Skip to main content

ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్స్ బదులు ప్రాజెక్ట్స్..పబ్లిక్ పరీక్షలు కూడా..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు నిర్వహించాల్సిన ప్రాక్టికల్ పరీక్షలు, థియరీ పరీక్షలపై ఇంటర్మీడియెట్ బోర్డు ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తోంది.
కోవిడ్-19 నేపథ్యంలో ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణకు పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరయ్యే పరిస్థితి లేకపోవడంతో సగం మందితో ఆఫ్‌లైన్, మిగతావారికి ఆన్‌లైన్‌లో బోధన సాగేలా బోర్డు అన్ని కాలేజీలకు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం పలు కాలేజీలు ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఆన్‌లైన్ నిలిపేసి ఫీజుల వసూలుకు ఆఫ్‌లైన్ తరగతులకు హాజరుకావాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తుండడంతో.. అలా కుదరదని, రెండు రకాల బోధన కొనసాగించాల్సిందేనని బోర్డు స్పష్టం చేసింది. అయితే కోవిడ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ విషయంలో మాత్రం బోర్డు తర్జనభర్జనలు పడుతోంది.

Check Inter new syllabus here

ప్రాక్టికల్స్ స్థానంలో అవే అంశాలపై ప్రాజెక్టు వర్కులు
ఇంటర్మీడియెట్ విద్యార్థులకు జనవరిలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈసారి ప్రాక్టికల్స్ నిర్వహణ సమస్యగా మారుతోంది. ప్రాక్టికల్స్‌కు కొన్ని కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులందరినీ జంబ్లింగ్ విధానంలో ఆయా కేంద్రాల్లో ప్రాక్టికల్స్‌కు అనుమతిస్తారు. కోవిడ్ వల్ల విద్యార్థులు ఆయాకేంద్రాలకు చేరుకోవడం ఒక ఇబ్బంది అయితే ల్యాబ్ రూములు చిన్నవిగా ఉన్నందున అక్కడ అందరూ గుమిగూడి ప్రయోగాలు నిర్వహించడం కూడా సరికాదని బోర్డు భావిస్తోంది. ఈ ప్రాక్టికల్స్‌కు ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ పద్ధతిలో రోజూ మార్చే విధానం అమలు చేస్తున్నారు. వైరస్ నేపథ్యంలో ఈ విధానం అనవసర సమస్యలకు దారితీసే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్‌కు బదులు అవే అంశాలపై ప్రాజెక్టు వర్కులను ఇచ్చి ఎవరికివారే వాటిని పూర్తిచేసి సమర్పించేలా చేయాలని ఆలోచిస్తున్నారు.

Check Inter EM & TM Study material

రెండో సంవత్సరం విద్యార్థులకే థియరీ పరీక్షలు
కోవిడ్ వల్ల ఈ విద్యాసంవత్సరాంతంలో నిర్వహించాల్సిన థియరీ పరీక్షల్లో కొన్ని మార్పులు చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు భావిస్తోంది. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మాత్రమే తరగతులు జరుగుతున్నాయి. ఫస్టియర్ ప్రవేశాలు ఇంకా చేపట్టలేదు. ఆన్‌లైన్ ప్రవేశాలపై చాలాకాలం కిందటే ఇంటర్మీడియెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. జూనియర్ కాలేజీల్లోని సెక్షన్ల వారీగా విద్యార్థుల సంఖ్యను సీబీఎస్‌ఈ మాదిరి 40కి పరిమితం చేస్తూ ప్రభుత్వం జీవో 23 ఇచ్చింది. వీటిపై కొన్ని కాలేజీలు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఆ జీవో అమలు, ఆన్‌లైన్ ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయాయి. ఫస్టియర్ ప్రవేశాలు ఇంకా చేపట్టనందున ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగాల్సిన థియరీ పరీక్షలను ఈ విద్యాసంవత్సరం వరకు సెకండియర్ విద్యార్థులకే పరిమితం చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు రెండో సంవత్సరం తరగతులు జరుగుతున్న సమయంలోనే మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు.

Check Inter previous papers 

ఈ ఏడాది వరకు పాతపద్ధతిలోనే ప్రవేశాలు
జీవో 23ని కోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు ముందుకు సాగలేదు. దీనిపై ప్రభుత్వ ఆదేశానుసారం ముందుకెళ్లాలని బోర్డు భావిస్తోంది. ప్రస్తుతం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై పై కోర్టుకు వెళ్లి, తరువాత ప్రవేశాలు చేపట్టాలంటే చాలా ఆలస్యం అవుతుంది. ఇప్పటికే ప్రవేశాలు ఆలస్యమైనందున ఈ విద్యాసంవత్సరం వరకు ఫస్టియర్ ప్రవేశాలను గతంలో మాదిరి ఆఫ్‌లైన్లో పూర్తిచేయడం మంచిదని బోర్డు భావిస్తోంది. ఆన్‌లైన్ ప్రవేశాలపై ఈ విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే బోర్డు ఆదేశాలు జారీచేయడంతో పాటు దానికి విసృ్తత ప్రచారం కూడా కల్పించారు. అన్ని కాలేజీల వసతి ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఆన్‌లైన్లో ఫొటోలు, ఇతర పత్రాలను కూడా అప్‌లోడ్ చేయించారు. అయినా కొంతమంది ప్రచారం చేయలేదని, ఆన్‌లైన్ ప్రవేశాలపై జీవో ఇవ్వలేదంటూ న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ప్రవేశాలు నిలిచిపోయాయి. వాస్తవానికి బోర్డు స్వయం ప్రతిపత్తి ఉన్నది కనుక జీవోలతో సంబంధం లేకుండానే తన కార్యకలాపాలను సాగించే అవకాశముంది. అయినా ఆ కారణాలనే చూపుతూ న్యాయస్థానం ఆన్‌లైన్ ప్రవేశాలను నిలిపేసినందున ప్రస్తుతానికి పాత విధానంలోనే వాటిని పూర్తిచేయాలని బోర్డు భావిస్తోంది.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం
కోవిడ్ కారణంగా ఈ విద్యాసంవత్సరం వరకు ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలకు బదులు ప్రాజెక్టు వర్కులు ఇవ్వాలని, థియరీ పరీక్షలు సెకండియర్ విద్యార్థులకే నిర్వహించాలని, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఫస్టియర్ విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేసిన తరువాత పరీక్షలు నిర్వహించడం వంటి అంశాలను నివేదించాం. ప్రభుత్వ ఆమోదానంతరం చర్యలు చేపడతాం. ఫస్టియర్ ప్రవేశాలపైనా ప్రభుత్వ సూచనలను అనుసరించి ముందుకు వెళ్తాం.
- రామకృష్ణ, బోర్డు కార్యదర్శి
Published date : 04 Jan 2021 03:22PM

Photo Stories