డీసెట్టా....ఇంటర్ సప్లమెంటరీనా !?
Sakshi Education
సాక్షి ప్రతినిధి, కడప: మే 18న ఒకే రోజున టీటీసీ ప్రవేశ పరీక్ష (డీ-సెట్), ఇంటర్ సప్లమెంటరీ పరీక్షను నిర్వహిస్తుండటంతో వేలమంది ఇంటర్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోనున్నారు.
2018 మార్చిలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులు పలువురు సప్లిమెంటరీ పరీక్ష రాయడానికి సన్నద్ధమవుతున్నారు. వీరిలో పలువురు ఇంటర్ తర్వాత టీటీసీలో చేరాలనే ఉద్దేశంతో డీ-సెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ పరీక్ష మే 18న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్యలో జరగనుండగా.. అదే రోజున మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల మధ్య డీ-సెట్ పరీక్ష జరగనుంది. దీంతో ఫెయిల్ అయిన ఇంటర్ పరీక్ష రాయాలా? లేక టీటీసీని కోల్పోవాలా అనే మీమాంశలో వేలమంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాదిలో జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,17,714 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వీరిలో సగం మందికి పైగా ఒకటి లేదా రెండు సబ్జెక్టులు మాత్రమే తప్పిపోయారు. వీరిలో కూడా అధిక శాతం మంది విద్యార్థులు ఇంటర్ తర్వాత టీటీసీ (డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్) కోర్సు చేయాలని డీ-సెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు మే 14 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. మరోవైపు డీసెట్ పరీక్ష మే 18న జరగనుంది. ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ పరీక్ష జరుగుతోన్న రోజే డీ-సెట్ పరీక్ష కూడా నిర్వహిస్తుండటంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయినా విద్యార్థులు సైతం టీచర్ ట్రైనింగ్ కోర్సులో చేరవచ్చునని డీసెట్ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొన్నా..విద్యాశాఖ ఇటు అర్హత పరీక్ష, అటు ప్రవేశ పరీక్ష రెండు ఒక్కరోజే పెడితే ఎలా రాయాలని పలువురు విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మే 18న నిర్వహించే ఇంటర్ పరీక్ష అయినా వాయిదా వేయాలని లేని పక్షంలో డీ-సెట్ తేదిలోనైనా మార్పు చేయాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Published date : 12 May 2018 04:39PM