Skip to main content

సంతులిత వ్యవసాయాభివృద్ధి వ్యూహాలు

2014-15లో తెలంగాణ రాష్ర్టంలో ఎరువుల వినియోగం సుమారు 19.40 లక్షల మెట్రిక్ టన్నులు. పోషకాలతో కూడిన ఎరువులను 2010-11లో అత్యధికంగా 14.81 లక్షల మెట్రిక్ టన్నుల మేర వాడారు. కానీ వీటి వినియోగం 2013-14లో 13.39 లక్షల మెట్రిక్ టన్నులకు, 2014-15లో 12.48 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. ఎరువుల వినియోగం కరీంనగర్‌లో అత్యధికం కాగా, మెదక్‌లో అత్యల్పం.
వ్యవసాయ అభివృద్ధి కోసం, ఈ రంగంలో పరిస్థితుల్ని మెరుగుపర్చడానికి రాష్ర్ట ప్రభుత్వం 2014-15లో ముఖ్య పథకాలను అమలు చేసింది. అవి...

విత్తన భాండాగారం
నాణ్యమైన విత్తనాలు వాడినప్పుడే మంచి దిగుబడి వస్తుంది. తద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుంది. రాష్ట్రాన్ని ‘విత్తన భాండాగారం’గా తీర్చిదిద్దాలని రాష్ర్ట ప్రభుత్వం సంకల్పించింది. వరి, మొక్కజొన్న, సోయాబీన్, ఆముదం, పత్తి మొదలైన పంటలకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయడానికి తగిన నేలలు, అనుకూల వాతావరణం రాష్ర్టంలో ఉన్నాయి. వీటి దృష్ట్యా ప్రొఫెసర్ జయశంకర్ రాష్ర్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం సాంకేతిక నైపుణ్యం సహకారంతో బ్రీడర్, సర్టిఫైడ్ విత్తనాలను ఉత్పత్తి చేయనున్నారు. ఇందు కోసం ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికను సిద్ధం చేసింది. సీడ్ విలేజ్ ప్రోగ్రాం, సీడ్ ప్రొడక్షన్ ఇన్ స్టేట్ సీడ్ ఫార్‌‌మ్స ద్వారా రాష్ట్రానికి చెందిన స్టేట్ సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆయిల్‌ఫెడ్, మార్‌‌కఫెడ్, హాకా లాంటి ప్రభుత్వ సంస్థల ద్వారా విత్తనోత్పత్తి కార్యక్రమానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
సంకర వరి, మొక్కజొన్న, పత్తి, పెసలు తదితర పంటలకు సంబంధించిన 37.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 3.22 లక్షల హెక్టార్లలో ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని మన రైతులకు, ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఆ విధంగా తెలంగాణ దేశానికి విత్తన రాజధానిగా నిలుస్తోంది. నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేయడం కోసం బడ్జెట్‌లో రూ.50 కోట్లను కేటాయించారు. వీటితో విత్తన సంబంధిత విభాగాలను పటిష్టం చేస్తున్నారు. కొత్త విత్తన రకాలను ప్రవేశపెట్టే ప్రక్రియను మెరుగుపర్చడం, అదనపు గిడ్డంగుల నిర్మాణం, విత్తనశుద్ధి పరికరాల సేకరణ, విత్తన పరీక్షా ప్రయోగశాలల్ని పటిష్టం చేయడం మొదలైనవి ఇందులో భాగం.
రాష్ర్టంలో 536 హెక్టార్ల విస్తీర్ణంలో పది విత్తన క్షేత్రాలున్నాయి. వీటిలో విత్తనాలను ఉత్పత్తి చేసి సీడ్ విలేజ్ స్కీం ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ క్షేత్రాలను పటిష్టం చేసి, బ్రీడర్ విత్తనాలను సరఫరా చేస్తారు. ఈ క్షేత్రాలకు సాగునీరు అందించడంతోపాటు, విత్తన శుద్ధి, నిల్వ సదుపాయాలను కల్పిస్తారు.

