Skip to main content

TS Economy for competitive exams: తెలంగాణ.. 2021–22లో వ్యవసాయం–అనుబంధ రంగాల వృద్ధి

Telangana Growth of agriculture-allied sectors in 2021-22
Telangana Growth of agriculture-allied sectors in 2021-22

తెలంగాణలో వ్యవసాయం, అనుబంధ రంగాలలో పంటలు, పశు సంపద, మత్స్య సంపద, అటవీ సంపద వృద్ధి రేట్లను గమనిస్తే.. 2021–22 ముందస్తు అంచనాలో ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి(జీఎస్‌డీపీ)లో వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధి రేటు 9.1 శాతంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి పరిశీలిస్తే.. 2015–16లో రాష్ట్ర జీఎస్‌డీపీలో ప్రస్తుత ధరల వద్ద వ్యవసాయ,అనుబంధ రంగాల వాటా(–0.5%) రుణాత్మక వృద్ధిరేటు నమోదు చేసింది.

2021–22లో వ్యవసాయం–అనుబంధ రంగాల వృద్ధి

  • 2015–16 నుండి 2021–22 వరకు..తెలంగాణ రాష్ట్ర జీఎస్‌డీపీలో వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధిరేట్లు(శాతంలో)
    2015–16  –0.5
    2016–17 17.5
    2017–18 13.9
    2018–19 12.7
    2019–20 35.6
    2020–21 12.2
    2021–22 9.1
  • 2015–16 నుండి 2021–22వరకు తెలంగాణ రాష్ట్ర జీఎస్‌డీపీలో అత్యధిక వ్యవసాయ, అనుబంధ రంగ వృద్ధిరేటు నమోదైన సంవత్సరం 2019–20లో 35.6%గా ఉంది. అంటే.. ఇదే ఏడాదిలో పంటలలో అత్యధిక వృద్ధి 59.9 శాతంతో ముందజలో ఉంది.

Telangana Economy For Groups Exams: తెలంగాణ ఆర్థిక వ్యవస్థ.. వ్యవసాయ రంగం వాటా..

పంటల వృద్ధి

రాష్ట్రంలో 2019–20లో పంటలలో అత్యధిక వృద్ధి నమోదుకు ప్రధాన కారణాలు గమనిస్తే... రైతులకు పెట్టుబడి సహాయం అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని 2018–19 వానాకాలం పంట నుండి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఒక రైతు కుటుంబానికి ఒక ఎకరం కలిగి ఉన్న వారికి సంవత్సరానికి రూ.10,000ను రెండు విడతలలో చెల్లిస్తుంది. అంతేకాకుండా వ్యవసాయానికి 24 గంటల ఉచిత నిరంతర విద్యుత్‌ సరఫరా పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా 2018 జనవరి 1 నుంచి ప్రారంభించి.. రాష్ట్రంలోని మొత్తం 23 లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తుంది. ఇలా పరిశీలిస్తే.. ఇటీవల కాలంలో నీతి ఆయోగ్‌ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక 2020–21లో భారత్‌లో సుస్థిరాభివృద్ధి లక్ష్యం(ఎస్‌డీజీ)–7లో ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ను అందించిన రాష్ట్రాలలో 100కు 100 మార్కులతో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందని నీతి ఆయోగ్‌ పేర్కొంది. అలాగే రాష్ట్రంలో ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే.. ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో రైతు భీమా పథకాన్ని 2018 ఆగస్ట్‌ 15న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రారంభించారు. ఆకస్మికంగా మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని 10 రోజులలో అందిస్తారు. ఇలాంటి పథకాల వల్ల 2019–20లో వ్యవసాయ–అనుబంధ రంగాల వృద్ధిలో అత్యధికంగా 59.9 శాతంతో పంటల వృద్ధి నమోదు చేసింది. 2015–16లో పంటల వృద్ధి రుణాత్మక వృద్ధి(–11.8శాతం)నమోదైతే.. తెలంగాణ సామాజిక–ఆర్థిక ముఖచిత్రం 2022 ప్రకారం పరిశీలిస్తే.. 2021–22లో వ్యవసాయం–అనుబంధ రంగాలలో పంటల వృద్ధి 0.2 శాతంతో అతి తక్కువ వృద్ధిని నమోదు చేసింది.

