Skip to main content

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఊరటనిచ్చే నిర్ణయాన్ని ప్రకటించింది.
ఫలితాలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాలను ఎలాంటి దరాఖస్తులు లేకుండా రీ-వెరిఫికేషన్ చేస్తామని ప్రకటించింది. రీ-వెరిఫికేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఇప్పటికే రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్‌కు డబ్బులు కట్టిన వారికి తిరిగి చెల్లిస్తామని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇంటర్ ఫలితాలపై తీవ్ర దుమారం తలెత్తగా.. దీనిని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫెయిలైన 3 లక్షలకుపైగా విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ చేయాలని ఆదేశించారు. మరోసారి తప్పులు జరగకుండా పటిష్టమైన వ్యవస్థను రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఫెయిలయిన విద్యార్థులెవరూ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. రీ-వెరిఫికేషన్ ప్రక్రియను 12 రోజుల్లోగా పూర్తి చేసేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. 15 రోజుల్లో మెమోలు అందజేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం అదనపు సిబ్బంది నియామకం చేపట్టారు. గతంలో మూల్యాంకనం చేసిన అధ్యాపకులతోనే పునఃపరీశీలనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధ్యాపకుల సెలవులను రద్దు చేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Published date : 26 Apr 2019 06:33PM

Photo Stories