పంట అభివృద్ధి క్షేత్రాలు
రాష్ర్టంలో వరి, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, సోయాబీన్, ఆముదం, వేరుశనగ మొదలైన పంటలు పండుతున్నాయి. విస్తీర్ణాన్ని, ఉత్పత్తులను పెంచడానికి, ఉత్పాదకతను ఇనుమడింపజేయడానికి, స్వయం సమృద్ధి సాధనకు పంట క్షేత్రాలను నెలకొల్పాలని ప్రతిపాదించారు.
మంచి దిగుబడినిచ్చే ధ్రువీకృత విత్తనాలు రైతులకు సకాలంలో అందడం లేదు. దేశంలో 20 శాతం రైతులు మాత్రమే ధ్రువీకృత విత్తనాలను వాడుతున్నారు. మిగతా రైతులు పంట నుంచి మిగిల్చిన విత్తనాలనే వినియోగిస్తున్నారు. కానీ రాష్ర్టంలో 70-80 శాతం రైతులు ధ్రువీకృత విత్తనాలనే ఉపయోగిస్తున్నారు.
వర్షాధార ప్రాంతాల్లో విత్తనాలు వేశాక సకాలంలో వర్షాలు కురవకపోవడం వల్ల అవి నిరుపయోగం అవుతున్నాయి. ఈ సమస్య తరచుగా తలెత్తుతోంది. మొదటిసారి వేసిన విత్తనాలు విఫలమైతే.. రెండో విడత పంపిణీ కోసం విత్తనాలను సిద్ధంగా ఉంచాలి. దీర్ఘకాలంపాటు వర్షాలు కురవకపోతే, తిరిగి విత్తనాలను సరఫరా చేయడానికి స్టేట్ సీడ్ సిస్టం సిద్ధంగా ఉండాలి.
తెలంగాణలో విత్తనోత్పత్తికి ఎంతో అవకాశం ఉంది. మహబూబ్‌నగర్‌లో సంకర పత్తి విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో సంకర మొక్కజొన్న విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని చేపట్టారు. సంకర వరి విత్తనాన్ని కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఉత్పత్తి చేస్తున్నారు. అదేవిధంగా.. వరి, ఆముదం, పప్పులు, వేరుశనగ, సోయాబీన్, కూరగాయల విత్తనాలను కరీంనగర్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉత్పత్తి చేస్తున్నారు.
విత్తనాల కోసం పంట క్షేత్రాన్ని విస్తరించడానికి, విత్తనోత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి, విత్తన రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి పంట కాలనీలను నెలకొల్పాలని ప్రతిపాదించారు.

వ్యవసాయ యాంత్రీకరణ

రాష్ర్టంలో కమతాల విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది. పొలం పరిమాణం, రైతు కూలీలకయ్యే ఖర్చు, విద్యుచ్ఛక్తి అందుబాటు, అనువైన యంత్రాల లభ్యత... కలిసి యాంత్రీకరణ సాధ్యాసాధ్యాలను ప్రభావితం చేస్తాయి. వ్యవసాయంలో మానవ వనరులు, పశువులు, ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. మరింత భూమిని వ్యవసాయం కిందకు తేవడానికి, పంట ఉత్పాదకతను మెరుగుపర్చడానికి ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణను ప్రొత్సహిస్తోంది. ఇందు కోసం విత్తడం నుంచి పంట కోసే దాకా యంత్రాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా పవర్ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.
లక్ష్యాలు
  • పొలం పనుల్లోని వివిధ దశల్లో అవసరమవుతున్న మానవవనరుల వినియోగాన్ని తగ్గించడం.
  • ప్రతి గ్రామంలో యంత్రాల గురించి అవగాహన కల్పించడం.
  • ఉత్పాదకతా స్థాయి, నికరాదాయాన్ని పెంచడం.
  • పరిమాణం, నాణ్యతల పరంగా వ్యవసాయ ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులు దెబ్బతినకుండా చూడటం.
  • పంటల అనంతర దశల్లో ఉపయోగపడే యంత్రాలను వాడటం, మెరుగైన ఆహారోత్పత్తుల తయారీ విధానాల ద్వారా ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపర్చడం.
  • ప్రధాన ఉత్పత్తుల వ్యవసాయ ఖర్చులను తగ్గించడం.
యాంత్రీకరణ ఆధారంగా పెంచే ఉత్పాదకత గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తుంది. కాబట్టి వివిధ వ్యవసాయ పనిముట్లను సరఫరా చేయడానికి రూ.100 కోట్లను ప్రతిపాదించారు.

