జూనియర్ కాలేజీల గుర్తింపునకు నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు, అదనపు సెక్షన్ల మంజూరు కోసం ఇంటర్మీడియెట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది.
2019-20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టే కాలేజీలు కచ్చితంగా అనుబంధ గుర్తింపు పొందాలని బోర్డు స్పష్టం చేసింది. కాలేజీ యాజమాన్యాలు జనవరి 10 నుంచి ఆన్లైన్లో (https://www.acad.tsbie.telangana.gov.in, https://www.bie.telangana.gov.in) దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో చలానా, డీడీ రూపంలో చెల్లించే ఫీజు, దరఖాస్తు ఫారాలను తిరస్కరించనున్నట్లు వెల్లడించింది. యాజమాన్యాలు అప్లియేషన్ ఫీజు, ఇన్స్పెక్షన్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఆయా కాలేజీలు ఎఫ్డీఆర్, భవనం, ఆట స్థలానికి సంబంధించిన రిజిస్టర్డ్ లీజ్ డీడ్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు కలిగి ఉండాలని తెలిపింది. అదనపు సెక్షన్లకు అదనపు సదుపాయాలు కలిగి ఉండాలని వెల్లడించింది. యాజమాన్యాలు నిర్ణీత ఫీజును జనవరి 31లోగా చెల్లించాలని తెలిపింది. రూ.1,000 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 12 వరకు, రూ.3 వేల రుసుముతో 25 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో మార్చి 8 వరకు, రూ.10 వేల ఆలస్య రుసుముతో 20వ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
Published date : 08 Jan 2019 02:35PM