Skip to main content

విజయానికి విశ్లేషణాత్మక అధ్యయనం

Bavitha కామర్స్‌లో పదిలమైన కెరీర్‌ను లక్ష్యంగా ఎంపిక చేసుకున్న వారు వేయాల్సిన తొలి అడుగు.. ఇంటర్మీడియెట్‌లో కామర్స్ ఒక సబ్జెక్టుగా ఉన్న గ్రూప్‌లో చేరడం. ఇలాంటి గ్రూపులో ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన గ్రూపు ఎంఈసీ (మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్). ఈ నేపథ్యంలో సబ్జెక్టుల వారీగా పాఠ్యాంశాలు, బోర్డు పరీక్షల్లో అధిక మార్కులు పొందేందుకు, భవిష్యత్తులో ఉన్నత స్థాయి ప్రొఫెషనల్ కోర్సుల్లో రాణించేందుకు సబ్జెక్టు నిపుణుల సూచనలు...

మ్యాథమెటిక్స్
1(ఎ) సిలబస్:
ప్రమేయాలు (11 మార్కులు), మాత్రికలు (22), త్రికోణమితీయ నిష్పత్తులు (15), త్రిభుజ ధర్మాలు (11) తదితర అంశాలు..
ప్రశ్నపత్రం: విద్యార్థులు మొత్తం 75 మార్కులకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సెక్షన్-ఎ లో 10 అతిస్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. వీటన్నింటికీ సమాధానాలు రాయాలి. ఒక్కో దానికి రెండు మార్కులు. సెక్షన్-బిలో 7 స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో ఐదింటికి స మాధానాలు రాయాలి. ఒక్కో దానికి నాలుగు మార్కులు.
  • సెక్షన్-సిలో 7 దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో ఐదింటికి సమాధానాలు రాయాలి. ఒక్కో దానికి 7 మార్కులు.
ప్రిపరేషన్ వ్యూహం:
  • విద్యార్థులు వెయిటేజీని అనుసరించి ప్రిపరేషన్ కొనసాగించాలి. 1, 2, 3, 5, 6, 10 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. 3వ యూనిట్ నుంచి రెండు దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. మొత్తంమీద ఈ యూనిట్ నుంచి 22 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. కాబట్టి విద్యార్థులు దీనిపై ఎక్కువ దృష్టి సారించాలి.
  • 1వ యూనిట్ నుంచి ఒక సిద్ధాంతం తప్పకుండా వస్తుంది. అందువల్ల ఉన్న ఆరు సిద్ధాంతాలను శ్రద్ధగా నేర్చుకోవాలి. 3, 4, 5, 6, 7, 8, 10 యూనిట్ల నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి.
  • 1, 3, 4, 5, 6, 9 యూనిట్ల నుంచి అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. ఇందులో 1, 3, 4, 6 యూనిట్ల నుంచి రెండేసి ప్రశ్నలు వస్తాయి. అధిక మార్కులు సాధించేందుకు అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు ఉపయోగపడతాయి. అందువల్ల వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
1 (బి):
సిలబస్:
బిందుపథం (4 మార్కులు);అక్ష పరివర్తనం (4 మార్కులు); సరళరేఖలు (15 మార్కులు); సరళరేఖాయుగ్మాలు (14 మార్కులు); త్రిపరిమాణ నిరూపకాలు (2 మార్కులు); దిక్ కొసైన్‌లు, దిక్ సంఖ్యలు (7 మార్కులు); సమతలం (2 మార్కులు); అవధులు, అవిచ్ఛిన్నత (8 మార్కులు); అవకలనం (15 మార్కులు); అవకలజాల అనువర్తనాలు (26 మార్కులు). ప్రశ్నపత్రం: 1 (బి) ప్రశ్నపత్రం కూడా 1 (ఎ) ప్రశ్నపత్రం తరహాలోనే ఉంటుంది.

