Skip to main content

Inspirational Story Of IRS Officer Suresh: ఫుట్‌పాత్‌ మీదే నిద్రలేని రాత్రులు... కట్‌ చేస్తే ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌

రోడ్ల మధ్య చిన్నచిన్న గతుకులు ఉంటేనే ఎక్కడ లేని చిరాకు వస్తుంది. అసలు రోడ్డు అంటే ఏంటో తెలియదు. అలాంటి కుగ్రామం నుంచి వచ్చిన ఓ పిల్లాడు ఐఆర్‌ఎస్‌ అధికారి అయ్యాడు.
IRS Suresh

ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌ సురేష్‌ లఖావత్‌ సక్సెస్‌ స్టోరీ ఆయన మాటల్లోనే....
ఐదేళ్ల వయసులోనే తండాకి దూరమయ్యా...
మాది తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం సర్వాపురం తండా. తాతల కాలం నుంచీ వ్యవసాయ కూలీగానే పనిచేసేవాళ్లం. 10 కిలోమీటర్లు నడిచి వెళ్తే చిన్న పట్టణానికి చేరుకోగలం. నాకు ఐదేళ్ల వయసులో ఓ భూస్వామి.. ‘వీణ్ని మా ఇంట్లో పనికి తీసుకుపోతున్నా’అంటూ మా తాతతో చెప్పి నన్ను పట్టుకెళ్లాడు. అలా భూస్వామి ఇంట్లోనే పని చేస్తూ, వాళ్ల పిల్లలతోపాటే చదువుకునేవాడిని. బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఎంట్రె¯Œ ్స ఎగ్జామ్‌ రాస్తే భూస్వామి పిల్లలకు రాని సీటు నాకు వచ్చింది. అంతే, ఫలితాల రోజే ‘ఇంట్లో నుంచి వెళ్లిపోరా...’అంటూ భూస్వామి ఆదేశించాడు. 
స్కాలర్‌షిప్‌ కోసం తిరగుతూ.. ఫుట్‌పాత్‌పైనే నిద్ర
నేను నా తండ్రితో కలిసి హైదరాబాద్‌ రైల్‌ ఎక్కేశా. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో ఎస్టీ రిజర్వేషన్‌ కోటాలో సీటొచ్చింది.. కానీ, ఫీజు కట్టేందుకు డబ్బుల్లేవు. అప్పటివరకు పని చేయించుకున్న భూస్వామి ఫీజు కట్టేందుకు నిరాకరించారు. దీంతో స్కాలర్‌ షిప్‌ కోసం పడిగాపులు కాశా. నాన్నతో కలిసి హైదరాబాద్‌లోని మసాబ్‌ ట్యాంక్‌లో ఉన్న ∙ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగా. 20 రోజులపాటు ఫుట్‌పాత్‌ పైనే పడుకున్నాం. ఎట్టకేలకు స్కాలర్‌ షిప్‌ మంజూరు కావడంతో హెచ్‌పీఎస్‌ లో చేరా. అక్కడ అంతా ధనవంతుల పిల్లలు చదువుకునే వారు. వారితో కలిసిపోవడానికి నాకు చాలా టైం పట్టింది.  
స్కూల్‌లో బెస్ట్‌ అథ్లెట్‌గా రికార్డు...
చదువుల్లో రాణిస్తూనే ఆటలపై కూడా దృష్టి సారించా. దీంతో స్కూల్‌లో బెస్ట్‌ అథ్లెట్‌గా పేరొచ్చింది. ట్రాక్, ఫీల్డ్‌లో సత్తా చాటుకుంటూ వందలాది మెడల్స్‌ సాధించా. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ చరిత్రలో ‘హెడ్‌ బాయ్‌’ హోదాను సాధించిన ఏకైక ఎస్టీ విద్యార్థి నేనే. ఐసీఎస్సీ, ఐఎస్సీ స్కూల్‌ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెటిక్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించా. 2005లో పాసవుట్‌ అయిన తర్వాత ఢిల్లీకి మకాం మార్చా. 
ఫ్రెండ్‌ సాయంతో డిగ్రీ పూర్తి...
తన క్లాస్‌ మేట్, క్లోజ్‌ ఫ్రెండ్‌ అండతో ఢిల్లీలోని శ్రీవెంకటేశ్వర కాలేజీలో డిగ్రీ చేరా. నా వసతి, చదవుకు అయ్యే మొత్తాన్ని అతడే చూసుకున్నాడు. 2008లో డిగ్రీ పూర్తిచేసిన తర్వాతి ఏడాదిలోనే సివిల్స్‌ ర్యాంకు సాధించా. నాగపూర్‌ లోని ‘నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌’ ఐఆర్‌ఎస్‌ అకాడమీలో చేరా. శిక్షణలో నా బ్యాచ్‌ మేట్‌ కనికా అగర్వాల్‌తో పరిచయం, ప్రేమ ఏర్పడడంతో 2013లో పెళ్లి చేసుకున్నాం. ఇప్పటివరకు తన గ్రామానికి రోడ్డు లేకపోవడంతో తాళ్లపూసలపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి తండా వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. 2011 వరకు ఆ గ్రామ వాసులకు కరెంట్‌ ఉండేది కాదు. ఇప్పుడు దాతల సాయంతో ఆ గ్రామం రూపురేఖలు మారుతున్నాయి.  ‘నా ఆశయం ఒక్కటే. మన ఎదుగుదల మన ఊరికి దోహదపడాలి. అప్పుడే మనం సాధించిన విజయాలకు, మన హోదాలకు సార్థకత. అందుకే తండా  అభివృద్ధికి కృషి చేస్తూ రుణం తీర్చుకుంటున్నానని సురేష్‌ చెబుతారు. యువతరానికి నేను చెప్పేదొక్కటే.. పేదరికం ఎదుగుదలకు అడ్డుకాకూడదు.  దృఢ సంకల్పంతో ముందుకుసాగాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది.

Published date : 15 Dec 2022 06:53PM

Photo Stories