Skip to main content

జేఈఈ అడ్వాన్స్‌డ్-2020లోమరో పది వేల మంది సీట్లు

జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా హాజరుకు అనుమతి లభించే జేఈఈ-అడ్వాన్స్‌డ్ 2020లోనూ మార్పులు జరగనున్నాయి. కొత్త మార్పులపై అడ్వాన్స్‌డ్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఐఐటీ-ఢిల్లీ ఇటీవల ప్రకటన కూడా చేసింది. మార్పుల వివరాలు..
అర్హుల సంఖ్య 2.5 లక్షలకు పెంపు :
జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా అడ్వాన్స్‌డ్‌కు 2020 నుంచి 2.5 లక్షల మంది విద్యార్థులకు అవకాశం లభించనుంది. గతేడాది వరకు ఈ సంఖ్య 2.4 లక్షలే. తాజా నిర్ణయంతో అదనంగా మరో పది వేల మందికి ప్రయోజనం చేకూరనుంది.

విరామ సమయం పెంపు :
జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ను ఒకే రోజు పేపర్-1, పేపర్-2.. ఇలా రెండు పేపర్లుగా నిర్వహిస్తున్నారు. రెండు పేపర్ల మధ్య విరామ సమయంలో మార్పు చేశారు. పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు; పేపర్ 2 మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు జరుగనుంది. గతేడాది వరకు రెండో పేపర్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి అయిదు గంటల వరకు జరిగేది. రెండు పేపర్ల మధ్య విరామ సమయం తక్కువగా ఉందంటూ విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమైంది. దాంతోపాటు పరీక్ష హాల్లోకి అనుమతి పరంగా బయోమెట్రిక్ తనిఖీల కారణంగా జరుగుతున్న జాప్యాన్ని సైతం దృష్టిలో పెట్టుకొని విరామ సమయాన్ని పెంచినట్లు జేఈఈ అడ్వాన్స్‌డ్-2020 నిర్వాహక వర్గాలు పేర్కొన్నాయి.

అమెరికాలోనూ పరీక్ష కేంద్రం :
జేఈఈ-అడ్వాన్స్‌డ్ పరంగా పరీక్ష కేంద్రాల విషయంలోనూ మార్పు జరిగింది. జేఈఈ అడ్వాన్స్‌డ్-2020ను అమెరికాలోనూ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం శాన్‌ఫ్రాన్సిస్కో ప్రాంతంలో ఏదో ఒక సెంటర్‌ను నిర్ణయించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో అడీస్ అబాబా(ఇథియోపియా),కొలంబో(శ్రీలంక) సెంటర్లను రద్దు చేయనున్నారు. ఈ రెండు కేంద్రాల్లో అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య ఆశించనంతగా లేకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. మరోవైపు అమెరికాలోని ప్రవాస భారతీయుల పిల్లలు అడ్వాన్స్‌డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకుంటుండటంతో ఆ దేశంలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఐఐటీ-ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి.

ఇన్‌స్టిట్యూట్‌లు.. సీట్ల వివరాలు..
జోసా (జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ)-2019 కౌన్సెలింగ్ గణాంకాల ప్రకారం- దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో నాలుగేళ్ల బీటెక్, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్ కోర్సుల సీట్ల వివరాలు..

ఐఐటీల సంఖ్య: 23
నాలుగేళ్ల ఇంజనీరింగ్, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్ సీట్ల సంఖ్య:
12,463

ఎన్‌ఐటీలు: 31
నాలుగేళ్ల ఇంజనీరింగ్, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్ సీట్ల సంఖ్య:
20,428

ట్రిపుల్ ఐటీలు: 26
నాలుగేళ్ల ఇంజనీరింగ్, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్ సీట్ల సంఖ్య:
4617

ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లు: 30
నాలుగేళ్ల ఇంజనీరింగ్, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్ సీట్ల సంఖ్య:
5769
Published date : 21 Oct 2019 04:08PM

Photo Stories