ఇంటర్ విద్యార్థుల గుర్తింపు ఫీజు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్‌లో విద్యార్థుల గుర్తింపునకు సంబంధించిన ఫీజును రూ.85 నుంచి రూ.200కు పెంచుతూ తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
2007- 08లో రూ.75గా ఉన్న ఫీజును రూ.85కు పెంచామని, అనంతరం ప్రతి ఏడాది రూ. 10 చొప్పున పెంపుదల చేయలేదని అన్నారు. ఈ కారణంగా ప్రస్తుతం రూ.200కు పెంచినట్లు బోర్డు కార్యదర్శి అశోక్ వివరించారు. జీఎస్టీ భారం, స్టేషనరీ ఖర్చుల పెరుగుదల దృష్ట్యా ఫీజు పెంపు నిర్ణయం తీసుకున్నామని నవంబర్ 15న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల కళాశాలలు, మోడల్ స్కూల్స్, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలలు 2017-18కు సంబంధించి 60 శాతం గుర్తింపు ఫీజును చెల్లించాయని తెలిపారు. ఈ ఫీజును విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించిన డేటా నామినల్ రోల్స్ తయారీ, కళాశాలల ఆన్‌లైన్ సర్వీసులు, సీజీజీ తదితర కార్యకలాపాలకు వెచ్చిస్తామని అన్నారు. స్పాట్ వాల్యుయేషన్ క్యాంపుల నిర్వహణ, పరీక్ష ఫలితాల సమయంలో కంప్యూటర్ అనుబంధ పరికరాలు, నిర్వహణ ఖర్చులు ఎక్కువ అయ్యాయన్నారు.
Published date : 16 Nov 2017 01:52PM