Skip to main content

విజయానికి దగ్గరి దారి.. ప్రణాళిక ప్రకారం ప్రాక్టీస్

Bavitha వివిధ పాఠశాలల్లో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఇంటర్మీడియెట్ కళాశాలల్లో ప్రవేశించారు. గత జూన్ రెండో వారంలో కాలేజీలో చేరిన విద్యార్థులు అక్కడి వాతావరణానికి ఇప్పటికే అలవాటుపడి ఉంటారు. కాన్సెప్టులు, ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా లెక్చరర్లు పాఠాలను బోధించే విధానానికి కూడా అలవాటుపడేందుకు ఈ నెల రోజుల సమయం సరిపోతుంది. ఇప్పటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలతో పాటు ఎంసెట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలంటే జూనియర్ ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు ఎలా చదవాలన్న దానిపై ఫోకస్...

ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించడానికి; ఉన్నత విద్యా కోర్సుల్లో అడుగుపెట్టడానికి దారిచూపే పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందాలంటే..
  • క్రమం తప్పకుండా కాలేజీ తరగతులకు హాజరుకావాలి. అన్ని సబ్జెక్టుల పాఠాలను ఏకాగ్రతతో వినాలి.
  • కాలేజీలో లెక్చరర్లు చెప్పిన ముఖ్యమైన కాన్సెప్టులను, టిప్స్‌ను, షార్ట్‌కట్స్‌ను నోట్స్‌లో రాసుకోవాలి.
  • ఏ రోజు చెప్పిన పాఠాలను ఆ రోజే ఇంటి దగ్గర అధ్యయనం చేయాలి. కాన్సెప్టులపై పట్టు సాధించేందుకు ప్ర యత్నించాలి. ఎంసెట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఆబ్జెక్టివ్‌గా కూడా సాధన చేయాలి.
  • కాలేజీ స్టడీ అవర్స్‌లో సందేహాలను.. లెక్చరర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. అర్థంకాని విషయాన్ని అడిగి తెలుసుకునేందుకు సంకోచించకూడదు. సందేహాలు పేరుకుపోతే అభ్యసనపై ఆసక్తి సన్నగిల్లే అవకాశముంటుంది.
  • ప్రణాళిక ప్రకారం సబ్జెక్టులకు సమాయాన్ని కేటాయించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు.
ఐపీఈ+ఎంసెట్+జేఈఈ
ఎంసెట్‌తో పాటు జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, బిట్‌శాట్ వంటి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నవారు అధ్యయన ప్రణాళికవిషయంలో జాగ్రత్త వహించాలి. దశల వారీగా ప్రిపరేషన్‌ను అలవాటు చేసుకోవాలి. కాన్సెప్టులు, మూల సిద్ధాంతాలు ఎక్కువగా ఉన్న గణితంలోని సరళరేఖలు, అవకలనాలు, సదిశా బీజగణితం, త్రిమితీయ జ్యామితి, త్రికోణమితి అధ్యాయాలతో పాటు కెమిస్ట్రీలోని పరమాణు నిర్మాణం, రసాయన బంధం, కర్బన శాస్త్రం; ఫిజిక్స్‌లోని గతిశాస్త్రం, ఉష్ణంపై అధిక దృష్టిపెట్టాలి. ఈ చాప్టర్లను కాలేజీలో చెబుతున్నప్పుడు కాన్సెప్టులపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలి. తొలుత ఎంసెట్ స్థాయిలోనూ తర్వాత అంచెలంచెలుగా జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ స్థాయి సమస్యలపై దృష్టిసారించాలి.

అశ్రద్ధ వద్దు
అవగాహన లేకపోవడం వల్లనో లేదంటే సరైన ప్రణాళిక లేకపోవడం వల్లనో కొందరు విద్యార్థులు కొన్ని చాప్టర్లలోని అంశాలను నిర్లక్ష్యం చేస్తారు. వీరు ద్వితీయ సంవత్సరంలో చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది. రెండో ఏడాదిలోని మ్యా థమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలోని చాలా అంశాలు.. మొదటి ఏడాది సిలబస్‌పై ఆధారపడి ఉంటాయి. అదే విధంగా సెకండియర్‌లో సమయం కూడా తక్కువగా ఉంటుంది. ప్రాక్టికల్స్, రికార్డులు రాయడం; పోటీ పరీక్షలకు ఎక్కువ స మయం కేటాయించాల్సి రావడం; మొదటి సంవత్సరంలో ని అంశాలను ఆబ్జెక్టివ్‌గా చదవడం వంటివి దీనికి కారణం. అందువల్ల నిర్లక్ష్యం చేయకుండా మొదటి సంవత్సరంలోని అన్ని అంశాలను ఆబ్జెక్టివ్ స్థాయి వరకు క్షుణ్నంగా చదవాలి.

