Telangana Economy For Groups Exams: తెలంగాణ ఆర్థిక వ్యవస్థ.. వ్యవసాయ రంగం వాటా..
- అగ్రికల్చర్ అనే ఆంగ్లపదం అగ్రి, కల్చర్ అనే లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది. అగ్రి అనగా మట్టి, కల్చర్ అనగా సాగు చేయడం అని అర్థం. వ్యవసాయం అంటే.. మట్టిని సాగుచేయడం అనే భావం వస్తుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ముఖ్యపాత్ర పోషిస్తుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో.. పారిశ్రామిక, సేవా రంగాల ప్రాముఖ్యత పెరిగినప్పటికీ.. వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
- తెలంగాణ వ్యవసాయ, అనుబంధ రంగాలలో 4 ఉప విభాగాలు ఉన్నాయి. అవి..1. వ్యవసాయం, 2. పశుసంపద, 3. అటవీ సంపద, 4. మత్స్య సంపద.
చదవండి: Group 1 Preliminary Exam: 60 డేస్ ప్రిలిమ్స్ ప్లాన్.. సిలబస్, సబ్జెక్ట్ అంశాలు..
వ్యవసాయ రంగం వాటా
తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం 2022 ప్రకారం–ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ రాష్ట్రస్థూల రాష్ట్ర జోడింపు విలువ(జీఎస్‌వీఏ)లో వ్యవసాయం అనుబంధ రంగాల వాటా కింది విధంగా ఉంది:
సంవత్సరం | వాటా శాతము |
2014–15 | 16.3 |
2015–16 | 14.3 |
2016–17 | 14.8 |
2017–18(టీఆర్‌ఈ) | 14.9 |
2018–19(ఎస్‌ఆర్‌ఈ) | 14.7 |
2019–20(ఎఫ్‌ఆర్‌ఈ) | 17.9 |
2020–21(పీఈ) | 19.6 |
2021–22(ఏఈ) | 18.3 |
గమనిక:
- టీఆర్‌ఈ అంటే.. థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్
- ఎస్‌ఆర్‌ఈ అంటే.. సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్
- ఎఫ్‌ఆర్‌ఈ అంటే.. ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్
- పీఈ అంటే.. ప్రొవిజనల్ ఎస్టిమేట్
- ఏఈ అంటే.. అడ్వాన్స్‌డ్ ఎస్టిమేట్
- తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణ జీఎస్‌డీపీలో 1993–94 ఆర్థిక సంవత్సరంలో.. వ్యవసాయం,అనుబంధ రంగాల వాటా 19.8 శాతం నుంచి 2013–14 ఆర్థిక సంవత్సరం నాటికి 15.08శాతానికి తగ్గింది.దీనికి ప్రధాన కారణం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వ్యవసాయ రంగంపై నీళ్ల పంపకంలో వివక్ష జరగడమే.
- తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర జీఎస్‌డీపీలో.. వ్యవసాయం,అనుబంధ రంగాల వాటా.. 2014–15 ఆర్థిక సంవత్సరంలో 16.3 శాతం నుంచి 2021–22 ఆర్థిక సంవత్సరంలో 18.3 శాతానికి పెరిగింది. దీనికి ప్రధాన కారణం.. రాష్ట్రంలో దిగుబడి పెరగడం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా 2018–19 వానాకాలం నుంచి రైతుబంధు పథకంను ప్రవేశపెట్టింది. పథకంలో భాగంగా రైతులకు ఒక ఎకరానికి సంవత్సరమునకు రూ.10 వేలు (రెండు విడతలుగా ఖరీఫ్, రబీ కలిపి) వారి ఖాతాల్లో జమ చేస్తోంది. అలాగే రైతులకు రైతుబీమా పథకం, నాణ్యమైన 24/7 ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
- ప్రస్తుతం 2021–22లో వ్యవసాయ, అనుబంధ రంగాల జీఎస్‌వీఏలో అత్యధిక వాటా పశు సంపద 49.7 శాతంతో మొదటి స్థానంలో.. పంటలు అనే ఉప రంగం 44.7 శాతంతో రెండవ స్థానంలో, అటవీ సంపద 2.4 శాతంతో చివరి స్థానంలో ఉంది.
- 2014–15లో ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, అనుబంధ రంగాల జీఎస్‌వీఏలో పంటల వాటా 54.8 శాతంగా ఉండగా.. పశుసంపద వాటా 38.5 శాతంగా ఉంది. 2018–19 నుంచి పంటల వాటా తగ్గుతూ పశుసంపద వాటా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ, అనుబంధ రంగాలలో పశుసంపద వాటా అధికంగా ఉంది. దీనికి ప్రధాన కారణం.. ఈ రంగాలపై జీవించే వారి కోసం రైతు పంటలను పండించడమే కాకుండా.. అదనపు ఆదాయంను గడించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాడి పశువుల పంపిణీ కార్యక్రమం, చేప పిల్లల పంపిణీ వంటి వివిధ కార్యక్రములను ప్రవేశపెట్టింది. దేశంలోనే గొర్రెల సంఖ్యలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.
