Skip to main content

ఇంటర్ సిలబస్‌లో మార్పులు

సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో తెలంగాణ ఇంటర్మీడియట్ పుస్తకాలు మారనున్నాయి. ఇప్పటికే సబ్జెక్టు నిఫుణుల కమిటీని ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ బోర్డు.. సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులపై చర్చిస్తోంది.
సెకండియర్‌లోని ద్వితీయ భాషలైన ఉర్దూ, సంస్కృతం, హిందీ, అరబిక్ భాషలను మార్పు చేస్తోంది. తెలంగాణ ప్రముఖులు, చరిత్ర, సంస్కృతి, భౌగోళిక స్వరూపం, తెలంగాణ వైభవం తదితర అంశాలను ఈ పుస్తకాల్లో పొందుపర్చనుంది. అలాగే ఫస్టియర్‌లోని హ్యుమానిటీస్‌లో భారీగా మార్పులు చేస్తోంది. కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పాఠ్య పుస్తకాలను మార్చుతోంది. వ్యాట్ స్థానంలో జీఎస్టీ వచ్చిన నేపథ్యంలో జీఎస్టీ పాఠాలను కామర్స్‌లో పొందుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఐదేళ్ల కాలంలో 10 శాతం రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్ వంటి రాజ్యాంగ సవరణలు, నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, తెలంగాణ ఏర్పాటు, అందులో 33 జిల్లాల ఏర్పాటు, కొత్త మండలాల ఏర్పాటు, జోన్ల విభజన తదితర మార్పులు ఉన్న నేపథ్యంలో పుస్తకాల్లో మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే జూన్ నుంచి మార్పు చేసిన పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇక 2020-21 విద్యా సంవత్సరంలో ఫస్టియర్ ప్రథమ భాషలను, సెకండియర్ ద్వితీయ భాష, ఫస్టియర్ ద్వితీయ భాష తెలుగు పాఠ్య పుస్తకాలను మార్పు చేయాలని నిర్ణయించింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సిలబస్‌ను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. సీబీఎస్‌ఈ మార్పులు చేస్తే ఆ మేరకు మార్పులను చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం మాత్రం వాటిల్లో ఎలాంటి మార్పులు ఉండవని బోర్డు కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు. 2012లో సిలబస్ మార్పు చేసిన సీబీఎస్‌ఈ త్వరలోనే వాటిల్లో మార్పులు చేసే అవకాశముంది.
Published date : 26 Feb 2019 02:54PM

Photo Stories