సమయ పాలన
Bavitha కాలేజీలో తరగతులు పూర్తయ్యాక, కనీసం మూడు గంటలు చదవడానికి కేటాయించాలి. ఎంసెట్, జేఈఈ ర్యాంకు సాధన లక్ష్యంగా నిర్దేశించుకున్న వారు కనీసం ఐదు గంటలు చదవాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సమయాన్ని నిర్దేశించుకొని, ప్రణాళిక ప్రకారం చదవాలి. చాలా కళాశాలల్లో నవంబర్ కల్లా ఐపీఈ సిలబస్, ఆబ్జెక్టివ్ కోచింగ్ పూర్తవుతుంది. అందువల్ల నవంబర్ వరకు అందుబాటులో ఉన్న సమయంలో 80 శాతాన్ని కాన్సెప్టులు, ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్‌కు కేటాయించాలి. 20 శాతం పబ్లిక్ పరీక్షలపైన దృష్టిసారించాలి. తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో 30 శాతం సమయాన్ని ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్‌కు, 70 శాతం సమయాన్ని ఇంటర్ పరీక్షలకు కేటాయించాలి.

పశ్నపత్రం
ఇంటర్ మొదటి సంవత్సరంలో మ్యాథమెటిక్స్ 1-ఎకు 75 మార్కులు; మ్యాథమెటిక్స్ 1-బికు 75 మార్కులు; ఫిజిక్స్ కు 60 మార్కులు; కెమిస్ట్రీకి 60 మార్కులు కేటాయించారు.

  • మ్యాథ్స్ 1-ఎ, 1-బిలలో ఏడు వ్యాసరూప ప్రశ్నలు (ఏడు మార్కులు) ఇస్తారు. వీటిలో ఐదింటికి సమాధానాలు రాయాలి. స్వల్ప సమాధాన ప్రశ్నలు(4మార్కులు) ఏడు ఇస్తారు. వీటిలో ఐదింటికి సమాధానాలు రా యాలి. అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు (రెండు మార్కులు) పది ఇస్తారు. అన్నింటికీ సమాధానాలు రాయాలి.
  • ఫిజిక్స్, కెమిస్ట్రీలలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో రెండింటికి సమాధానాలు రాయాలి. ఎనిమిది స్వల్ప సమాధాన ప్రశ్నల్లో ఆరింటికి సమాధానాలు రాయాలి. అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు 10 ఇస్తారు. అన్నింటికీ జవాబులు రాయాలి. అన్ని పేపర్లకు మూడు గంటల చొప్పున సమయం కేటాయించారు.
మ్యాథమెటిక్స్
మూడు సబ్జెక్టులలో ప్రధానమైంది, అధిక స్కోరింగ్‌కు వీలు కల్పించేది మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్‌లో వెయిటేజీ దృష్ట్యా ముఖ్యమైన చాప్టర్లకు కనీసం కేటాయించాల్సి సమయం..
మ్యాథమెటిక్స్ 1-ఎ: ట్రాన్స్‌ఫర్మేషన్స్- 4 గంటలు; గణితానుగమన సిద్ధాంతం- 3 గంటలు; మాత్రికలు, నిర్ధారకాలు- 6 గంటలు; ప్రమేయాలు-6 గంటలు; త్రిభుజ ధర్మాలు-6 గంటలు; సదిశా లబ్ధాలు- 5 గంటలు.
మ్యాథమెటిక్స్ 1-బి: సరళరేఖా యుగ్మాలు-8 గంటలు; సరళరేఖలు-6 గంటలు; దిక్ కొసైన్లు, నిష్పత్తులు- మూడు గంటలు; అవకలనాలు-6 గంటలు; టాంజెంట్స్ అండ్ నార్మల్స్- 3 గంటలు; గరిష్ట, కనిష్ట విలువలు-4 గంటలు. ఈ చాప్టర్ల నుంచి ఏడు మార్కుల ప్రశ్నలు(దీర్ఘ సమాధాన ప్రశ్నలు) వస్తాయి.

