Skip to main content

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2017 షెడ్యూల్ విడుదల

సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యాసంస్థల్లో 2017-18 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)-2017 షెడ్యూలు అక్టోబర్ 13న విడుదలైంది.
ఈ మేరకు మద్రాసు ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్-2017 వెబ్‌సైట్ (jeeadv.ac.in)ను అందుబాటులోకి తెచ్చింది. ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్‌ను కూడా వెల్లడించింది. 2017 ఏప్రిల్ 2న జేఈఈ మెయిన్ పరీక్ష, మే 21వ తేదీన అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతోపాటు పరీక్షల ప్రక్రియ పూర్తి వివరాలను వెల్లడించింది. రిజిస్ట్రేషన్, సీట్లు, ఫీజు తదితర వివరాలకు సంబంధించి త్వరలోనే సమాచార పత్రాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపింది. తొలుత జేఈఈ మెయిన్‌లో టాప్ మార్కులు సాధించిన 1.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అనుమతించగా, 2016లో టాప్ 2 లక్షల మందిని అనుమతించారు. అయితే సీట్లు మిగిలిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో 2017 అడ్వాన్స్‌డ్ పరీక్షకు 2.20 లక్షల మందిని అనుమతిస్తామని తెలిపింది. ఓపెన్ కేటగిరీలో 1,11,100 మందిని (50.5%), ఓబీసీ కేటగిరీలో 59,400 మందిని (27%), ఎస్సీ కేటగిరీలో 33 వేల మందిని (15%), ఎస్టీ కేటగిరీలో 16,500 మందిని (7.5%) అడ్వాన్స్‌డ్ పరీక్షకు అనుమతిస్తామని వివరించింది.

అర్హత వివరాలు
  • 1992 అక్టోబర్ 1న లేదా ఆ తరువాత జన్మించిన వారు ఈ పరీక్షకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఒక అభ్యర్థి గరిష్టంగా మూడు సార్లు, వరుసగా అయితే రెండుసార్లు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంటుంది.
  • ఇంటర్ వార్షిక పరీక్షలు 2016 రాసినవారు, 2017లో రాయబోయే వారు అడ్వాన్స్‌డ్‌కు హాజరుకావచ్చు. 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి 2015 జూన్ తరువాత ఫలితాలు వచ్చిన విద్యార్థులు రాయవచ్చు.
  • ఇప్పటికే ఐఐటీల్లో చేరిన వారు, గతంలో ఐఐటీల్లో సీట్లు పొంది, కాలేజీల్లో రిపోర్టింగ్ చేశాక సీటు రద్దు చేసుకున్న వారు ఈ పరీక్ష రాసేందుకు అనర్హులు.
  • 2016 జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సీటు లభించాక యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించి, సీటును యాక్సెప్ట్ చేయని వారు (జాయింట్ సీట్ అలోకేషన్‌లో భాగంగా రిపోర్టింగ్ కేంద్రాల్లో ఎక్కడా రిపోర్టు చేయని వారు) ఈ పరీక్ష రాయవచ్చు.
  • ఏదైనా ఐఐటీల్లో 2016లో మొదటిసారిగా ప్రిపరేటరీ కోర్సులో చేరిన వారు 2017 జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరుకావచ్చు.

షెడ్యూల్ ఇదీ..
2-4-2017:
జేఈఈ మెయిన్ (ఆఫ్‌లైన్) పరీక్ష
27-4-2017: జేఈఈ మెయిన్ ఫలితాలు
28-4-2017 నుంచి 2-5-2017 వరకు: అడ్వాన్స్‌డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్
3-5-2017 నుంచి 4-5-2017 వరకు: ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్‌కు అవకాశం
10-5-2017 నుంచి 21-5-2017 వరకు: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
21-5-2017: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష
31-5-2017 నుంచి 3-6-2017 వరకు: ఆన్‌లైన్‌లో ఓఎంఆర్ జవాబు పత్రాల ప్రదర్శన, విజ్ఞప్తుల స్వీకరణ
4-6-2017: వెబ్‌సైట్‌లో అందుబాటులోకి జవాబుల ‘కీ’లు
4-6-2017 నుంచి 6-6-2017 వరకు: అభ్యంతరాల స్వీకరణ
11-6-2017: అడ్వాన్స్‌డ్ ఫలితాల వెల్లడి
11-6-2017 నుంచి 12-6-2017 వరకు: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ)కు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
14-6-2017: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఏఏటీ పరీక్ష
18-6-2017: ఏఏటీ ఫలితాల విడుదల
19-6-2017 నుంచి 18-7-2017 వరకు: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీల్లో సంయుక్త ప్రవేశాలు
Published date : 14 Oct 2016 12:12PM

Photo Stories