ఇంటర్ ప్రాక్టికల్స్ జంబ్లింగ్‌లోనే...
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్‌లోనే నిర్వహించనున్నారు. ఈనెల 3 నుంచి ఈనెల 22 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి.
ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి పేర్కొన్నారు. జంబ్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా పరీక్షలను యథావిధిగా కొనసాగించడానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా జంబ్లింగ్‌లో ఈ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 3 నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,20,774 మంది ఈ పరీక్షలు రాయనున్నారు. మొత్తం 977 ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 435 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 113 ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, 429 ప్రైవేట్ జూనియర్ కాలేజీలున్నాయి. బైపీసీలో 78,112 మంది, ఎంపీసీలో 2,42,662 మంది హాజరవుతున్నారు.
Published date : 03 Feb 2017 02:38PM