Skip to main content

TSPSC: గ్రూప్‌2 పేపర్‌ 2లో వచ్చే హిస్టరీ, పాలిటీ అండ్‌ గవర్నెన్స్‌లో ఈ అంశాలు కవరయ్యేలా చూసుకోండి..!

ఇప్ప‌టికే టీఎస్‌పీఎస్సీ నిర్వ‌హించిన గ్రూప్‌1 ప్రిల‌మ్స్ ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. వెంట‌నే మెయిన్స్ నిర్వ‌హించేందుకు అధికారులు స‌న్నాహాలు చేస్తున్నారు. గ్రూప్‌2 ప‌రీక్ష కూడా వెంట‌నే నిర్వ‌హించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కాబ‌ట్టి అభ్య‌ర్థులు ఏ ఒక్క నిమిషాన్ని వ‌`థా చేసుకోకుండా చ‌దువుకోవ‌డం మంచిది.
TSPSC

పేప‌ర్ 2: హిస్టరీకి సంబంధించి ప్రాచీన, ఆధునిక భారత దేశ చరిత్ర, అలాగే తెలంగాణ చరిత్ర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. భారత చరిత్రకు సంబంధించి సింధు నాగరికత, వేదకాలం–నాగరికత, జైన, బౌద్ధ తదితర మత ఉద్యమాల ప్రారంభం; మగధ సామ్రాజ్యం; ఇస్లాం మతం–ప్రభావం, భక్తి ఉద్యమాలు–స్వభావం, లలిత కళలు, విజయనగర సామ్రాజ్యం, మెుగల్‌ సామ్రాజ్యం, శివాజీ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి బ్రిటిష్‌ పాలనకు దారితీసిన ప్లాసీ యుద్ధంతో మొదలు పెట్టి.. బ్రిటిష్‌ కాలంలోని ముఖ్య ఘట్టాలు, వారు విధించిన నిబంధనలు, బ్రిటిషర్లకు–ఇతర రాజ వంశాలకు మధ్య జరిగిన యుద్ధాలపై దృష్టి పెట్టాలి. 

తెలంగాణ చరిత్రకు సంబంధించి ప్రాచీన చరిత్ర విభాగంలో శాతవాహనులు, ఆనాటి సాంఘిక, మత పరిస్థితులు; సంస్కృతి, సాహిత్యం; ఆంధ్రప్రదేశ్‌లో బౌద్ధ మతం, ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్యులు–నాటి సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకోవాలి. మధ్యయుగ తెలంగాణకు సంబంధించి కాకతీయ రాజులు, వెలమ రాజులు, తెలుగు భాషకు కుతుబ్‌షాహీల సేవలపై దృష్టి పెట్టాలి. 

ప్రాచీన, మధ్యయుగ చరిత్రలు చదివేటప్పుడు ఆయా రాజులు–రాజ వంశాలతోపాటు వారి హయాంలో చేపట్టిన ప్రఖ్యాత కట్టడాలు, వారి కాలంలో ఆదరణ పొందిన కళలు, కవులు, కళాకారులు వంటివి కూడా తెలుసుకోవాలి. 

ఆధునిక తెలంగాణ చరిత్రకు సంబంధించి అసఫ్‌ జాహీలు, సాయుధ పోరాటం, కమ్యూనిస్టులు, జమీందారి వ్యతిరేక ఉద్యమాలు; రజాకార్లు–తెలంగాణ ఉద్యమం వంటివి కీలకమైనవి. వీటితోపాటు 1857 నాటి సిపాయిల తిరుగుబాటులో  తెలంగాణ ప్రాంత ప్రజల భాగస్వామ్యం–నిజాం వ్యతిరేక విధానాలపై పోరాటాల గురించి తెలుసుకోవాలి. 

పాలిటీ అండ్‌ గవర్నెన్స్‌: పేపర్‌–2లోనే మరో విభాగంగా ఉండే పాలిటీ అండ్‌ గవర్నెన్స్‌ విషయంలో భారత రాజ్యాంగంలోని ముఖ్య లక్షణాలు; ప్రవేశిక; ప్రాథమిక విధులు; ప్రాథమిక హక్కులు; ఆదేశిక సూత్రాలు; భారత సమాఖ్య; విశిష్ట లక్షణాలు; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన; శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ పాత్రలపై నిర్దేశిత సిలబస్‌ ప్రకారం లోతుగా అధ్యయనం చేయాలి.

పంచాయితీరాజ్‌ వ్యవస్థ; 73,74 రాజ్యాంగ సవరణలు; వాటి ప్రాముఖ్యత; తేదీలు వంటి అంశాలపై దృష్టి సారించాలి. ఇందుకోసం డిగ్రీ మూడో సంవత్సరం పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పుస్తకాలు చదవాలి. కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక విధుల విభజన, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, వాటి గురించి రాజ్యాంగంలో పేర్కొన్న అధికరణలను అధ్యయనం చేయాలి. వీటితోపాటు తాజా రాజ్యంగ సవరణలు, వాటి ఉద్దేశంపైనా అవగాహన పెంచుకోవాలి.

Published date : 14 Jan 2023 01:14PM

Photo Stories