12వ తరగతిలో 22.65 శాతం ఉత్తీర్ణత
Sakshi Education
సాక్షి, ముంబై: మహారాష్ట్ర స్టేట్ సెకండరీ, హయ్యర్ సెకండరీ విద్యా బోర్డు 12వ తరగతి విద్యార్థుల సఫ్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం (ఆగస్ట్ 24) మధ్యాహ్నం వెలువడ్డాయి.
ఇందులో కేవలం 22.65 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ విద్యా సంవత్సరంలో 12వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలు మే మొదటి వారంలో వెలువడిన విషయం తెలిసిందే. అందులో ఫెయిలైన 1,02,160 మంది విద్యార్థులు ఫీజు చెల్లించి మళ్లీ పరీక్షలు రాశారు. ఈ పరీక్షలు జూలై 17-ఆగస్టు 4 తేదీల మధ్య జరిగాయి. ఇందులో ఆగస్ట్ 24న వెలువడ్డ ఫలితాల్లో 22.65 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు బోర్డు ప్రకటించింది. గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం మరింత తగ్గిపోయింది. 2016లో 27.03 శాతం ఉత్తీర్ణత సాధించగా, 2017లో 24.96 శాతం, 2018లో 22.65 శాతానికి పడిపోయిందని బోర్డు కార్యదర్శి అశోక్ బోంస్లే వెల్లడించారు.
Published date : 25 Aug 2018 05:32PM