Skip to main content

ఇంగ్లిష్, హిందీల్లోనే జేఈఈ మెయిన్స్

సాక్షి, హైదరాబాద్: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే నిర్వహిస్తున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) స్పష్టం చేసింది.
జేఈఈ మెయిన్స్ ద్వారా ఆయా రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టేందుకు అంగీకరించిన, తమ ప్రాంతీయ భాషలో పరీక్షను నిర్వహించమని కోరిన రాష్ట్రాల భాషల్లో మాత్రమే (ఇంగ్లిష్, హిందీతోపాటు) జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తున్నామని తెలిపింది. 2013లో జేఈఈ మెయిన్స్ ప్రారంభమయ్యాక గుజరాతీలో పరీక్ష నిర్వహించాలని గుజరాత్ కోరిందని తెలిపింది. 2014లో మహారాష్ట్ర కూడా మరాఠీతోపాటు ఉర్దూలో పరీక్ష నిర్వహించాలని కోరిందని పేర్కొంది. దాంతో గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషల్లోనూ జేఈఈ మెయిన్స్ ప్రశ్నాపత్రం ఇస్తున్నామని వెల్లడించింది. 2016లో ఆ రెండు రాష్ట్రాలు జేఈఈ మెయిన్స్ నుంచి వైదొలిగాయని, అయినా గుజరాత్ కోరినందునే గుజరాతీలో ప్రశ్నాపత్రం ఇస్తున్నామని తెలిపింది. ఆ రెండు మినహా మిగతా రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషల్లో ప్రశ్నాపత్రం ఇవ్వాలని తమను అడగలేదని స్పష్టం చేసింది. ప్రశ్నాపత్రం ఏ భాషలో ఇచ్చినా మూల్యాంకనంలో మాత్రం ఇంగ్లిష్ ప్రశ్నాపత్రాన్నే ప్రామాణికంగా తీసుకుంటామని వెల్లడించింది. 
 
జేఈఈ మెయిన్స్సిలబస్, మోడల్‌పేపర్స్, ఆన్‌లైన్ టెస్టులు, గెడైన్స్ మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి
Published date : 13 Nov 2019 02:51PM

Photo Stories