Skip to main content

జేఈఈ మెయిన్ ఫలితాల్లో..సత్తాచాటిన తెలుగు తేజాలు

సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఇతర జాతీయస్థాయి విద్యాసంస్థల్లో బీఈ/బీటెక్, బీఆర్క్‌లో ప్రవేశాలకోసం నిర్వహించిన ‘జేఈఈ మెయిన్-2019’ప్రవేశ పరీక్షఫలితాలను జనవరి 19న విడుదల చేశారు.ఎప్పటిలాగే ఈసారి కూడా తెలుగు విద్యార్థులు అత్యధిక స్కోర్ సాధించి సత్తాచాటారు.
దేశవ్యాప్తంగా 15 మంది మాత్రమే 100 పర్సెంటైల్ సాధించగా.. అందులో ఐదుగురు తెలుగు విద్యార్థులే కావడం విశేషం. ఇందులో తెలంగాణ విద్యార్థులు నలుగురు ఉండగా, ఒకరు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి. 100 పర్సెంటైల్ సాధించిన వారిలో తెలంగాణకు చెందిన ఆదెల్లి సాయికిరణ్ జాతీయస్థాయిలో 3వ స్థానంలో, ఇందుకూరి జయంత్ ఫణిసాయి ఏడో స్థానంలో, విశ్వనాథ్ కె 8వ స్థానంలో, బట్టెపాటి కార్తికేయ 12వ స్థానంలో నిలిచారు. ఏపీ విద్యార్థి బొజ్జా చేతన్‌రెడ్డి నాలుగో స్థానంలో నిలిచాడు. జనవరి 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 8 షిఫ్ట్‌లలో.. ఆన్‌లైన్లో దేశవ్యాప్తంగా 254 పట్టణాల్లోని 467 పరీక్ష కేంద్రాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 9,29,198 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 8,74,469 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు సాధించిన మార్కులు, ఆ షిప్ట్‌లో పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య, మొత్తం విద్యార్థుల సంఖ్యతో నార్మలైజ్ చేసి, వారి పర్సెంటైల్ స్కోర్‌ను ఎన్‌టీఏ ప్రకటించింది. వాస్తవానికి జనవరి 31న ఫలితాలను వెల్లడిస్తామని ఎన్‌టీఏ గతంలోనే పేర్కొన్నప్పటికీ.. రికార్డు స్థాయిలో ముందుగానే ఫలితాలను వెల్లడించడం విశేషం. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో (బీ-ఆర్క్) ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్‌టీఏ వెల్లడించింది.

తెలుగు వారే అత్యధికం..!
ఈ పరీక్షలో 99.99 పర్సెంటైల్ సాధించిన విద్యార్థులు 600-700 మంది విద్యార్థులే ఉండే అవకాశం ఉంది. మరోవైపు 99.95-99.99 పర్సెంటైల్ వచ్చిన వారికే టాప్ 100 లోపు ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అందులో తెలంగాణ విద్యార్థులు 30-40 మంది వరకు ఉండే అవకాశం ఉందని జేఈఈ నిపుణుడు ఉమాశంకర్ తెలిపారు. 90కి పైగా పర్సెంటైల్ సాధించిన వారిలో దాదాపు 3వేల మంది వరకు తెలుగు విద్యార్థులే ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. పర్సెంటైల్ విషయంలో విద్యార్థుల్లో కొద్దిగా గందరగోళం ఉందని, ఫైనల్ కీ విడుదల చేయడంతోపాటు, విద్యార్థులు ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్లను వెబ్‌సైట్ నుంచి తొలగించకుండా అలాగే ఉంచితే స్పష్టత ఉండేదన్నారు.

