ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అక్టోబర్‌లో నిర్వహించిన ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి.
ఎస్సెస్సీ పరీక్షలకు హాజరైన 20,069 మంది విద్యార్థుల్లో 4,758 మంది (23.71 శాతం).. ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరైన 17,067 మంది విద్యార్థుల్లో 4,816 మంది (28.22 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఎస్సెస్సీ పరీక్షలకు 14,877 మంది బాలురు హాజరుకాగా 3,316 మంది.. 5,192 మంది బాలికలు హాజరవగా 1,442 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌లో 12,119 మంది బాలురు పరీక్షకు హాజరవగా 3,250 మంది.. 4,948 మంది బాలికలు హాజరుకాగా 1,566 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను telanganaopenschool.org వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ వెల్లడించింది. 10 రోజుల్లో సంబంధిత విద్యా సంస్థలకు మార్కుల మెమోలు పంపించనున్నట్లు తెలిపింది. మెమోల్లో తప్పులు దొర్లితే ఈ నెల 25లోగా సంబంధిత కోఆర్డినేటర్ ద్వారా డెరైక్టర్ దృష్టికి తీసుకురావాలని వివరించింది. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్, జవాబు పత్రాల జిరాక్స్ కాపీల కోసం ఈ నెల 21 నుంచి 30 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్ రీ కౌంటింగ్‌కు రూ.200, రీ వెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల జిరాక్స్ కాపీ కోసం ప్రతి సబ్జెక్టుకు రూ.600 చెల్లించాలని తెలిపింది. ఎస్సెస్సీ విద్యార్థులు రీకౌంటింగ్‌కు ప్రతి సబ్జెక్టుకు రూ.100, రీ వెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల జిరాక్స్ కాపీ ప్రతి సబ్జెక్టుకు రూ.1,000చెల్లించాలని.. ఏపీ ఆన్‌లైన్/మీసేవా కేంద్రాల్లో ఈ మొత్తాన్ని చెల్లించాలని పేర్కొంది.
Published date : 18 Nov 2016 01:29PM