ఇంటర్‌లో పర్యావరణ విద్య తరహాలోనే తెలుగు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్‌లో విలువలు, పర్యావరణ విద్య సబ్జెక్టుల తరహాలోనే తెలుగును ఒక సబ్జెక్టుగా ప్రవేశ పెడితే బాగుంటుందని విద్యావేత్తలు, ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా ప్రవేశ పెట్టాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అక్టోబర్ 4న విద్యావేత్తలు, ప్రముఖులతో సమావేశం నిర్వహించింది. ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ సత్యనారాయణ, అధికార భాషా సంఘం చైర్మన్ ప్రభాకర్‌రావు, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సీఎంవో ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం పర్యావరణ విద్య సబ్జెక్టు తరహాలోనే తెలుగును ప్రవేశ పెట్టడం మంచిదన్న అభిప్రాయానికొచ్చారు. తెలుగు చదవడం, పరీక్ష రాయడం తప్పనిసరి చేస్తే బాగుంటుందని, అయితే అందులో పాస్, ఫెయిల్ విధానం సరికాదన్నారు.
Published date : 05 Oct 2017 01:35PM