పిపరేషన్ వ్యూహం:
అధిక వెయిటేజీ ఉన్న సరళరేఖలు, సరళరేఖా యుగ్మాలు, అవకలనం, అవకలజాల అనువర్తనాలను బాగా చదవాలి. 3, 4, 6, 9, 10 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. వీటిలో 4, 10 యూనిట్ల నుంచి రెండేసి ప్రశ్నలు వస్తాయి.
  • 1, 2, 3, 8, 9, 10 యూనిట్ల నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. పదో యూనిట్ నుంచి రెండు స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి.
  • 3, 5, 7, 8, 9, 10 యూనిట్ల నుంచి అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. వీటిలో 3, 8, 9, 10 యూనిట్ల నుంచి రెండేసి ప్రశ్నలు వస్తాయి.
  • సరళరేఖా యుగ్మాలు యూనిట్‌లో సమఘాత పరచటం పాఠ్యాంశం నుంచి ఓ దీర్ఘ సమాధాన ప్రశ్న తప్పకుండా వస్తుంది. కాబట్టి విద్యార్థులు దీన్ని బాగా సాధన చేయాలి.
  • విద్యార్థులు ప్రతి యూనిట్ చివర్లో ఇచ్చిన సూత్రాలను సాధన చేయాలి. అప్పుడే సమస్యల్ని తేలిగ్గా సాధించేందుకు వీలవుతుంది.
- ఎస్‌ఎస్‌సీవీఎస్ రామారావు, శ్రీమేధ విద్యా సంస్థలు

కామర్స్
ఇంటర్మీడియెట్ మొదటి ఏడాది ఎంఈసీలో చేరిన విద్యార్థులు వాణిజ్య శాస్త్రం (కామర్స్) అంశాలపై పట్టు సాధిస్తే.. భవిష్యత్తులో సీఏ, సీఎస్ వంటి కోర్సులను దిగ్విజయంగా పూర్తిచేసి, ఉన్నత కెరీర్‌లో కుదురుకోవచ్చు. ఇంటర్ మొదటి ఏడాది కామర్స్ పాఠ్యప్రణాళిక రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్-1 వాణిజ్య శాస్త్రానికి 50 మార్కులు; పార్ట్-2 వ్యాపారగణక శాస్త్రానికి 50 మార్కులు ఉంటాయి.

పార్ట్ 1 (వాణిజ్య శాస్త్రం):
వ్యాపార భావన (7 మార్కులు); వ్యాపార కార్యకలాపాలు (7); వ్యాపార సంస్థలు (సొంత వ్యాపారం-10); ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం, సహకార సంస్థలు (12); భాగస్వామ్య వ్యాపారం (12); జాయింట్ స్టాక్ కంపెనీ (12); కంపెనీ స్థాపన (12); వ్యాపార విత్త ఆధారం-1, వ్యాపార విత్త ఆధారం-2 (12); సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంటర్‌ప్రైజెస్, బహుళజాతీయ సంస్థలు (7); వ్యాపారంలో అధునాతన విధానాలు (7).

పార్ట్-2 గణక శాస్త్రం (అకౌంటెన్సీ):
బుక్ కీపింగ్, అకౌంటింగ్ (7 మార్కులు); అకౌంటింగ్ సూత్రాలు (7); జంటపద్దు విధానం (7); చిట్టా (2); ఆవర్జా (7); సహాయక చిట్టాలు (7); అసలు చిట్టా (2); నగదు పుస్తకం (12); బ్యాంకు నిల్వల సమన్వయం (12); అంకణా (2); తప్పుల సవరణ (7); ముగింపు లెక్కలు-1, ముగింపు లెక్కలు-2 (సర్దుబాట్లతో సహా-22).

