Skip to main content

29న టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియెట్ పరీక్షలను మార్చి 1వ తేదీనుంచి టెన్త్ పరీక్షలను మార్చి 14వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు షెడ్యూళ్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా రెండు రాష్ట్రాల్లో ఒకే సారి ఈ పరీక్షలు జరిగేలానే ఏపీలోనూ పరీక్షల షెడ్యూల్ ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఇంటర్ ప్రాక్టికల్స్‌ను జంబ్లింగ్‌లో నిర్వహించాలని ప్రభుత్వం ముందు భావించినా ఇన్విజిలేటర్లను జంబ్లింగ్‌లో నియమించాలని భావిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రాక్టికల్స్ జంబ్లింగ్‌లో ఉంటాయని ఇంటర్ బోర్డు ఉత్తర్వులిచ్చింది.

సెట్ల బాధ్యతలపై స్పష్టత: ఇలా ఉండగా, ఎంసెట్ సహా వివిధ సెట్ల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలపై ఉన్నత విద్యామండలిలో గందరగోళం నెలకొంది. సెట్లను ఆన్‌లైన్లో నిర్వహిస్తామని రెండు నెలల క్రితం మంత్రి గంటా ప్రకటన చేసినా అడుగు ముందుకు పడలేదు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో సెట్ల నిర్వహణపై సమావేశాలు పెట్టి బాధ్యతలు ఎవరికి ఇస్తున్నామో తేల్చాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఆ సమావేశాలు నిర్వహించలేదు. ఈలోగానే కొన్ని యూనివర్సిటీల ఉపకులపతులు కొన్ని సెట్ల బాధ్యతలు తమకు ఇచ్చారని అధికారికంగా ప్రకటనలు చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై మంత్రి గంటా మంగళవారం సమీక్ష నిర్వహించి స్పష్టత ఇవ్వనున్నారు.
Published date : 28 Nov 2016 02:46PM

Photo Stories