68 ఇంటర్ కాలేజీలకు నోటీసులు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండా కాలేజీలు ప్రారంభించి, తరగతులు నిర్వహిస్తున్న 68 కాలేజీలకు నోటీసులు జారీ చేసినట్లు ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.
హైకోర్టు ఆదేశాల మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి పేరిట ఇచ్చిన ఈ నోటీసుల్లో మూడు రోజుల్లోగా సంబంధిత కాలేజీల యాజమాన్యాలు వారి అఫిలియేషన్ దరఖాస్తులు ఎందుకు తిరస్కరించకూడదో వివరణ ఇవ్వాలని సూచించింది. వచ్చే విద్యాసంవత్సరానికి 1,476 కాలేజీలకు అఫిలియేషన్ మంజూరు చేశామని, నోటీసులు జారీచేసిన కాలేజీలు మాత్రం అఫిలియేషన్ ఇవ్వకుండానే కాలేజీలను ప్రారంభించి విద్యార్థులను చేర్చుకున్నాయని ఆ ప్రకటనలో తెలిపింది. కాలేజీల యాజమాన్యాలు స్పందించకపోతే ఈనెల 25వ తేదీలోపు తాము చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇంటర్ బోర్డు నోటీసులు జారీ చేసిన వాటిలో శ్రీచైతన్య, నారాయణ, శ్రీగాయత్రి, ఎన్‌ఆర్‌ఐ కాలేజీలకు చెందిన పలు బ్రాంచ్‌లతో పాటు 11 ఇతర కాలేజీలున్నాయి.
Published date : 24 Feb 2020 03:41PM