Skip to main content

ఆలస్యంగా మేల్కొన్న ఇంటర్‌ బోర్డ్‌.. కార్పొరేట్‌ కాలేజీల్లో సగానికి పైగా సిలబస్‌ పూర్తి..!!

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఎట్టకేలకు సోమవారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు మొదలయ్యాయి.

సాయంత్రం 3 నుంచి 5.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నట్టు ఇంటర్మీడియెట్‌ బోర్డ్‌ అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు. జూమ్‌ ద్వారా జరిగే ఈ బోధనలో ఒక్కో సబ్జెక్టుకు అరగంట కేటాయిస్తున్నారు. ఆన్‌లైన్‌ విధానం కొత్త కావడం, బోధకులకు పూర్తిస్థాయి అలవాటు లేకపోవడం, కొన్నిచోట్ల ఇంటర్నెట్, సాంకేతిక సమస్యలు రావడం, విద్యార్థుల మొబైల్‌ డేటా ఎక్కువ ఖర్చు కాకుండా చూసేందుకు క్లుప్తంగా పాఠాలు చెబుతున్నామని వరంగల్‌కు చెందిన ఓ లెక్చరర్‌ చెప్పారు. రాబోయే కాలంలో సమయం పెంచే వీలుందని అధికారులు పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం ప్రత్యక్ష బోధనకు అనుమతిస్తే తాము సిద్ధంగా ఉన్నామని, మరింత మెరుగైన బోధన అందించే అవకాశం ఉంటుందన్నారు. సాధారణంగా తరగతి గదిలో 45 నిమిషాలు లేదా గంట వ్యవధిలో సబ్జెక్టు బోధన జరుగుతుంది. అయితే ఇప్పుడు అరగంటలోనే క్లాస్‌ ముగించడంతో సందేహాలు నివృత్తి చేసుకోలేకపోతున్నామని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చ‌ద‌వండి: ఆగస్టు 16 నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌కు ఆన్‌లైన్‌ క్లాసులు... షెడ్యూల్‌ ఇలా..

చ‌ద‌వండి: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పాఠశాలలు ప్రారంభం..!

చ‌ద‌వండి: జనాభా ప్రాతిపదికన అదనపు పోస్టులు మంజూరు చేయాలి

పెరిగిన అడ్మిషన్లు
ప్రభుత్వ కాలేజీల్లో ఈసారి ఇంటర్‌ ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2015 నుంచి 2020 వరకూ తగ్గిన అడ్మిషన్లు.. ప్రస్తుత సంవత్సరంలో ఏకంగా 1,00,687కు చేరాయి. గతంతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువని అధికారులు తెలిపారు. కాలేజీల ఆధునీకరణపై పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం, కోవిడ్‌ ప్రభావం, ప్రభుత్వ లెక్చరర్లు తీసుకున్న ప్రత్యేక చొరవ వల్లనే ప్రవేశాలు పెరిగాయని అంటున్నారు. రాష్ట్రంలో 5.78 లక్షల మంది పదో తరగతిలో ఉత్తీర్ణులైతే ప్రభుత్వ కాలేజీల్లో చేరింది అందులో నాల్గో వంతే. దాదాపు 4 లక్షల మంది కార్పొరేట్‌ కాలేజీల్లోకి వెళ్లారు. చాలా కాలేజీలు ఇంటర్‌ బోర్డు అనుబంధ అనుమతి ఇవ్వకున్నా విద్యార్థులను చేర్చుకున్నాయి. అనధికారికంగా ఆన్‌లైన్‌లోనే కాదు... ఆఫ్‌లైన్‌లోనూ పాఠాలు చెబుతున్నాయని ప్రభుత్వ లెక్చరర్స్‌ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సగానికిపైగా సిలబస్‌ పూర్తి చేశాయని, ప్రభుత్వ కాలేజీల్లో రెండు నెలలు ఆలస్యంగా పాఠాలు చెప్పడం పేద విద్యార్థులకు నష్టం చేయడమేనని అంటున్నాయి. దీనివల్ల సబ్జెక్టుపై అవగాహన పొందే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నాయి.

ఒత్తిడితో కళ్లు తెరిచారు
ఆలస్యంగానైనా ఆన్‌లైన్‌ బోధన సరైన నిర్ణయమే. ఒత్తిడి కారణంగా ఇంటర్‌ బోర్డ్‌ అడుగులేసినట్టు కన్పిస్తోంది. అయితే, విద్యార్థులకు అర్థమయ్యేలా ఎక్కువ సమయంలో బోధన ఉంటే బాగుంటుంది. ప్రభుత్వ కాలేజీలపై పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని బోర్డ్‌ విశ్వసనీయత పెంచాల్సిన అవసరం ఉంది.
– మాచర్ల రామకృష్ణ గౌడ్, తెలంగాణ విద్యా పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్‌
Published date : 17 Aug 2021 02:49PM

Photo Stories