పశు సంపద వృద్ధి

  • తెలంగాణలో 2021–22(అడ్వాన్స్‌డ్‌ ఎస్టిమేట్స్‌) ప్రకారం– వ్యవసాయ,అనుబంధ రంగాల GSVAలో అత్యధికంగా 49.7 శాతం వాటాతో.. పశు సంపద ముందంజలో ఉంది. 2021–22లో వ్యవసాయ, అనుబంధ రంగాలలో 18.2 శాతంతో అత్యధిక వృద్ధితో మొదటి స్థానంలో ఉంది. దీనిని బట్టి పరిశీలిస్తే.. పశుగణన–2019 ప్రకారం– పశువుల సంఖ్యలో దేశంలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది.
  • 2019 పశుగణన ప్రకారం దేశంలో తెలంగాణ రాష్ట్రం
పశుపోషణ రంగం తెలంగాణ రాష్ట్రం దేశంలో స్థానం
పశువుల సంఖ్య 8
గొర్రెల సంఖ్య 1
కోళ్ల సంఖ్య 3
కోడి గుడ్లు 3
మాంసం 5
పాలు 13
  • తెలంగాణ ప్రభుత్వం 2017 జూన్‌ 20న, కొండపాక, సిద్దిపేట జిల్లాలో ప్రారంభించిన గొర్రెల పంపిణీ కార్యక్రమం కారణంగా.. ప్రస్తుతం గొర్రెల సంఖ్యలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.

తెలంగాణ - వ్యవసాయ రంగ స్థితిగతులు

అటవీ సంపద వృద్ధి

  • తెలంగాణ రాష్ట్ర్రంలో 2021–22 GSVAలో ప్రస్తుత ధరల వద్ద వ్యవసాయ–అనుబంధ రంగాలలో అటవీ సంపద వృద్ధి 5.3 శాతం నమోదు చేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి గమనిస్తే.. 2019–20లో మాత్రం(–5.1శాతం) రుణాత్మక వృద్ధిరేటు నమోదు చేసింది.
  • రాష్ట్రం మొత్తం అటవీ విస్తీర్ణం 26,969 చదరపు కిలో మీటర్లు. ఇది రాష్ట్ర మొత్తం విస్తీర్ణంలో 24%. కానీ ఇది జాతీయ సగటు అటవీ విస్తీర్ణం 21.3% కంటే ఎక్కువ అని గుర్తించాలి. దీనికి ప్రధాన కారణం.. హరితహారం. ఇప్పటి వరకు తెలంగాణలో 7 విడతలలో హరితహారం కొనసాగింది.

మత్స్య సంపద వృద్ధి

  • రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2015–16,2016–17 సంవత్సరాలలో వ్యవసాయం, అనుబంధ రంగాల GSVAలో మత్స్య సంపద రుణాత్మక వృద్ధిరేటును నమోదు చేసింది. కాని 2017–18లో 60.6 శాతంతో అత్యధిక వృద్ధిరేటును నమోదైంది. 2021–22 (అడ్వాన్స్‌డ్‌ ఎస్టిమేట్స్‌)లో 16.6 శాతంతో మత్స్య సంపద వృద్ధిరేటు రెండవ స్థానంలో ఉంది. 
  • దీనికి ప్రధాన కారణం.. 2018 సెప్టెంబర్‌ 5న సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని చేపల పెంపకానికి అనుకూలమైన అన్ని నీటి వనరులలో 100 శాతం గ్రాంట్‌తో చేప పిల్లల పంపిణీ, కేజ్‌ కల్చర్, ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించడమని చెప్పొచ్చు.

ఉపరంగాల వృద్ధి

  • 2021–22లో ప్రస్తుత ధరలలో రాష్ట్ర GSVAలో వ్యవసాయ–అనుబంధ ఉపరంగాల వృద్ధిరేట్లు(శాతంలో)
పంటలు 0.2
పశు సంపద 18.2
అటవీ సంపద 5.3
మత్స్య సంపద 16.6
వ్యవసాయం+అనుబంధ రంగాలు 9.1


– రవికుమార్‌ వల్లభాయ్, సబ్జెక్ట్‌ నిపుణులు

ప్రాక్టీస్‌ క్వశ్చన్స్‌

Published date : 07 Jul 2022 07:34PM

Photo Stories