IPS Richa Thomar Success Story: ఏడాది చిన్నారిని వదిలి... ఐపీఎస్ శిక్షణకు...
ఇలాంటి కోవలోకే వస్తారు రిచాతోమర్. ఆమె సక్సెస్ మీకోసం...
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం....
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లా హసన్‌పూర్‌జీవానీ గ్రామానికి చెందిన రిచా తోమర్ విద్యాభ్యాసం అంతా గ్రామీణ వాతావరణంలో, ప్రభుత్వ పాఠశాలల్లోనే సాగింది. తోమర్ తండ్రి రాజేంద్రపాల్ సింగ్. ఈయన సాధారణ రైతు. ఆరుగురు సంతానంలో తోమర్ నాలుగో సంతానం. మైక్రోబయాలజీలో మాస్టర్స్ డిగ్రీ పొందిన ఆమె మొదటగా యూపీ ప్రభుత్వంలో డానిప్స్ (ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవుల పోలీస్ సర్వీస్) అధికారిగా కూడా పనిచేశారు. దిల్లీకి చెందిన పోలీస్ అధికారి రజనీష్‌ని వివాహం చేసుకున్నారు.
ఏడాది చిన్నారిని అత్త దగ్గర వదిలేసి....
ఏడాదిన్నరపాటు ఉండే శిక్షణ పూర్తి చేసుకోవడం చాలా కష్టం. శారీరక దృఢత్వాన్ని నిరూపించుకునే ఈవెంట్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏడాది వయసున్న తన కుమారుడు శివాంష్‌ను తప్పనిసరి పరిస్థితుల్లో అత్త ఇంటి దగ్గర వదిలేసి శిక్షణకు వెళ్లారు రిచా. శిక్షణలో కష్టమైన లక్ష్యాలన్నింటిని పూర్తి చేసి... 2016 బ్యాచ్‌కు చెందిన మహిళ ఐపీఎస్‌లలో టాపర్‌గా నిలిచారు. శిక్షణలో మాత్రం రిచా ప్రయాణం మిగిలిన వారి కంటే భిన్నంగానే సాగిందని చెప్పాలి. ఏడాది చిన్నారికి దూరంగా ఉంటూ... శిక్షణలో టాపర్‌గా నిలవడం అంటే ఎంతో అకుంటిత దీక్ష ఉంటే సాధ్యమవుతుంది.
శిక్షణ పూర్తికాగానే రాజస్థాన్ కేడర్‌కు....
శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఆమెను రాజస్థాన్ కేడర్‌కు కేటాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి పెద్ద నేరం ఒక చిన్న సమస్యతో ప్రారంభమవుతుంది, దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. నేను మూడు విషయాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నా. నిస్సహాయ పరిస్థితుల్లో ప్రజలు పోలీసుల వద్దకు వస్తారు. మేము వారి సమస్యను అర్థం చేసుకోవాలి. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను అరికట్టేందుకు చర్యలు చేపడతానని అంటున్నారు.