Skip to main content

ఇంటర్ హ్యుమానిటీస్ సిలబస్‌లో మార్పులు

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం హ్యుమా నిటీస్‌లో సమూల మార్పులకు తెలంగాణ ఇంటర్ బోర్డు శ్రీకారం చుట్టింది.
మారుతున్న పరిస్థితులు, వ్యవస్థలో మార్పులు, మారిన చట్టాలు, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సబ్జెక్టులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మార్పులు ప్రవేశపెట్టనుంది. ఈ మార్పులు 2020-21 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చేలా కసరత్తు చేస్తోంది.

కామర్స్‌పై ప్రత్యేక దృష్టి..
ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు కూడా ఉపాధి అవకాశాలు లభించేందుకు కామర్స్‌లో మార్పులపై ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం హ్యుమానిటీస్‌లో ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ కోర్సులు ఉన్నాయి. అయితే వాటిలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు అవసరమని బోర్డు నిర్ణయించింది. ముఖ్యంగా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించేందుకు అవసరమైన పాఠ్యాంశాలు పొందుపరుచాలని భావించింది. ఇందులో భాగంగా జీఎస్టీ, అకౌంటెన్సీ, ఈ-ఫైలింగ్, కంప్యూటర్ సైన్‌‌స వంటి సబ్జెక్టులను చేర్చేందుకు చర్యలు చేపట్టింది. వీటిని సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీలోని కామర్స్ సిలబస్‌లో చేర్చుతోంది. ఇందుకోసం చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సహకారంతో పాఠ్యాంశాలు రూపొందించే నిపుణులకు శిక్షణ ఇప్పిస్తోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చిన వాణిజ్య సంబంధాల్లో మార్పులను ఇందులో పొందుపరచనుంది. ఇక పొలిటికల్ సైన్‌‌సలో (సివిక్స్) రాజ్యాంగంలో మార్పులు, అందుకు అనుగుణంగా అమల్లోకి తెచ్చిన కొత్త చట్టాలు, చట్టాల్లో వచ్చిన మార్పులు, కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాల్లో మార్పులు, వ్యాట్ స్థానంలో వచ్చిన జీఎస్టీ, ఆర్టికల్ 370, 35 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి అంశాలపై పాఠ్యాంశాలను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. అలాగే చరిత్ర సబ్జెక్టులోనూ అవసరమైన మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది.
Published date : 01 Jan 2020 05:33PM

Photo Stories