Skip to main content

బీసీ హాస్టళ్లలో సీట్లకు భలే డిమాండ్ !

సాక్షి, హైదరాబాద్: బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని పోస్టుమెట్రిక్ హాస్టళ్లకు డిమాండ్ పెరుగుతోంది. పోస్టుమెట్రిక్ కోర్సుల్లో ప్రవేశాలకుగాను అడ్మిషన్ల కౌన్సెలింగ్ ముగుస్తుండడంతో విద్యార్థులంతా కళాశాలల బాట పడుతున్నారు.
ఈ క్రమంలో హాస్టల్ అడ్మిషన్లకు ఉపక్రమిస్తున్న పలువురికి బీసీ సంక్షేమ వసతిగృహాలు అడ్మిషన్లు ఇవ్వడం లేదు. సీట్లు నిండాయని వారికి ప్రవేశాలు కల్పించడం లేదు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 964 సంక్షేమ వసతిగృహాలున్నాయి. వీటిలో 238 హాస్టళ్లు పోస్టుమెట్రిక్ విద్యార్థులవే. సగం హాస్టళ్లు బాలికలు, మిగతా సగం బాలురకు కేటాయించారు. ఒక్కో హాస్టల్‌లో సగటున వంద మందికి ప్రవేశాలు కల్పించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థుల ఒత్తిడి తీవ్రంగా ఉన్నచోట్ల అక్కడున్న మౌలిక వసతులను బట్టి అదనంగా 20 మందికి అవకాశం కల్పిస్తున్నారు.ప్రస్తుతం వీటిలో విద్యార్థుల సంఖ్య నిర్దేశించినదానికంటే ఎక్కువగా ఉంది. దీంతో కొత్తగా అడ్మిషన్లు తీసుకోవద్దని నిర్ణయించిన బీసీ సంక్షేమ శాఖ ఆమేరకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పోస్టుమెట్రిక్ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ దాదాపు ముగిసింది. డిగ్రీ(దోస్త్) మినహా మిగతా కోర్సుల్లో ప్రవేశాలు పూర్తి కావడంతో ఆయా విద్యార్థులు వసతి కోసం హాస్టళ్ల చుట్టూ తిరుగుతున్నారు.

సీట్లు పెరిగితేనే ప్రవేశం...
ప్రస్తుతం బీసీ వసతిగృహాల్లో అడ్మిషన్లకు వసతిగృహ సంక్షేమాధికారులు నో చెబుతున్నారు. దీంతో అవకాశం కల్పించాలని కోరుతూ ఆశావహులంతా సంక్షేమ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాలు, రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నాలు సైతం నిర్వహించారు. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిని కలిసి బీసీ సంక్షేమ సంఘం నేతలు సీట్ల పెంపును కోరుతూ వినతులు సమర్పించారు. దీంతో స్పందించిన ఆ శాఖ బీసీ హాస్టళ్లలో సీట్లు పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. మౌలిక వసతులు, అనుకూల భవనాలున్న చోట ఒక్కో హాస్టల్‌కు సగటున 50 సీట్లు పెంచేలా అవకాశం ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు నివేదిక సమర్పించింది. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
Published date : 17 Aug 2019 03:39PM

Photo Stories