Skip to main content

మార్చిలోనే ఇంటర్ పరీక్షలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వచ్చే ఏడాది మార్చి మొదట్లోనే ఇంటర్మీడియెట్ పరీక్షలను ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లను వేగవంతం చేసింది.
ప్రశ్నపత్రాల రూపకల్పన, వాటికి సంబంధించిన శిక్షణ, జవాబు పత్రాల రూపకల్పన, డాటా ప్రాసెసింగ్ ఏజెన్సీల ఖరారుకు ఇప్పటికే టెండర్లు పిలిచిన ఇంటర్ బోర్డు మరో 2 రోజుల్లో వాటిని ఖరారు చేయనుంది. ఎంసెట్-2 లీకేజీ, దాంతో తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో ఇంటర్ పరీక్షల ను పకడ్బందీగా నిర్వహించడంపై దృష్టి సారించింది. ప్రశ్నపత్రాల్లోనూ ఎలాంటి తప్పులు దొర్లకుండా, నిబంధనలు, బ్లూప్రింట్ మేరకు ప్రశ్నల సరళి ఉండే విధానంపై పేపరు సెట్టింగ్‌లో పాల్గొనే లెక్చరర్లకు ప్రత్యేక శిక్షణను ప్రారంభించింది. బ్లూప్రింట్ ప్రకారం 40 శాతం సులభ ప్రశ్నలు, 30 శాతం విద్యార్థి ఇంటెలిజెన్స్ పరీక్షించే ప్రశ్నలు, మరో 30 శాతం విద్యార్థి అప్లికేషన్ వైఖరిని ప్రశ్నించేలా ప్రశ్నల రూపకల్పన పక్కాగా ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. జవాబు పత్రాల బుక్‌లెట్‌లో 23 పేజీలు ఉండగా, వాటిని గణితం సబ్జెక్టుకు సంబంధించి 27కు పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. 23 పేజీల జవాబు పత్రాల బుక్‌లెట్ గణితం పరీక్షకు సరిపోవడం లేదని విద్యార్థులు చెబుతున్న నేపథ్యంలో ఈ బుక్‌లెట్‌లో పేజీలను పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు ఆలస్య రుసుముతోనూ ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ప్రవేశాల గడువు బుధవారంతో ముగిసింది. దీంతో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల లెక్క కూడా దాదాపు ఖరారయ్యింది.

అదనంగా 40 వేల మంది ఇంటర్‌లో చేరిక :
ఈ విద్యా సంవత్సరంలో 4,91,165 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో చేరారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి అదనంగా 40 వేల మంది ఇంటర్మీడియెట్‌లో చేరారు. ఇక ద్వితీయ సంవత్సరంలో మరో 4.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తంగా ఇంటర్ పరీక్షలకు మార్చిలో దాదాపు 9.5 లక్షల మంది హాజరు కానున్నారు. ఫీజు చెల్లించేందుకు వచ్చే నెల 28 వరకు గడువును ఇంటర్ బోర్డు ప్రకటించిం ది. ఆలస్య రుసుముతో నవంబర్ 14 వరకు చెల్లించవచ్చని పేర్కొంది. పరీక్షలను ఈసారి మరింత ముందుగా మార్చి 2, 3 తేదీల్లో ప్రారంభించేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది.

ఉదయం ఇంటర్.. మధ్యాహ్నం టెన్త్ :
ఇంటర్‌తోపాటు పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఉదయం వేళల్లో ఇంటర్, మధ్యాహ్నం టెన్త్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు జవాబు పత్రాల మూల్యాంకనం తర్వాత మార్కులను, ఫిబ్రవరిలో నిర్వహించే ప్రాక్టికల్స్ మార్కులను ఆన్‌లైన్ ద్వారా వెంటవెంటనే బోర్డుకు అందించేలా చర్యలు చేపడుతున్నారు. తద్వారా ఈసారి పరీక్షలు పూర్తయిన 30 రోజుల్లోనే ఫలితాలు వెల్లడించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే నిర్వహించాలని మొదట్లో నిర్ణయించినా, అది సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ నిర్వహించే అవకాశం ఉంది.
Published date : 03 Oct 2016 02:53PM

Photo Stories