టాప్ స్కోర్ ఏదైతే అదే లెక్కలోకి...
2019-20 విద్యా సంవత్సరం నుంచి ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను ఏటా రెండుసార్లు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మొదటి దశ పరీక్షలను జనవరి నెలలో నిర్వహించింది. రెండో దశ పరీక్షలను ఏప్రిల్ 6 నుంచి 20వ తేదీ మధ్యలో నిర్వహించేందుకు ఏర్పాట్లుచేసింది. ఇందులో భాగంగా వచ్చే రెండో దఫా జేఈఈ మెయిన్ కోసం ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మార్చి 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని ఎన్‌టీఏ ప్రకటించింది. ఆ పరీక్షల ఫలితాలను వెల్లడించాక ఈ రెండు పరీక్షల్లో టాప్ స్కోర్ ఏదైదే దాన్నే పరిగణనలోకి తీసుకొని ప్రవేశాల కోసం ర్యాంకులను ప్రకటిస్తామని వివరించింది. ఏప్రిల్‌లో జరిగే రెండో దశ జేఈఈ మెయిన్ ఫలితాల వెల్లడి తర్వాత టాప్ 2.56 లక్షల మందిని ఐఐటీల్లో ప్రవేశాలకు అవసరమైన జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా ప్రకటించనుంది.

అడ్వాన్స్డ్‌కు కటాఫ్ 88 పర్సెంటైల్!
ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్‌కు అర్హులుగా పరిగణనలోకి తీసుకునే కటాఫ్ జనరల్ కేటగిరీలో 88 పర్సెంటైల్ ఉండే అవకాశం ఉందని నిఫుణులు పేర్కొంటున్నారు. ఓబీసీ కేటగిరీలో 70 పర్సెంటైల్, ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కేటగిరీలో 60 పర్సెంటైల్ ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

100 పర్సెంటైల్ వచ్చినవారు..

దరఖాస్తు నెంబరు

విద్యార్థి పేరు

రాష్ట్రం

190310086378 ధ్రువ్ అరోరా మధ్యప్రదేశ్
190310096437 రాజ్‌ఆర్యన్ అగర్వాల్ మహారాష్ట్ర
190310126508 ఆదెల్లి సాయి కిరణ్ తెలంగాణ
190310131614 బొజ్జా చేతన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్
190310139257 సంబిత్ బెహెరా రాజస్తాన్
190310150035 నమన్‌గుప్తా ఉత్తరప్రదేశ్
190310166518 ఇందుకూరిజయంత్ ఫణిసాయి తెలంగాణ
190310167837 విశ్వనాథ్ కె తెలంగాణ
190310204122 హిమాను్‌ష్ గౌరవ్‌సింగ్ ఉత్తరప్రదేశ్
190310208678 కెవిన్ మార్టిన్ కర్ణాటక
190310240908 శుభాంకర్ గంభీర్ రాజస్తాన్
190310244684 బట్టెపాటి కార్తికేయ తెలంగాణ
190310324762 అంకిత్ కుమార్‌మిశ్రా మహారాష్ట్ర
190310378068 జయేశ్ సింగ్లా పంజాబ్
190310597090 గుప్తా కార్తికేయ్ చంద్రేశ్ మహారాష్ట్ర

Edu newsసైంటిస్ట్ కావాలన్నదే లక్ష్యం..        
 మాది సిద్ధిపేట జిల్లా గౌరారం మండలంలోని పాములపర్తి గ్రామం. న్యూక్లియర్ సైంటిస్ట్ కావాలన్నదే నాలక్ష్యం. న్యూక్లియర్ పవర్‌పై పరిశోధన చేస్తా. అందుకోసం ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నా. జేఈఈ అడ్వాన్స్డ్ ఐఐటీ బాంబేలో చదువాలని ఉంది. అందుకు ప్రిపేర్ అవుతున్నాను.
  - సాయికిరణ్ 
 
Edu news సొంతంగా కంపెనీ స్థాపిస్తా...   
 బాగా చదువుకొని సొంతంగా కంపెనీ స్థాపించాలన్నదే నా లక్ష్యం. అందుకు అవసరమైన పెట్టుబడి కోసం ముందుగా ఉద్యోగం చేస్తా. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుతాను. అందుకోసమే ప్రిపేర్ అవుతున్నాను.
  - బొజ్జా చేతన్‌రెడ్డి 
 
జేఈఈ మెయిన్-2019ఫలితాల కోసం క్లిక్ చేయండి
Published date : 21 Jan 2019 03:51PM

Photo Stories