ప్రిపరేషన్ ప్రణాళిక:
పార్ట్ ఏ:
  • వ్యాపార కార్యకలాపాలు, వ్యాపార భాగాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలి. ఈ అవగాహన ఉన్నతస్థాయి కోర్సులకు చాలా అవసరం.
  • వ్యాపార సంస్థల స్వరూప స్వభావాలు, వాటి లక్షణాలు, లాభాలు, నష్టాలు, ఇతర వ్యాపార సంస్థలతో బేధాలు అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ అంశాల నుంచి వ్యాసరూప ప్రశ్నలు తప్పనిసరిగా వస్తాయి. కంపెనీ స్థాపనకు అవసరమైన ముఖ్య పత్రాలు, సంస్థాపన పత్రం, కంపెనీ నియమావళి తదితర అంశాల నుంచి వ్యాసరూప ప్రశ్న వస్తుంది.
  • వ్యాపార విత్త ఆధారం నుంచి వ్యాసరూప ప్రశ్న వస్తుంది. భవిష్యత్తులో ఉన్నత చదువుకు ఈ అంశాలు చాలా ముఖ్యమైనవి. వివిధ రకాల ప్రభుత్వ, ప్రైవేటు, బహుళజాతి సంస్థల గురించి అధ్యయనం చేయాలి. వీటి నుంచి 5 మార్కులు, అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు తప్పనిసరిగా వస్తాయి.
ప్రశ్నపత్రం:
  • సెక్షన్-ఎలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి సమాధానానికి పది మార్కులు. నిర్వచనం, ప్రత్యక్ష సమాధానం, ముగింపు రాయడం వల్ల అధిక మార్కులు పొందొచ్చు
  • సెక్షన్-బిలో ఆరు లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి. వీటిలో నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి సమాధానానికి ఐదు మార్కులు. సమాధానంలో నిర్వచనంతోపాటు సంక్షిప్తంగా ఐదారు పాయింట్లు రాస్తే సరిపోతుంది.
  • సెక్షన్-సిలో ఎనిమిది అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి సమాధానానికి 2 మార్కులు. రెండు లేదా మూడు వాక్యాలతో సమాధానం రాస్తే సరిపోతుంది.
పార్ట్ బీ:
  • సెక్షన్ డీలో ముగింపు లెక్కల ప్రశ్న 20 మార్కులకు ఉంటుంది. ఎక్కువ నమూనా ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం వల్ల తప్పులు దొర్లకుండా గరిష్ట మార్కులు పొందేందుకు అవకాశముంటుంది.
  • సెక్షన్ ఈలో రెండు ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఒక దానికి సమాధానం రాయాలి. దీనికి 10 మార్కులు. మూడు వరుసల నగదు చిట్టా ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు నగదు వ్యవహారాలు, బ్యాంకు వ్యవహారాలను పరిశీలించాలి. ఎదుటి పద్దులను గమనించి, నమోదు చేయాలి. నగదు, బ్యాంకు, డిస్కౌంట్ వరుసల నిల్వలను తేల్చినపుడు జాగ్రత్త వహించాలి.
  • బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ ప్రశ్నకు సమాధానం రాసినప్పుడు పాస్‌బుక్ నిల్వ లేదా నగదు పుస్తకం నిల్వను గమనించాలి. ఏకాగ్రతతో సమాధానం రాయాలి.
  • సెక్షన్ ఎఫ్‌లో ఇచ్చిన నాలుగు ప్రశ్నల్లో రెండింటికి సమాధానం రాయాలి. థియరీ ప్రశ్నలు కూడా ఉండటం వల్ల సాధారణ విద్యార్థులు సైతం ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశముంటుంది. సహాయక చిట్టా ప్రశ్న చాలా సులువుగా ఉంటుంది. ఇందులో నగదు వ్యవహారాలు, వర్తకం డిస్కౌంట్‌ను గుర్తించాలి. ఆవర్జా ఖాతాకు సంబంధించిన ప్రశ్న కొంత వరకు సాధారణ విద్యార్థులకు కష్టంగా అనిపిస్తే, థియరీ ప్రశ్నను ఎంపిక చేసుకోవచ్చు.
- కురుహూరి రమేష్, ప్రిన్సిపాల్,
మాస్టర్స్ జూనియర్ కాలేజీ.