ఫిజిక్స్
ఇందులో దీర్ఘ సమాధాన ప్రశ్నల ప్రకారం చూస్తే అతి ముఖ్యమైన చాప్టర్లు, వాటికి కనీసం కేటాయించాల్సిన సమయం.. వెక్టార్స్-రెండు గంటలు; గతిశాస్త్రం-8 గంట లు; సరళహరాత్మక చలనం- 6 గంటలు; కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్- 4 గంటలు; రొటేటరీ మోషన్-5 గంటలు.
  • వెక్టార్స్‌లో ఉండే భౌతిక సిద్ధాంతాలను ఔపోసన పెడితే ఆ చాప్టర్‌పై పట్టు లభిస్తుంది. రొటేటరీ మోషన్‌లో సెం ట్రీఫ్యూగల్, సెంట్రీపెటల్ ఫోర్సెస్‌లకు సంబంధించిన సమస్యల్ని గుర్తించి, సాధన చేయాలి. గ్రావిటేషన్‌లో యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్; వేరియేషన్ ఆఫ్ ‘జి’; లాటిట్యూడ్; డెప్త్; ఆర్బిటల్, ఎస్కేప్ వెలాసిటీ ముఖ్యమైనవి.
  • సింపుల్ హార్మోనిక్ మోషన్‌లో వేగం, త్వరణం, గరిష్ట-కనిష్ట వేగాలు.. వాటి మధ్య సంబంధాలు, వాటి అనువర్తిత సమస్యలు ముఖ్యమైనవి.
  • సర్ఫేస్ టెన్షన్‌లో నిత్యజీవితంలో సర్ఫేస్ టెన్షన్, క్యాపిలారిటీ ఉపయోగాలు; యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, సర్ఫేస్ టెన్షన్, ఎనర్జీ మధ్య సంబంధం ముఖ్యమైనవి. ఎలాస్టిసిటీలో తక్కువ సబ్ టాపిక్స్ ఉన్నాయి. అయితే అవన్నీ చాలా ముఖ్యమైనవి. స్ట్రెస్, స్ట్రెయిన్, పాయిజన్ రేషియో.. వాటికి సంబంధించిన సమస్యలను సాధన చేయాలి.
  • థర్మో డైనమిక్స్‌లో జెరోత్ లా, జౌల్స్ లా, హీట్ కాలిక్యులేషన్స్, ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరిమీటర్, ఎడియాబాటిక్, ఐసోథర్మల్ ఛేంజెస్ మొదలైనవాటిపై బాగా దృష్టి సారించాలి.
  • అన్ని యూనిట్లలోని డెరివేషన్స్, సిద్ధాంతాలను ప్రాక్టీస్ చేయాలి. స్వల్ప సమాధాన ప్రశ్నలకు అకాడమీలోని అన్ని ప్రశ్నలను సాధించాలి. బిందు లబ్ధం, వజ్రలబ్ధం, లఘు లోలకం, కోణీయ ద్రవ్యవేగం, గరుకు వాలు బల్ల తదితరాల్లోని అంశాల అనువర్తనాలు ముఖ్యమైనవి.
కెమిస్ట్రీ
కెమిస్ట్రీలోని దీర్ఘ సమాధాన ప్రశ్నల పరంగా కెమికల్ బాండింగ్, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్, ఆర్గానిక్ కెమిస్ట్రీల నుంచి వస్తాయి.
  • బోర్న్ హేబర్ సైకిల్, హైడ్రోజన్ స్పెక్ట్రా, పీరియాడిక్ ప్రాపర్టీస్, ఎసిటలీన్ ముఖ్యమైనవి.
  • ఫిజికల్ కెమిస్ట్రీలో స్టేట్స్ ఆఫ్ మేటర్, యాసిడ్స్ అండ్ బేసెస్, కెమికల్ కైనటిక్స్, ఈక్విలిబ్రియం, కెమికల్ ఎనర్జిటిక్స్ మొదలైన టాపిక్స్ ముఖ్యమైనవి. వీటి నుంచి ఎంసెట్‌లో కూడా ప్రశ్నలు వస్తాయి. అందువల్ల విద్యార్థులు ఈ చాప్టర్లపై ఎక్కువ దృష్టి సారించి సంబంధిత ఫార్ములాలు, ముఖ్యమైన పాయింట్లను ఒక చోట రాసుకుని ప్రతి రోజూ చదవాలి.
  • జనరల్ కెమిస్ట్రీలో స్టాకియోమెట్రీ, అటామిక్ స్ట్రక్చర్‌ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. వీటిలో ఉండే సమస్యలను సాధన చేయడంతోపాటు సినాప్సిస్‌ను రూపొందించుకుని చదవడం చేయాలి.
  • పబ్లిక్ పరీక్షల కోసం ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలసేపైనా కెమిస్ట్రీని చదవాలి.
ముఖ్యమైన అంశాలు, కనీసం కేటాయించాల్సి సమయం: కెమికల్ బాండింగ్ - 5 గంటలు; అటామిక్ స్ట్రక్చర్- 4 గంటలు; పీరియాడిక్ టే బుల్- 4 గంటలు; కెమికల్ కైనటిక్స్ - 4 గంటలు; ఆర్గానిక్ కెమిస్ట్రీ- 8 గంటలు.

