Skip to main content

‘ఫైర్ సేఫ్టీ’ పాటించని కాలేజీలను మూసేస్తాం: టీఎస్ ఇంటర్మీడియట్ బోర్డు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించని భవనాల్లో కొనసాగుతున్న జూనియర్ కాలేజీలను మూసేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పేర్కొన్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా భవనాల్లో ఆ కాలేజీలను కొనసాగించేది లేదని స్పష్టం చేశారు.
ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో సోమవారం తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఇప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. పరీక్షలు పూర్తయ్యాక ఆయా భవనాల్లో కాలేజీలను కొనసాగించకుండా చూస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రథమ సంవత్సరం పూర్తయ్యే విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి పంపించాలని స్పష్టం చేశారు. ఆయా కాలేజీలు నిబంధనలు పాటించని వైనంపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, వారు చెప్పిన సమాధానం పట్ల బోర్డు సంతృప్తి చెందలేదని పేర్కొన్నారు. అందుకే త్వరలోనే మూసివేత నోటీసులు ఇస్తామని తెలిపారు. మరోవైపు కావాలనుకుంటే ఆయా యాజమాన్యాలు ఆ కాలేజీలను ఇతర భవనాల్లోకి షిప్ట్ చేసుకోవచ్చని సూచించారు. అందుకోసం అఫిలియేషన్ దరఖాస్తుల సమయంలో కొత్త భవనాలకు సంబంధించి షిఫ్టింగ్ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని యాజమాన్యాల్లో శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన 18 కాలేజీలు, నారాయణ విద్యా సంస్థలకు చెందిన 26 కాలేజీలు, శ్రీ గా యత్రి విద్యా సంస్థలకు చెందిన 8 కాలే జీలు, ఎన్‌ఆర్‌ఐ విద్యా సంస్థలకు చెంది న 5 కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు 11 ఉన్నట్లు వెల్లడించారు. ఇతర విద్యా సంస్థల్లో ఎస్‌ఆర్ జూనియర్ కాలేజీ, తపస్యా జూనియర్ కాలేజీ, గౌతమి గర్‌ల్స్ జూనియర్ కాలేజీ, క్వీన్ మేరీ జూనియర్ కాలేజీ, లియో ఒకేషనల్ జూనియర్ కాలేజీ, పులిపాటి ప్రసాద్ ఒకేషనల్ జూనియర్ కాలేజీ, సరస్వతి సారుు రాఘవేంద్ర జూనియర్ కాలేజీ, క్షత్రీయ జూనియర్ కాలేజీ తదితర విద్యా సంస్థలు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే కాలేజీలు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కాలేజీ హాస్టళ్లను నియంత్రించేందుకు పక్కాగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే జారీ చేస్తామని స్పష్టం చేశారు.
 
 ఒత్తిడిని అధిగమించేందుకు ప్రత్యేక శిక్షణ..
 ఒత్తిడిని అధిగమించేలా, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునేలా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నట్లు సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. హార్టఫుల్‌నెస్ సొసైటీ ద్వారా ఈ శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. దీనిపై త్వరలోనే ఆ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారని, ప్రైవేటు కాలేజీల్లోనూ యాజమాన్యాలు ఈ శిక్షణ ఇప్పించేలా చర్యలు చేపడతాయని పేర్కొన్నారు. వారు ఏడాదిలో ఒక్కో కాలేజీకి 26 సార్లు వెళ్లి శిక్షణ ఇస్తారన్నారు. అలాగే కాలేజీల్లో తమ స్టూడెంట్ కౌన్సెలర్లకు కూడా శిక్షణ ఇస్తారని, వారు రెగ్యులర్‌గా విద్యార్థులు ఒత్తిడిని అధిగమించే అవసరమైన సహకారం అందిస్తారని చెప్పారు.  
Published date : 03 Mar 2020 03:53PM

Photo Stories