Skip to main content

ప్రశాంతం ముగిసిన నీట్

సాక్షి, అమరావతి: వైద్య విద్య (ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 7న నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) స్వల్ప ఆందోళనల మధ్య ప్రశాంతంగా ముగిసింది.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 73 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా 11,38,890 మంది హాజరైనట్లు సీబీఎస్‌ఈ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా సుమారు 65 వేల ఎంబీబీఎస్ సీట్లు, 25 వేల బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 1,522 మంది ఎన్నారైలు, 613 మంది విదేశీయులు నీట్‌కు హాజరైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో జరిగిన ఈ పరీక్ష ఆద్యంతం వీడియో కెమెరాల పర్యవేక్షణలో సాగింది. ఉదయం 7:30 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. పరీక్ష రాస్తున్న అమ్మాయిలు కాళ్ల పట్టీలు, చెవిదుద్దులు, మెడలో వేసుకున్న చైన్లు, జడ క్లిప్పులు, ముక్కు పుడక సైతం తీశాకే లోపలకు అనుమతించారు. బాలురు చేతి ఉంగరాలు, వాచీలు, బూట్లు తీసేసిన తర్వాత లోపలకు వెళ్లనిచ్చారు. పెన్నులను పరీక్ష హాలులో నిర్వాహకులే అందజేశారు. పలు కేంద్రాల వద్ద అమ్మాయిల సంఖ్య ఎక్కువగా కనిపించింది. తిరుపతిలో 7,157 మంది,  విజయవాడలో 15,195 మంది, విశాఖలో 10,138 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఆలస్యంగా వచ్చిన పలువురిని లోపలకు అనుమతించలేదు. చాలా మంది విద్యార్థులు హాల్ టికెట్‌లో ఉన్న నిబంధనలను చదువుకుని పాటించక పోవడం వల్ల ఇబ్బందులు పడ్డారు. తెలంగాణలో 56,806 మంది విద్యార్థులు హాజరయ్యారు. వరంగల్‌లో తెలుగు మీడియం బదులు ఆంగ్ల మీడియం ప్రశ్నపత్రం అందజేయడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో నీట్ పరీక్షకు హజరైన విద్యార్థినులు జీన్‌‌స వంటి దుస్తులు ధరించి రావడంతో పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. చెన్నైలో పొడుగు చేతుల చొక్కాలతో పరీక్షకు హాజరైన విద్యార్థులు.. పరీక్షా కేంద్రాల వద్దే చొక్కాల చేతులను కత్తిరించుకున్నారు. తమిళనాడు వ్యాప్తంగా 88 వేల మంది పరీక్షకు హాజరయ్యారు.

సిలబస్‌లో లేని ప్రశ్నలు :
గతేడాదితో పోలిస్తే ఈసారి నీట్ సులభంగానే ఉందని విద్యా రంగ నిపుణులు, విద్యార్థులు పేర్కొంటున్నారు. జువాలజీకి సంబంధించి   సిలబస్‌లో లేని రెండు ప్రశ్నలు ఇచ్చారు. ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి గతేడాది ప్రశ్నలు చాలా కఠినంగా రాగా.. ఈ సారి కొంత సులువుగానే వచ్చాయని చెబుతున్నారు. రెండు ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు అస్పష్టంగా ఉన్నాయని, వాటికి ఇచ్చిన ఆప్షన్లలో ఏది సరైనదో అర్థంకాని పరిస్థితి ఉందని చెబుతున్నారు. ‘ఎక్స్’సిరీస్‌లోని 157వ ప్రశ్నకు ఆప్షన్లలో సి, డి రెండూ సరైన జవాబులే. ఇది విద్యార్థులను గందరగోళానికి గురిచేసింది. అదే సిరీస్‌లోని 164 ప్రశ్నకు ఎ, డి జవాబుల్లో ఏది సరైనదో అర్థంకాక విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. ఫిజిక్స్ ప్రశ్నలు సాధారణంగానే ఉన్నాయి. నీట్ ఫలితాలు జూన్ 8న విడుదల కానున్నాయి.
Published date : 08 May 2017 05:12PM

Photo Stories