సెలవులపై స్పష్టత వచ్చాకే ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది వివిధ పండగలు, జాతీయ దినోత్సవాలు తదితర సెలవుల తేదీలపై ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకున్న తర్వాతే ఇంటర్మీడియెట్ పరీక్షల తేదీలను ఖరారు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని.. ముందుగా ప్రతిపాదనలు చేయడమో, షెడ్యూల్‌ను రూపొందించడమో చేయవద్దని బోర్డు భావిస్తోంది. ఇంటర్మీడియెట్ పరీక్షలు ఏటా మార్చిలో ప్రారంభమవుతుంటాయి. ఇవి మార్చి మొదటివారంలో లేదా మొదటిపక్షంలో ఏ తేదీనుంచి ప్రారంభమవుతాయన్న దానిపై డిసెంబర్‌లోనే స్పష్టత వస్తుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. గతేడాది ఇంటర్ పరీక్ష తేదీల్ని ముందుగా ప్రకటించారు. ప్రభుత్వం సెలవు దినాలు ఖరారు చేయకుండానే ఈ షెడ్యూల్‌ను విడుదల చేయడంతో బోర్డు అభాసుపాలైంది. షెడ్యూల్ ప్రకటన వచ్చిన కొద్దిరోజులకు ప్రభుత్వం సెలవు దినాల్ని అధికారికంగా ప్రకటించింది. ఇంటర్ బోర్డు ప్రకటించిన పరీక్ష తేదీల్లో శ్రీరామనవమి, గుడ్‌ఫ్రైడే వంటి సెలవు దినాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ తేదీలను మార్పు చేసి కొత్త షెడ్యూల్‌ను ప్రకటించాల్సి వచ్చింది. ఇక ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరిలో ఉంటాయి. వీటిని ఈసారి జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే 982 ప్రయోగ కేంద్రాల్ని గుర్తించారు. ఇదిలా ఉండగా ఇంటర్ పరీక్ష తేదీల్ని అనుసరించి పదో తరగతి పరీక్షల తేదీలను ఖరారు చేస్తామని ఎస్సెస్సీ బోర్డువర్గాలు తెలిపాయి. సాధారణంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన ముఖ్యమైన పేపర్ల పరీక్షలు ముగిసిన మరుసటిరోజు నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతుంటాయి. వచ్చే ఏడాదిలోనూ ఇదే రీతిన షెడ్యూల్ ఉంటుందని ఎస్సెస్సీ బోర్డువర్గాలు వివరించాయి.
Published date : 17 Oct 2016 03:32PM