Skip to main content

నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఇంటర్ అడ్మిషన్లు

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు ఇంటర్‌లో చేరేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు సమర్పించేందుకు ఈనెల 29వ తేదీ సాయంత్రం 5 గంటలు తుది గడువుగా పేర్కొన్నారు. ‘హెచ్‌టీటీపీఎస్://బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్‌సైట్‌లో ‘ఆన్‌లైన్ అడ్మిషన్స్‌ 2020-21 (ఏపీఓఏఎస్‌ఐఎస్) యూజర్ మాన్యువల్’ను పొందుపరిచినట్లు వివరించారు. ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాలు ఈ విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో మాత్రమే జరుగుతాయని స్పష్టం చేశారు. ఇంటర్మీడియెట్ జనరల్, వొకేషనల్‌లోని అన్ని కేటగిరీల సీట్లకు ప్రవేశాలు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయన్నారు. ఓసీ, బీసీలు రూ.200, ఎస్సీ, ఎస్టీలు రూ.100 చొప్పున రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలన్నారు. ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియపై సందేహాలు, సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 18002749868కు కాల్‌చేసి నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.
Published date : 21 Oct 2020 01:50PM

Photo Stories