జనవరి 28న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు జనవరి 28వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
జనవరి 31వ తేదీన ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను నిర్వహిస్తామని పేర్కొంది. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటాయని వెల్లడించింది. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఈ పరీక్షలు రాయాలని, వాటిల్లో అర్హత సాధించిన వారికే ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. గతంలో ఈ పరీక్షలు రాయని, రాసినా ఫెయిల్ అయిన వారు తమ పాత హాల్‌టికెట్ నంబర్లతో పరీక్షలు రాయవచ్చని సూచించింది. ఎలాంటి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, తమ కాలేజీలను సంప్రదించి పరీక్షలకు హాజరు కావాలని తెలిపింది. 2017లో ఈ పరీక్షలకు హాజరైన వారి మార్కుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే విధానాన్ని తాము ప్రవేశ పెట్టినట్లు పేర్కొంది. ఈసారి వాటి ప్రశ్నాపత్రాలను కూడా ఆన్‌లైన్ ద్వారానే పంపించనున్నట్లు వెల్లడించింది. పరీక్షలకు అరగంట ముందు ప్రిన్సిపాళ్లు ప్రశ్నాపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షలు నిర్వహించాలని సూచించింది.
Published date : 24 Jan 2019 02:38PM