టిప్స్
  • పబ్లిక్ పరీక్షల కోణంలో అతి ముఖ్యమైన చాప్టర్లను, కాన్సెప్ట్స్‌ను గుర్తించి వాటికి అధిక ప్రాధా న్యం ఇవ్వాలి. ముందుగా అన్ని చాప్టర్ల ముఖ్య భావనలను ఒక చోట రాసుకుని బాగా చదవాలి.
  • ప్రతి ప్రధాన కాన్సెప్ట్‌ను చదవడంతోపాటు సంబంధిత కాన్సెప్ట్‌కు సంబంధించి లెక్చర్ నోట్స్‌ను, మెటీరియల్‌ను, ఇతర అంశాలను బాగా అధ్యయనం చేయాలి. అంతేకాకుండా సంబంధిత కాన్సెప్ట్‌ను నిర్వచించడం.. విశ్లేషించడం.. అనువర్తించడం విధానంలో చదవాలి.
  • ఏ అంశాన్ని చదువుతున్నా సమయ పాలన, కచ్చితత్వం అనేవి అత్యంత ముఖ్యమైనవి. వీటిని తప్పక పాటించాలి.
  • అవసరానికి తగ్గట్లు టిప్స్, షార్ట్‌కట్స్‌ను ఉపయోగించాలి.
  • ప్రతి సబ్జెక్టుకు ఒక నిర్ధిష్ట ప్రణాళిక ను రూపొందించుకోవాలి. దానికి తగినట్లు ఏ రోజు చదవాల్సిన అంశాలను ఆ రోజే చదవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. వేస్తే ఈ రోజుది, ముందురోజుది ఒకేసారి చదవాల్సి రావడంతో ఒత్తిడి ఏర్పడుతుంది.
  • అదేవిధంగా ప్రతి చాప్టర్‌కు సంబంధించి ముఖ్యమైన సినాప్సిస్‌ను రూపొందించుకొని బాగా చదవాలి.
  • ప్రతి పాఠంలో ఉన్న సమస్యలను.. సంబంధిత సూత్రాల సహాయంతో పరిష్కరించాలి.
  • ఆబ్జెక్టివ్ ప్రశ్నల పట్ల చాలామంది విద్యార్థులు నిర్లక్ష్యం వహిస్తారు. రెండో ఏడాదిలో చాలా కష్టంగా ఉన్నాయని విచారిస్తారు. అందుకే మొదటి ఏడాదిలోనే లాంగ్ ఆన్సర్, వెరీషార్ట్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్ ప్రశ్నలతోపాటే బహుళైచ్ఛిక ప్రశ్నలపై కూడా దృష్టి సారించాలి.
  • అందుబాటులో ఉన్న సమయాన్ని రెండు భాగాలుగా విభజించుకుని మ్యాథ్స్‌కు అధిక సమయాన్ని కేటాయించాలి. మిగిలిన సమయాన్ని వెయిటేజ్‌ను బట్టి ఆయా సబ్జెక్టులకు.. చాప్టర్లకు కేటాయించాలి.
  • పబ్లిక్ పరీక్షలతోపాటు, ఎంసెట్, ఐఐటీ జేఈఈ వంటి పరీక్షలకు సిద్ధమయ్యేవారు మరింత ప్రిపరేషన్ సాగించాలి.
  • కాలేజ్ షెడ్యూల్ మీ ప్రిపరేషన్‌కు ఇబ్బంది కాకుండా సీనియర్ అధ్యాపకులతో ప్రణాళిక రూపొందించుకోవాలి.
  • కళాశాలలో ప్రతి పాఠాన్ని ఏకాగ్రతతో శ్రద్ధగా వినడంతోపాటు ఇంటికొచ్చాక సంబంధిత పాఠాన్ని సమీక్షించాలి. ఆ తర్వాత సాయంత్రం ట్యూషన్‌లో ఆ పాఠాన్ని క్షుణ్నంగా చదవాలి. ఇలా చేస్తే సంబంధిత పాఠం బాగా గుర్తుండిపోతుంది.
  • అధ్యాపకుడు పాఠం చెప్పేటప్పుడు ముఖ్యాంశాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి.
Published date : 18 Jul 2014 06:01PM

Photo Stories