Skip to main content

జేఈఈ అడ్వాన్స్డ్‌కు 66 వేల మంది దూరం

సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం మే 20వ తేదీన ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఈసారి తక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు 2,31,024 మందికి అర్హత కల్పిస్తే కేవలం 1,64,822 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అంటే 66,202 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదు. అందులోనూ రిజిస్టర్ చేసుకుని, ఫీజు చెల్లించిన వారు 1,60,716 మంది మాత్రమే. అయితే ఫీజు చెల్లించని వారు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.1,800, ఇతరులు రూ. 3,100) పరీక్ష రోజున కేంద్రంలో అందజేయాలని ఐఐటీ కాన్పూర్ సూచించింది. వారికి కూడా మే 14న వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు మే 20 వరకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఇక జేఈఈ అడ్వాన్స్డ్‌కు తెలంగాణ నుంచి దాదాపు 30 వేల మంది అర్హత సాధిస్తే పరీక్ష రాసేందుకు 18 వేల మంది వరకే దరఖాస్తు చేసుకున్నట్లు ఐఐటీ కాన్పూర్ వర్గాలు అంచనా వేశాయి. మే 20న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్ -1 పరీక్ష, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించేందుకు ఐఐటీ కాన్పూర్ ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు రెండు పేపర్లు తప్పనిసరిగా రాయాలని పేర్కొంది. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్‌లలో కేంద్రాలను ఏర్పాటు చేసింది.

జోన్ల వారీగా దరఖాస్తు చేసిన వారు

జోన్

విద్యార్థుల సంఖ్య

ఐఐటీ బాంబే 28,813
ఐఐటీ ఢిల్లీ 31,884
ఐఐటీ గౌహతి 11,907
ఐఐటీ కాన్పూర్ 20,428
ఐఐటీ ఖరగ్‌పూర్ 19,145
ఐఐటీ మద్రాసు 38,231
ఐఐటీ రూర్కీ 14,414
మొత్తం 1,64,822
Published date : 15 May 2018 01:51PM

Photo Stories