ఇంటర్ స్పాట్ కేంద్రాల్లో బయోమెట్రిక్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల్లో బయోమెట్రిక్ పరికరాలను తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ నెల 8న సంస్కృతం వంటి పేపర్ల మూల్యాంకనం ప్రారంభమైనా, ఈ నెల 16 నుంచి ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన మూల్యాంకనం ప్రారంభం కానుంది.
ఈ మూల్యాంకనంలో దాదాపు 25 వేల మంది లెక్చరర్లు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయా మూల్యాంకన కేంద్రాల్లో బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసింది. గతంలో మూల్యాంకన కేంద్రాల్లో విధులకు హాజరయ్యే లెక్చరర్లు తమకిచ్చిన 30 జవాబు పత్రాలను ఆదరాబాదరాగా మూల్యాంకనం చేసి నిర్ణీత సమయానికంటే ముందుగానే వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో అనేకమంది విద్యార్థులకు మార్కుల్లో తేడాలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి లెక్చరర్లు తొందరగా పేపర్లు దిద్ది, ముందుగా వెళ్లిపోకుండా, నిర్ణీత సమయం వరకు ఉండేలా, నిదానంగా మూల్యాంకనం చేసేందుకు బయో మెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసింది.
Published date : 16 Mar 2017 01:31PM