2017 నీట్ షెడ్యూల్ విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)-2017కు సీబీఎస్‌ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
పరీక్ష మే 7న ఉంటుంది. ఎయిమ్స్, జిప్‌మర్ మినహా అన్ని మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి నీట్ నిర్వహిస్తున్నారు. పరీక్షకు జనవరి 31-మార్చి 1వ తేదీ మధ్య ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సీబీఎస్‌ఈ వెల్లడించింది. ఆలిండియా కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ కోటా సీట్లు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్/ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు, డీమ్డ్ వర్సిటీలోని సీట్లు, సెంట్రల్ పూల్ కోటా సీట్లకు నీట్ ర్యాంకుల ద్వారానే అడ్మిషన్లు నిర్వహిస్తామని నీట్ డెరైక్టర్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 80 నగరాల్లో 1500 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. 15 శాతం ఆలిండియా కోటా సీట్లకు ప్రవాస భారతీయలు, విదేశీయులు కూడా నీట్ రాసుకోవడానికి వీలు కల్పించారు. నీట్ రాయడానికి 25 ఏళ్ల గరిష్ట వయోపరిమితి విధించారు. రిజర్వు అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. ఎవరైనా మూడుసార్లకు మించి పరీక్ష రాయడానికి వీలు లేదు. మేఘాలయ, అస్సాం, జమ్మూ కశ్మీర్ మినహా మిగిగతా రాష్ట్రాల విద్యార్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తులో ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఆదేశాల మేరకు నీట్-2017 ఆలిండియా ర్యాంకులను నీట్ తయారుచేయనుంది. పూర్తి వివరాలను నీట్ వెబ్‌సైట్ 'www.cbseneet.nic.in'లో ఉంచారు. దేశంలోని అన్ని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు నీట్ పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి. 10 లక్షల మంది ఈసారి నీట్ రాస్తారని అంచనా. గతేడాది నీట్-1, నీట్-2లకు 8.02 లక్షల మంది హాజరయ్యారు.
Published date : 01 Feb 2017 10:35AM