జేఈఈ విద్యార్థులకు వీడియో పాఠాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ తదితర ప్రవేశ పరీక్షలను మొదటిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విద్యార్థుల కోసం ఎన్‌ఐటీలు, ఐఐటీల ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో రూపొందించిన వీడియో పాఠాలను అందుబాటులోకి తెచ్చింది.
ముఖ్యంగా జనవరిలో నిర్వహించే మొదటి దశ జేఈఈ మెయిన్‌కు సిద్ధం అయ్యే విద్యార్థులకు ఆ పాఠాలను తమ వెబ్‌సైట్ ( nta.ac.in) ద్వారా అందుబాటులోకి తెచ్చింది. దీంతో విద్యార్థులు జేఈఈకి ఎలా ప్రిపేర్ కావొచ్చన్న ప్రాథమిక సమాచారంతో పాటు పాఠ్యాంశాలను కూడా అందుబాటులో ఉంచింది. మాక్ టెస్టు లింకులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటిసారిగా జేఈఈ మెయిన్‌ను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నందున విద్యార్థులు రిజిస్టర్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చని ఎన్‌టీఏ పేర్కొంది. మరోవైపు విద్యార్థులు ఒరిజినల్ పరీక్ష తరహాలో కేంద్రానికి వెళ్లి నమూనా పరీక్ష రాసేలా టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్లను (టీపీసీ) ఏర్పాటు చేస్తోంది. అయితే వాటిని పరీక్షలకు కొద్ది రోజుల ముందు అందుబాటులోకి తీసుకురానుంది. తెలంగాణలో 90, ఆంధ్రప్రదేశ్‌లో 122 కాలేజీల్లో టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. జేఈఈ మెయిన్‌తో పాటు యూజీసీ నెట్‌ను కూడా మొదటిసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నందున విద్యార్థుల్లో ఆన్‌లైన్ పరీక్షలంటే భయం పోగొట్టేందుకు ఇవి దోహదపడనున్నాయి. దేశవ్యాప్తంగా 3,400 టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. యూజీసీ నెట్ పరీక్షను డిసెంబర్ 6 నుంచి 20 వరకు, జేఈఈ మెయిన్‌ను జనవరి 6 నుంచి 20 వరకు వివిధ స్లాట్‌లను విద్యార్థులకు కేటాయించి పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జేఈఈ మెయిన్ దరఖాస్తులను 30 వరకు స్వీకరించనుంది. తెలంగాణలో 17 జిల్లాల్లో ఏర్పాటు చేసే 90 టీపీసీల్లో 7,230, ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లోని 122 టీపీసీల్లో 14,437 చొప్పున కంప్యూటర్లు అందుబాటులో తెచ్చేలా చర్యలు చేపట్టింది. ఈ టీపీసీ కోసం విద్యార్థులు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో లేదా ‘ఎన్‌టీఏ స్టూడెంట్’యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. వారికి టీపీసీ వివరాలను పరీక్షకు కొద్ది రోజుల ముందు ఎస్‌ఎంఎస్ రూపంలో పంపించనుంది. రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థులు తమ సమీపంలోని టీపీసీలను ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేసుకుంటే అందులో ఏదో ఒక కేంద్రాన్ని కేటాయించేలా ఏర్పాట్లు చేస్తోంది.
Published date : 26 Sep 2018 03:12PM