- ఈ విధంగా ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ జీఎస్‌వీఏలో 2014–15లో వ్యవసాయ, అనుబంధ రంగం వాటా 16.3 శాతం నుంచి 2021–22లో 18.3 శాతానికి పెరిగింది.
చదవండి: Economy Preparation Strategy: పోటీ పరీక్షల్లో–భారత ఆర్థిక వ్యవస్థ
ఉప రంగాల వాటా
- తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం 2022 ప్రకారం–రాష్ట్ర వ్యవసాయ, అనుబంధ రంగాల స్థూల రాష్ట్ర జోడింపు విలువ(జీవీఎస్‌ఏ)లో ఉప రంగాల వాటా కింది విధంగా ఉంది(శాతములో):
సంవత్సరం పంటలు పశు సంపద అటవీ సంపద మత్స్య సంపద 2014–15 54.8 38.5 3.2 3.5 2015–16 48.6 44.6 3.3 3.5 2020–21 48.6 45.9 2.5 3.0 2021–22 44.7 49.7 2.4 3.2 - 2021–22కు గాను తెలంగాణ స్థూల రాష్ట్ర జోడింపు విలువ(జీఎస్‌వీఏ)లో వ్యవసాయం,అనుబంధ రంగాల వాటా 18.3 శాతం కలిగి ఉంటే.. ఇందులో ఉపరంగాల వారీగా పరిశీలిస్తే.. 2014–15లో వ్యవసాయం, అనుబంధ రంగాలలో అత్యధిక వాటాను పంటలు 54.8 శాతంతో మొదటి స్థానంలో ఉంది. అటవీ సంపద అతి తక్కువగా 3.2 శాతం వాటా కలిగి ఉంది.
- ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై సుమారుగా 55 శాతం మంది జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. ఆహార, ఆదాయ భద్రతను సాధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. అనేక రైతు సంక్షేమ, ఆధారిత పథకాలను అమలు చేస్తోంది. అలాగే రాష్ట్రంలో 2016–17లో వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపులు రూ.6611 కోట్ల నుంచి 2021–22లో గణనీయంగా రూ.26,822 కోట్లకు పెంచారు.
- 2021–22 బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఆదాయ వ్యయంలో... 13.5శాతం వ్యవసాయం,ఇతర అనుబంధ రంగాలకు కేటాయించింది. దేశంలోని సాధారణ రాష్ట్రాల వ్యవసాయానికి సగటు కేటాయింపులు 6.3 శాతంతో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువ. అలాగే ప్రస్తుత 2022–23 బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.24,254 కోట్లను కేటాయించారు. ఇందులో కేటాయింపులు కింది విధంగా ఉన్నాయి.
- రైతుబంధు పథకం – రూ.14,800 కోట్లు
- రైతు బీమా పథకం – రూ.1466 కోట్లు
- రైతు రుణ మాఫీ – రూ.2939 కోట్లు
- ఉద్యాన వన శాఖకు – రూ.995 కోట్లు
- మొత్తంగా తెలంగాణలో 2000–01లో వ్యవసాయరంగంపై ఆ«ధారపడిన వారి జనాభా 69.5 శాతంగా ఉండగా.. 2011 జనాభా లెక్కల ప్రకారం 55.49 శాతం మంది వ్యవసాయ రంగంపై జీవిస్తున్నారు.
–వి.రవికుమార్, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్
ప్రాక్టీస్ ప్రశ్నలు
1) కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2021–22లో జీఎస్‌వీఏలో ప్రస్తుత ధరలలో వ్యవసాయ,అనుబంధ రంగాల వాటా 16.3శాతం.
బి) 2014–15 నుంచి 2021–22 వరకు పరిశీలిస్తే ప్రస్తుత ధరలలో తెలంగాణ జేఎస్వీఏలో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 2020–21లో అధికం.
1) రెండు సరైనవి
2) ఏ మాత్రమే
3) బీ మాత్రమే
4) రెండూ సరైనవి కావు
- View Answer
- సమాధానం: 3
2) కింది వాటిని జతపరచండి?
ప్రస్తుత ధరలలో తెలంగాణ జీఎస్‌వీఏలో సంవత్సరాల వారీగా వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా సంవత్సరం వాటా శాతం
1) 2014–15 ఎ) 18.3
2) 2015–16 బి) 19.6
3) 2020–21 సి) 14.3
4) 2021–22 డి) 16.3
1) 1–ఏ, 2–బి,3–సి, 4–డి
2) 1–బి 2–సి,3–ఎ,4–డి
3) 1–బి, 2–సి,3–డి, 4–ఎ
4) 1–డి, 2–సి, 3–బి, 4–ఎ
- View Answer
- సమాధానం: 4
3) తెలంగాణ వార్షిక బడ్జెట్ 2022–23లో రైతుబంధుపై కేటాయింపు ఎంత?
1) రూ.12800 కోట్లు
2) రూ.13800 కోట్లు
3) రూ.14800 కోట్లు
4) రూ.14000 కోట్లు
- View Answer
- సమాధానం: 3
4) కింది వాటిలో సరికానిది గుర్తించండి?
1) 2001 జనాభా లెక్కల ప్రకారం–తెలంగాణలో వ్యవసాయంపై ఆధారపడిన జనాభా 69.5 శాతం.
2) 2011 తెలంగాణలో వ్యవసాయంపై ఆధారపడిన జనాభా 55.49 శాతం.
1) 1 మరియు 2
2) 1
3) 2
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 4
5) తెలంగాణలో రైతుబంధు కింద ఒక ఏడాదికి రైతుకు ఎంత మొత్తం అందజేస్తున్నారు.
1) రూ.5,000
2) రూ.6,000
3) రూ.8,000
4) రూ.10,000
- View Answer
- సమాధానం: 4
6) దేశంలో తెలంగాణ గొర్రెల ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో ఉంది?
1) 1వ స్థానం
2) 2వ స్థానం
3) 3వ స్థానం
4) 4వ స్థానం
- View Answer
- సమాధానం: 1
7) 2021–22 బడ్జెట్‌లో మొత్తం ఆదాయ వ్యయంలో ఎంత శాతం వ్యవసాయ, అనుబంధ రంగాల కార్యకలాపాలపై కేటాయించింది?
1) 12.5 శాతం
2) 13.5 శాతం
3) 15 శాతం
4) 10.5 శాతం
- View Answer
- సమాధానం: 2
8) 2021–22లో ప్రస్తుత ధరలలో తెలంగాణ వ్యవసాయం జీఎస్‌వీఏలో అత్యధిక వృద్ధిరేటు కల్గిన ఉప రంగం?
1) పంటలు
2) పశుసంపద
3) అటవీ సంపద
4) మత్స్యసంపద
- View Answer
- సమాధానం: 2
9) 2021–22లో వ్యవసాయ జీఎస్‌వీఏ ప్రస్తుత ధరలలో పంటల వృద్ధి శాతం ఎంత?
1) 44.7
2) 49.7
3) 2.4
4) 3.2
- View Answer
- సమాధానం: 1
10) తెలంగాణ సామాజిక,ఆర్థిక ముఖచిత్రం 2022 ప్రకారం–2021–22లో తెలంగాణ వ్యవసాయ, అనుబంధ రంగాల స్థూల రాష్ట్ర జోడింపు విలువ (జీఎస్‌వీఏ)లో ఉప రంగాల వాటాను జతపర్చండి?
1) పంటలు ఎ) 49.7
2) పశుసంపద బి) 2.4
3) అటవీ సంపద సి) 44.7
4) మత్య్ససంపద డి) 3.2
1) 1–ఏ, 2–బి, 3–సి, 4–డి
2) 1–డి, 2–బి, 3–ఎ, 4–సి
3) 1–సి, 2–ఎ, 3–బి, 4–డి
4) 1–ఎ, 2–డి, 3–సి, 4–బి
- View Answer
- సమాధానం: 3
11) 2021–22 నాటికి తెలంగాణ జీఎస్‌డీపీలో వ్యవసాయ రంగం వాటా ఎంత శాతం?
1) 16.3
2) 24.3
3) 18.3
4) 20.3
- View Answer
- సమాధానం: 3
12) 2014–15లో ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ వ్యవసాయ,అనుబంధ రంగాల జీఎస్‌వీఏలో పంటల వాటా శాతం?
1) 38.5
2) 54.8
3) 44.8
4) 50
- View Answer
- సమాధానం: 2
13) 2022–23లో వ్యవసాయ,అనుబంధ రంగానికి బడ్జెట్‌లో కేటాయింపులు?
1) రూ.36822 కోట్లు
2) రూ.26822 కోట్లు
3) రూ.12820 కోట్లు
4) రూ.24254 కోట్లు
- View Answer
- సమాధానం: 4
14) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ జీఎస్‌డీపీలో 1993–94 ఆర్థిక సంవత్సరానికి సుమారుగా ఎంత శాతం వాటాను వ్యవసాయ,అనుబంధ రంగాలు కలిగి ఉన్నాయి?
1) 20
2) 25
3) 22
4) 21
- View Answer
- సమాధానం: 1
15) 2021–22లో తెలంగాణ రాష్ట్ర జీఎస్‌వీఏలో అత్యల్ప వాటా కలిగిన ఉప రంగం?
1) పంటలు
2) పశుసంపద
3) అటవీ సంపద
4) మత్స్య సంపద
- View Answer
- సమాధానం: 3
చదవండి: Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!