Inter Examination: ఇంటర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లు.. ఈసారి ఫలితాలు ఆన్‌లైన్‌లో..!
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. జిల్లా ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా జిల్లా యూనిట్‌గా పరీక్షలు జరగనున్నాయి. దీంతో, ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నెల 2న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నైతికత, మానవీయ విలువలు అనే సబ్జెక్టుపై పరీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 23న పర్యావరణ విద్య సబ్జెక్టుపై పరీక్ష నిర్వహించనున్నారు. ప్రయోగ పరీక్షలను ముందుగా ఒకేషనల్ విద్యార్థులకు నిర్వహించనున్నారు.
ఈనెల 5 నుంచి 20 వరకు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. 45 పరీక్ష కేంద్రాల్లో జరిగే వొకేషనల్ ప్రాక్టికల్స్‌కు 4849 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జనరల్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఈనెల 11న ప్రారంభమై 20వ తేదీతో ముగుస్తాయి. 60 కేంద్రాల్లో 8100 మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు కళాశాల ప్రిన్సిపాల్, డిపార్ట్‌మెంటల్ అధికారులు, ఎగ్జామినర్ల సమక్షంలో ఇంటర్మీడియట్ వెబ్‌సైట్ నుంచి ప్రశ్నాపత్రం డౌన్‌లోడ్ చేస్తారు.
ఆన్‌లైన్‌లో మార్కుల నమోదు
ఈసారి మొదటిసారిగా ప్రయోగం పూర్తవగానే ఎగ్జామినర్లు జవాబు పత్రాలను వాల్యుయేషన్ చేసి మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా కొత్త విధానం రూపొందించారు.. గతంలో ఓఎంఆర్, బార్ కోడింగ్ అవార్డు షీట్లపై మాన్యువల్‌గా మార్కులు వేసేవారు. ఈ విధానంలో బోర్డు మార్పులు చేసింది. ఆన్‌లైన్‌లో ప్రయోగ మార్కుల నమోదు ఎలా చేయాలో ఎగ్జామినర్లు, సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లకు విధివిధానాలను ఇప్పటికే పంపించారు. ప్రయోగ పరీక్షలకు ఒకసారి నియమితులైన ఎగ్జామినర్ గరిష్టంగా మూడు రోజులు పనిచేస్తారు.
Acharya Nagarjuna University: ఏఎన్‌యూతో నాట్కో ఎంఓయూ
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను సెలవులు లేకుండా నిర్వహించనున్నారు. శని, ఆది వారాల్లోనూ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతాయి. ప్రైవేటు కళాశాలల్లో పరీక్ష కేంద్రాలకు డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించి ఎలాంటి అక్రమాలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక జిల్లా స్థాయిలో జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ), ప్రత్యేక బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షణ చేస్తాయి. పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసే సీసీ కెమెరాలన్నింటినీ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సజావుగా పరీక్షల నిర్వహణ
మౌలిక వసతులున్న కళాశాలలనే పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేశాం. సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే ఎగ్జామినర్లు, ప్రిన్సిపాళ్లకు పరీక్షల నిర్వహణకు సంబంధించి శిక్షణ ఇచ్చాం. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పరీక్షల నిర్వహణ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. పరీక్షలు సజావుగా జరిగేలా జిల్లా పరీక్షల కమిటీ పర్యవేక్షిస్తుంది.
–బి సుజాత, డీఐఈవో