Skip to main content

ఇంటర్ ఫలితాలపై నిపుణుల కమిటీ ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాల విషయంలో వస్తున్న అపోహలను నివృత్తి చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి వెల్లడించారు.
టీఎస్‌టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావుతో పాటు హైదరాబాద్ బిట్స్‌కు చెందిన ప్రొఫెసర్ వాసన్, ఐఐటీ ప్రొఫెసర్ నిశాంత్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇంటర్ ఫలితాల విషయంలో సత్వర దర్యాప్తు జరిపి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించారు. ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై ఏప్రిల్ 21న ఆయన విద్యా శాఖ కార్యదర్శి జనార్దనరెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితాల విషయంలో తల్లిదండ్రులెవరూ గందరగోళానికి గురికావద్దని సూచించారు. కొందరు అధికార అంతర్గత తగాదాల వల్లే ఈ విషయంలో అపోహలు వచ్చాయని వెల్లడించారు. ఫలితాల విషయంలో ఎలాంటి పొరపాటు జరిగినా సరిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ వాసన్ ఐటీ విషయంలో, నిశాంత్ పోటీ పరీక్షల నిర్వహణలో నిపుణులని, వారిచ్చే నివేదిక మేరకు ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఫలితాల్లో ఎక్కడైనా తప్పులు వచ్చాయని భావిస్తే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌లకు దరఖాస్తు చేసుకోవాలని, తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Published date : 22 Apr 2019 03:33PM

Photo Stories