ పూర్తి చేసి సివిల్ సర్వెంట్‌గా ప్రజలకు సేవలు అందించాలన్న లక్ష్యంతో యూపీఎస్సీ పరీక్షలకోసం ప్రిపేర్ అయ్యారు. ఆయన సక్సెస్ స్టోరీ మీ కోసం...
సర్పంచ్‌గా కిరణ తల్లి...
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామానికి చెందిన కిరణ్ సివిల్స్‌లో ర్యాంకు సాధించారని తెలియగానే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పండుగ చేసుకున్నారు. ఓ మారుమూల గ్రామం నుంచి ఐపీఎస్‌గా ఎంపికైన కిరణ్‌ను ఆ ప్రాంత విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. కిరణ్ తల్లి వజ్రమ్మ బీమవరం సర్పంచిగా కూడా పనిచేశారు.
ఇంటర్ వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే....
సాధారణంగా సివిల్స్ పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే పట్టణ వాతావరణంలో పెరగాలి... ఇంగ్లిష్ బాగా రావాలి అనే అపోహ ఉంటుంది. కానీ ఏ వాతావరణంలో పెరిగినా.. ఎక్కడ చదువుకున్నా.. ఇంగ్లిష్ వచ్చినా రాకున్నా కృషి, పట్టుదలతో సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించవచ్చని కోట కిరణ్ నిరూపించారు. కోట కృష్ణయ్య, వజ్రమ్మల చిన్న కొడుకు కిరణ్ ప్రాథమిక విద్య స్థానిక భీమవరం ప్రా«థమికోన్నత పాఠశాలలోనే సాగింది. అనంతరం ఐదో తరగతి నుంచి పదో తరగతి దాకా దమ్మపేట గురుకుల పాఠశాలలోనూ.. అనంతరం ఇంటర్ నాగోల్ గురుకులంలో సాగింది.
మూడో ప్రయత్నంలో 652 ర్యాంకు...
ఇంటర్ తర్వాత ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ పూర్తిచేసి సివిల్స్ ప్రిపరేషన్ కు కిరణ్ సన్నద్ధమయ్యారు. ఒకటి.. రెండు ప్రయత్నాల్లో విజయం దక్కకపోయిన.. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో విరామం లేకుండా విసుగు చెందకుండా అనుకున్నది సాధించేదాకా విశ్రమించలేదు. 2020 యూపీఎస్సీ పరీక్షల్లో 652 ర్యాంకు సాధించారు. కిరణ్ అన్న కోట బాబురావు పెద్దపల్లి జిల్లా తాండూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు.