Skip to main content

ఇంటర్ బోర్డు ఉద్యోగులకు టర్మ్ డ్యూటీ అమలు: టీఎస్ ఇంటర్ బోర్డు

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ బోర్డు, ఇంటర్మీడియట్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు 20 శాతం మంది రోజూ కార్యాలయాలకు రావాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి, ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఉత్తర్వులు జారీచేశారు.
రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర పనులు ఉన్నందున బోర్డు, కమిషనరేట్ ఉద్యోగులు 20 శాతం మంది విధులకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఈనెల 24 నుంచి 31వ తేదీ వరకు రొటేషన్ పద్ధతిలో రోజువారీగా హాజరు కావాల్సిన ఉద్యోగుల జాబితాతో ఉత్తర్వులు జారీచేశారు. పాఠశాల విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖలో ఈనెల 31వ తేదీ వరకు 20 శాతం ఉద్యోగులే హాజరయ్యేలా ఆయా శాఖలు ఏర్పాట్లు చేశాయి. ఈనెల 20 నుంచి 31వ తేదీ వరకు రోజువారీగా ఏయే ఉద్యోగులు విధులకు హాజరు కావాలి? ఏయే ఉద్యోగులు సెలవుల్లో ఉండాలన్న వివరాలతో కూడిన ఆదేశాలను ఆయా శాఖలు జారీ చేశాయి. అలాగే రొటేషన్ పద్ధతిలో ఏయే ఉద్యోగులు ఏయే రోజుల్లో హాజరు కావాలన్న వివరాలతో ఆదేశాలను జారీచేశాయి. ఇక మిగతా ఉద్యోగులు వీలైతే ఈ-ఆఫీస్ విధానంలో ఇళ్ల నుంచే పని చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. అయితే ఇళ్లలో ఉండే అధికారులు ఫోన్, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండి అవసరమైన సహకారం అందించాలని ఉన్నతాధికారులు సూచించారు.
Published date : 24 Mar 2020 03:31PM

Photo Stories