Skip to main content

తిరుపతి ఐఐటీని ఉన్నతంగా తీర్చిదిద్దుతాం...

‘‘ఐఐటీ తిరుపతి క్యాంపస్‌లో ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. తాత్కాలిక ప్రాంగణంలో తరగతులు మొదలవుతున్నా.. రెండు, మూడేళ్లలో శాశ్వత క్యాంపస్ సిద్ధమయ్యే అవకాశముంది.
ఇతర ఐఐటీలకు దీటుగా ఆంధ్రప్రదేశ్‌లోని తొలి ఐఐటీని తీర్చిదిద్దేందుకు కృషిచేస్తాం...’’ అంటున్నారు ఐఐటీ, తిరుపతి క్యాంపస్ ఇంచార్జ్ ప్రొఫెసర్ కె.ఎన్.సత్యనారాయణ. తిరుపతి ఐఐటీకి మెంటార్ ఇన్‌స్టిట్యూట్ అయిన ఐఐటీ-చెన్నైలో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ.. తాజాగా ఏపీ తొలి ఐఐటీకి ఇన్‌చార్జిగా నియమితులైన సత్యనారాయణ గెస్ట్‌కాలం...

జాతీయ స్థాయి ప్రాధాన్య సంస్థలుగా పేరొందిన ఐఐటీలకు సంబంధించి కొత్త క్యాంపస్‌ను నిర్వహించడం నిజంగా సవాలే! తాత్కాలిక ప్రాంగణంలో తరగతుల నిర్వహణలో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. గత పది నెలలుగా దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది. కాబట్టి ఎలాంటి సమస్య ఎదురైనా సులభంగా అధిగమిస్తాం. విద్యార్థులకు బోధన, వసతి పరంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. అందువల్ల తొలి బ్యాచ్ నిర్వహణలో ఎలాంటి అడ్డంకులు ఎదురుకావని భావిస్తున్నాం.

నిపుణులైన ఫ్యాకల్టీ:
ఐఐటీల్లో అన్ని బ్రాంచ్‌లకు తొలి ఏడాది ఒకే విధమైన కరిక్యులం అమలవుతుంది. తిరుపతి ఐఐటీలో మొదటి సంవత్సరం బోధన కోసం నిపుణులైన 10 మంది ప్రొఫెసర్లను నియమించాం. వీరందరూ పీహెచ్‌డీ పూర్తిచేసి, ఆయా డిపార్ట్‌మెంట్లకు హెచ్‌వోడీలుగా పనిచేస్తున్న ప్రొఫెసర్లే. కాబట్టి కొత్త క్యాంపస్, తొలి బ్యాచ్ అయినప్పటికీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలమన్న గట్టి నమ్మకం ఉంది. ఈ ఏడాది సీఎస్‌ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్ నాలుగు బ్రాంచ్‌ల్లో 30 మంది చొప్పున మొత్తం 120 మంది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్య అందేలా ఏర్పాట్లు చేశాం.

అనుసంధానత ఉంటే కష్టం కాదు:
2008లో ఏర్పాటైన కొన్ని ఐఐటీల్లో ఫ్యాకల్టీ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. దీనికి కారణం.. ఆయా క్యాంపస్‌లను నెలకొల్పిన భౌగోళిక స్వరూపం. కనెక్టివిటీ లేని ప్రదేశాలకు రావడానికి పీహెచ్‌డీ స్థాయి ప్రొఫెసర్లు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ ఏడాది తరగతులు ప్రారంభం కానున్న తిరుపతి, పాలక్కాడ్ క్యాంపస్‌లు ఇతర ప్రాంతాలతో అనుసంధానమై ఉన్నాయి.

మౌలిక సదుపాయాలు:
ఐఐటీ అయినా, సాధారణ ఇన్‌స్టిట్యూట్ అయినా.. అకడమిక్ నైపుణ్యాల పరంగా ముఖ్యమైన మౌలిక సదుపాయాలు లేబొరేటరీలు, రీసెర్‌‌చ వింగ్‌లు. ఇన్‌స్టిట్యూట్‌లో వ్యక్తిగత రీసెర్చ్ వింగ్స్ ఉంటే నిపుణులైన ఫ్యాకల్టీ లభిస్తుంది. విద్యార్థుల కోణంలో ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు లేబొరేటరీలదే కీలక పాత్ర. ముఖ్యంగా మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి బ్రాంచ్‌లలో ఈ అవసరం ఎక్కువ. ఇందుకోసం ప్రారంభ దశలో తిరుపతి, సమీప ప్రాంతాల్లోని కొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నాం.

ఆసక్తే ప్రధానం:
ఈ ఏడాది ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఉమ్మడి కౌన్సెలింగ్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆన్‌లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ విషయంలో తమ ఆసక్తికి అనుగుణంగా ప్రాధామ్యాలు ఇవ్వడం మేలు. ఇప్పటికే ఎంపికచేసుకున్నా వాటిని మార్చుకునేందుకు గడువు ఉంటుంది కాబట్టి ఆప్షన్లను మరోసారి పరిశీలించి, అవసరమనుకుంటే మార్చుకోవచ్చు. బ్రాంచ్‌లను ఎంపిక చేసుకునే ముందు ఆయా బ్రాంచ్‌ల ద్వారా లభించే భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించకుండా.. సదరు బ్రాంచ్‌లో అకడమిక్‌గా రాణించడానికి అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలు ఏమిటో పరిశీలించాలి. స్వీయ విశ్లేషణ చేసుకుని తుది నిర్ణయం తీసుకోవాలి.

ఒత్తిడికి కౌన్సెలింగ్:
తల్లిదండ్రులు, ఇతరుల ప్రోద్బలంతో ఐఐటీ కోసం శ్రమించి ర్యాంకులు పొంది, ప్రవేశించిన విద్యార్థులు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు. విద్యార్థుల్లో ఒత్తిడి, బిడియం వంటి సమస్యల పరిష్కారానికి ఐఐటీ-చెన్నై క్యాంపస్‌లో సైకలాజికల్ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. ఇలాంటి సెంటర్‌ను ఐఐటీ-తిరుపతిలోనూ అందుబాటులోకి తేనున్నాం. ఈ సెంటర్లలో మానసిక నిపుణులు విద్యార్థుల మానసిక స్థితిని గుర్తించి వారికి ఎదురవుతున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు చూపిస్తారు.

సందేహాలను నివృత్తి చేసుకోవాలి:
సంస్థలో మెంటారింగ్ ప్రొఫెసర్లు ఉంటారు. వారి సహాయంతో సందేహాలను నివృత్తి చేసుకోవాలి. కేవలం తరగతి గది అభ్యసనతో నైపుణ్యాలు లభిస్తాయని భావించకుండా, స్వీయ అభ్యసనకు ప్రాధాన్యమిస్తే ఏ బ్రాంచ్ అయినా, ఎలాంటి క్యాంపస్ అయినా ఐఐటీలో చేరిన లక్ష్యం నెరవేరుతుంది. ఆల్ ద బెస్ట్!!
Published date : 04 Jul 2015 10:51AM

Photo Stories