Skip to main content

జూనియర్ కాలేజీల హాస్టళ్లకు కొత్త నిబంధనలు

సాక్షి, హైదరాబాద్: జూనియర్ కాలేజీల యాజమాన్యాల ఇష్టారాజ్య వైఖరికి ఇక చెక్ పడనుంది.
ఒక్కో గదిలో పది మంది వరకు విద్యార్థులను కుక్కే కాలేజీ హాస్టళ్ల తీరుపై తెలంగాణ ఇంటర్ బోర్డు దృష్టి సారించింది. రెసిడెన్షియల్ పేరుతో రూ. లక్షల్లో వసూలు చేసినా సదుపాయాలు కల్పించకుండా విద్యార్థులను ఇబ్బందుల పాల్జేసే యాజమాన్యాలపై కొరడా ఝళిపించనుంది. ఇందుకు పక్కగా నిబంధనలను సిద్ధం చేసింది. జూనియర్ కాలేజీలు, హాస్టళ్లలోని విద్యార్థుల ఇబ్బందులు, ఒత్తిడిని దూరం చేసేందుకు త్వరలోనే మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో...
అరకొర వసతులున్న హాస్టళ్లలో ఉదయం 5 గంటలకు నిద్ర లేచింది మొదలుకొని అర్ధరాత్రి 12 వరకు చదువులతో ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులు ఇటీవలి కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు గత నవంబర్, డిసెంబర్ నెలల్లో హాస్టళ్లలో సదుపాయాలు, అక్కడి పరిస్థితు లపై తనిఖీలు నిర్వహించి, విద్యార్థుల అభిప్రాయాలు సేకరించింది. వసతుల లేమి తో హాస్టళ్లలో ఉండలేక, ఇంటికి వెళ్లలేక, నిద్రలేక, చదువే లోకంగా ఉంటున్న విద్యార్థులు.. ఆ ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితులను మార్చేందుకు సిద్ధమైంది. ఇన్నాళ్లు బో ర్డు పరిధిలో లేని కాలేజీ హాస్టళ్లను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తమ పరిధిలోకి తెచ్చు కుంది. వాటి నియంత్రణకు నిబంధనలు సిద్ధం చేసింది.

ముందుగానే దరఖాస్తుల ఆహ్వానం..
జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు, హాస్టళ్లకు గుర్తింపు ఇచ్చేందుకు నిబంధనల జారీ కంటే ముందుగానే ఆయా యాజమాన్యాల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. 2018-19 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్ కోర్సును నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,667 కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం ఇంటర్ బోర్డుకు దరఖా స్తు చేసుకున్నాయి. అయితే అందులో 700 వరకు హాస్టళ్లు కలిగిన కాలేజీలు ఉన్నట్లు బోర్డు అంచనా. కానీ ఇంతవరకు 267 కాలేజీలే హాస్టళ్లకు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. మిగతా కాలేజీలు ఇంకా ముందుకు రాలేదు. ఫిబ్రవరి 22తోనే దరఖాస్తుల గడువు ముగిసినా కాలేజీల విజ్ఞప్తి మేరకు మార్చి 20 వరకు గడువును బోర్డు పొడిగించింది. అయినా ఇంతవరకు ఇంకా 400కు పైగా హాస్టళ్లు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోలేదు. మరి వాటిపై బోర్డు ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిందే. ఇక కాలేజీల గుర్తింపు ఫీజును గతంలోనే ఖరారు చేసిన బోర్డు.. ఇపుడు హాస్టళ్లు కలిగిన కాలేజీలకు మొత్తంగా రూ.ఆరు లక్షలు గుర్తింపు ఫీజుగా ఖరారు చేసినట్లు తెలిసింది. వాటిపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది.

ఇవీ ప్రధాన నిబంధనలు..
  • హాస్టల్‌లోని గదిలో ఇద్దరు విద్యార్థులనే ఉంచాలి.
  • బాలురైతే 8 మందికి ఓ బాత్‌రూమ్, బాలికలైతే ఆరుగురికి ఓ బాత్‌రూమ్ ఉండాలి. l
  • పతి విద్యార్థికి 50 చదరపు అడుగుల ప్రదేశం ఉండేలా చూడాలి. l
  • 360 మంది విద్యార్థులను ఓ యూనిట్‌గా తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మరో యూనిట్ ఏర్పాటు చేయాలి. l
  • ప్రతి యూనిట్‌కు వంట సిబ్బంది ఆరుగురు ఉండాలి. పరిశుభ్రతకు సిబ్బందిని నియమించాలి. దాన్ని మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షించాలి. l
  • భోజనం నాణ్యతపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షించాలి. l
  • ప్రతి నెలా పేరెంట్, టీచర్ మీటింగ్ ఉండాలి. సెలవుల్లో విద్యార్థులను కలుసుకునే అవకాశం తల్లిదండ్రులకు కల్పించాలి.
  • క్వాలిఫైడ్ కౌన్సెలర్లను అందుబాటులో ఉంచాలి. ఒత్తిడితో ఇబ్బంది పడే విద్యార్థులకు సలహాలివ్వాలి. l
  • విద్యార్థులను ఉదయం 6 గంటల లోపు నిద్ర లేపకూడదు. రాత్రి 10 గంటల తరువాత స్టడీ అవర్స్ కొనసాగించొద్దు. నిబంధనలను అతిక్రమిస్తే యాజ మాన్యాల గుర్తింపును రద్దు చేసే అవకాశం ఉంది. l
  • నిబంధనలు ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీలకు (ఫీజులు మినహా) వర్తిస్తాయి.
Published date : 20 Mar 2018 02:07PM

Photo Stories