ఏపీలో 122 ‘జేఈఈ’ టెస్ట్ ప్రాక్టీసింగ్ సెంటర్లు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఎన్‌ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ ఆన్‌లైన్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం రాష్ట్రంలో 122 టెస్ట్ ప్రాక్టీసింగ్ సెంటర్ల (టీపీసీ)ను ఏర్పాటుచేశారు.
వీటిలో 14,437 కంప్యూటర్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఈసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ద్వారా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ను పూర్తిగా ఆన్‌లైన్ (కంప్యూటరాధారితంగా)లోనే నిర్వహిస్తుండడంతో విద్యార్థులు ఆ విధానంలో పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు ఈ టెస్టింగ్ ప్రాక్టీస్ సెంటర్లను ఏర్పాటు చేశారు. దీంతోపాటు విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రాక్టీస్ యాప్‌ను కూడా రూపొందించారు. వీటితోపాటు ‘స్వయం’ ప్లాట్‌ఫామ్‌లో ఐఐటీ - ప్రొఫెసర్ అసిస్టెడ్ లెర్నింగ్ (పీఏఎల్) ద్వారా వీడియో లెక్చర్స్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ వీడియోల ద్వారా విద్యార్థులు జేఈఈ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో వివరించనున్నారు. యాప్ ద్వారా విద్యార్థులు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో టెస్ట్ ప్రాక్టీసును కొనసాగించవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లు లేని వారు టీపీసీ సెంటర్లలో ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రతి శనివారం ఒక షిఫ్టు (మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు), ప్రతి ఆదివారం రెండు షిఫ్టులు (ఉదయం 11 నుంచి 2 గంటల వరకు, 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు) ఈ టీపీసీలు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా 622 జిల్లాల్లో 3,406 టీపీసీ సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో 2,72,348 కంప్యూటర్లను అందుబాటులో ఉంచారు. వీటిలో ప్రాక్టీస్‌కు విద్యార్థులు ముందుగా ఎన్‌టీఏ వెబ్‌సైట్ ద్వారా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
Published date : 19 Sep 2018 03:08PM