వ్యవసాయ యాంత్రీకరణ - రాష్ట్రీయ కృషి వికాస్ యోజన
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్‌కేవీవై) కోసం రూ. 67.50 కోట్లను ప్రతిపాదించారు. వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, చెరకు, వరి నర్సరీ ప్యాకేజ్, వరికోత ప్యాకేజ్, పంటల అనంతర అంశాలు, సేకరణ కేంద్రాలు, పనిముట్ల కిరాయి కేంద్రాలు దీని పరిధిలోకి వస్తాయి. టార్ఫాలిన్‌లు, సౌర కంచెలు, ప్యాడీ రీపర్లు, పవర్ టిల్లర్లు, విత్తనాలను, ఎరువులను చల్లే యంత్రాలు, మొక్కజొన్న షెల్టర్లు, వివిధ పంటలకు కంకులు కొట్టే యంత్రాలు, రోటోవేటర్లు, పవర్ వీడర్లు, మెరుగుపర్చిన వ్యవసాయ యంత్రాలు, శిక్షణ, ప్రదర్శనల నిర్వహణ, సౌర పంపు సెట్ల ఏర్పాటు ఈ ఖర్చు కిందకు వస్తాయి.
ప్రతిపాదించిన మొత్తంలో ఆర్‌కేవీవై 2013-14 కింద ఖర్చు చేయని రూ.10.42 కోట్లను 2014-15లో సౌర పంపుసెట్లను నెలకొల్పడానికి వినియోగిస్తారు. దీనికి వ్యవసాయ శాఖ నుంచి సబ్సిడీగా లక్ష రూపాయలు.. నూతన, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ నుంచి 30 శాతం సబ్సిడీ ఇస్తారు.

వ్యవసాయ యాంత్రీకరణపై ఉప కార్యక్రమం (ఎస్‌ఎంఏఎం)
మినీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, సెల్ఫ్ ప్రొపెల్డ్ యంత్రాలు, పశువులు లాగే పనిముట్లు, ట్రాక్టర్లు లాగే పనిముట్లు, మొక్కల సంరక్షణ పరికరాల కోసం రూ.23.54 కోట్లు కేటాయించారు. రైతులకు శిక్షణ, ప్రదర్శనలను నిర్వహించడానికి దీనిలో అవకాశం ఉంటుంది. అంశం ఆధారంగా, తీసుకునే రైతు ఏ వర్గానికి చెందినవారనే దాన్ని బట్టి, ఎస్‌ఎంఏఎం మార్గదర్శకాల ఆధారంగా సబ్సిడీ విధానం మారుతుంది.

వ్యవసాయ యాంత్రీకరణ - జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం)
కోనో వీడర్, స్ప్రేయర్, పవర్ వీడర్, డ్రమ్ సీడర్, సీడ్ డ్రిల్, ప్యాడీ త్రెషర్, మల్టీక్రాప్ త్రెషర్, సెల్ఫ్ ప్రొపెల్డ్ ప్యాడీ ట్రాన్స్ ప్లాంటర్, పంపుసెట్లు, మానవశక్తితో నడిపే విన్నోవర్‌ల సరఫరా నిమిత్తం జిల్లాలకు రూ. 9.11 కోట్లను కేటాయించారు. కస్టమ్ హైరింగ్ సెంటర్‌లకు సహాయంగా, రోటావేటర్‌లతో జరిపే పడ్లింగ్, 50 శాతం సబ్సిడీతో రిడ్‌‌జ ఫర్రో ప్లాంటర్లు, తైవాన్ స్ప్రేయర్లను ఉపయోగించే కూలీల చార్జీలు, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం రైస్ కింద కంబైన్ హార్వెస్టర్లకు కూడా ఈ కేటాయింపు నుంచే ఖర్చును భరిస్తున్నారు.