అర్థశాస్త్రం
పాఠ్యాంశాలు:
యూనిట్ 1- అర్థశాస్త్రం-పరిచయం (12 మార్కులు); యూనిట్ 2- వినియోగదారుని ప్రవర్తన (17 మార్కులు); యూనిట్ 3- డిమాండ్-సిద్ధాంతం (12); యూనిట్ 4- ఉత్పత్తి సిద్ధాంతం (14); యూనిట్ 5- విలువ- సిద్ధాంతం (12); యూనిట్ 6- పంపిణీ-సిద్ధాంతం (9); యూనిట్ 7- జాతీయ ఆదాయం (17); యూనిట్ 8-స్థూల ఆర్థికాంశాలు (22); యూనిట్ 9- ద్రవ్యం, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం (18); యూనిట్ 10- ఆర్థిక గణాంకాలు (11).

ప్రిపరేషన్ ప్రణాళిక:
ఇంటర్ బోర్డు పరీక్షలో గరిష్ట మార్కులు సంపాదించాలంటే యూనిట్ల వారీగా ముఖ్య అంశాలపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలి.
  • వ్యాసరూప (10 మార్కుల) ప్రశ్నలు ఎక్కువగా 2, 4, 5, 7, 8 యూనిట్ల నుంచి వచ్చేందుకు అవకాశముంది. 2, 4, 5, 8 యూనిట్ల నుంచి వచ్చే వ్యాసరూప ప్రశ్నలు పట్టిక, పటాలపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల పట్టిక, పటం, వివిధ రేఖలు (TU, MU, TPC, APC, డిమాండ్ రేఖలు), సమతుల్య పటాలు-రేఖలపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఈ అంశాలను బాగా చదివితే, అధిక మార్కులు పొందొచ్చు. రేఖ-పటాలను గీసేటప్పుడు పెన్సిల్, స్కేలును వాడాలి. వ్యాసరూప ప్రశ్నలు కొన్ని సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటాయి. వాటికి నిర్వచనం, అర్థం, ప్రమేయాలు, పట్టిక-పటం, వివరణలతో సమాధానం రాస్తే ఎక్కువ మార్కులు పొందొచ్చు.
  • స్వల్ప సమాధాన (5 మార్కులు) ప్రశ్నలు: 1-3, 6-10 యూనిట్ల నుంచి వచ్చే అవకాశముంది. సిద్ధాంతాలపై ఆధారపడిన ప్రశ్నలు రావొచ్చు. వీటికి సంబంధించి ఉపమేయాలు, పరిమితులు, ప్రాధాన్యత అడిగినప్పుడు నిర్వచనం రాసి, అడిగిన ప్రశ్నకు సమాధానం రాయాలి. సమాధానం 20 పంక్తులకు మించకుండా రాయాలి. ఈ విభాగంలో వ్యత్యాసాలపై ప్రశ్నలు వస్తాయి. యూనిట్ 1 (నిర్వచనాలు) నుంచి కచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. అందువల్ల అన్ని నిర్వచనాలనూ చదవాలి. యూనిట్ 8 (స్థూల ఆర్థికాంశాలు) నుంచి కచ్చితంగా రెండు ప్రశ్నలు వస్తాయి.
  • అతి స్వల్ప (2 మార్కులు) సమాధాన ప్రశ్నలు: అన్ని యూనిట్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు తప్పనిసరిగా రెండు వాక్యాల్లో సమాధానం రాయాలి. ఈ విభాగం నుంచి గరిష్టంగా 30 మార్కులు పొందొచ్చు. అన్ని యూనిట్ల చివర్లో ఉన్న అతిస్వల్ప సమాధాన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన యూనిట్-10 ఆర్థిక గణాంకాల నుంచి రెండు అతిస్వల్ప ప్రశ్నలు వస్తాయి.
Published date : 02 Aug 2014 10:55AM

Photo Stories