విస్తరణ
సిబ్బంది కొరత వల్ల, సిబ్బంది రవాణా సమస్యల వల్ల విస్తరణ దెబ్బతింటోంది. అయినప్పటికీ రైతు చైతన్య యాత్రల ద్వారా రైతు సదస్సులు, సమావేశాలను నిర్వహిస్తున్నారు. అత్యుత్తమ పనితీరు కనబర్చిన రైతులకు అవార్డులను బహూకరిస్తున్నారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్యం (ఏటీఎంఏ), వ్యూహాత్మక పరిశోధనల విస్తరణ ప్రణాళిక, వ్యూహాత్మక విస్తరణ పని ప్రణాళిక, రైతుల పాఠశాలలు, నిర్ణీత కాల వ్యవధుల్లో భూసార పరీక్ష నివేదికలు, రైతులకు భూసార ఆరోగ్య కార్డుల పంపిణీ చేపడుతున్నారు. సమాచార, కమ్యూనికేషన్ సాంకేతిక పరిజ్ఞాన సాధనాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. అగ్రిస్‌నెట్ లాంటి వెబ్ ఆధారిత నూతన ప్రయత్నాలు, బీఎస్‌ఎన్‌ఎల్ నడిపే వ్యవసాయ విశ్వవిద్యాలయం - కిసాన్ సెల్ కేంద్రాల నుంచి లభించే పరస్పర భేటీ సేవలు అందిస్తున్నారు. రికార్డింగ్ వ్యవస్థతో పనిచేసే మాటామంతీ సదుపాయం, ఎరువులను, క్రిమిసంహారక ప్రయోగాలను పరీక్షించే ఇ-అగ్రిల్యాబ్‌లు, రైతుల కోసం మీ-సేవ అనువర్తనాలు, గ్రామ పంచాయతీ స్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణ మద్దతు సేవలు అందజేస్తున్నారు. యంత్రాల సమర్థ వినియోగం కోసం రైతులకు శిక్షణ ఇస్తున్నారు. పూర్తిగా కేంద్రం సహాయంతో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఈ దిశగా ఒక ప్రధానమైన విస్తరణ ప్రయత్నం.

వ్యవసాయ పరపతి
2014-15లో రాష్ర్ట వార్షిక పరపతి ప్రణాళిక రూ.27,233.59 కోట్లు. ఇందులో సుమారు రూ.17,636.44 కోట్లను వ్యవసాయ రుణాల కింద పంపిణీ చేశారు. పంట రుణాల కేటాయింపు లక్ష్యం రూ.18,717.95 కోట్లు కాగా, రూ.13,561 కోట్లు పంపిణీ చేశారు. వ్యవసాయ టర్మ్ లోన్ల లక్ష్యం రూ.6,238.48 కోట్లు కాగా, రూ.2,794.15 కోట్లు పంపిణీ చేశారు. అనుబంధ కార్యకలాపాల కింద పంపిణీ లక్ష్యం రూ.2,277.16 కోట్లు కాగా రూ.3,132.29 కోట్లను పంపిణీ చేశారు.

పంట రుణాల మాఫీ పథకం 2014-15
రాష్ర్టంలో 2014-15 ఖరీఫ్, రబీ పంటల సమయంలో మూడు పంటల బీమా పథకాలను అమలు చేశారు. అవి...
ఎ) జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎన్‌ఏఐఎస్)
బి) వాతావరణ ఆధారిత పంట బీమా పథకం (డబ్ల్యుబీసీఐఎస్)
సి) మెరుగుపర్చిన జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎంఎన్‌ఏఐఎస్)

జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎన్‌ఏఐఎస్)
జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని 2000 సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో ప్రవేశపెట్టారు. వ్యవసాయ శాఖ, వ్యవసాయ బీమా కార్పొరేషన్, అర్థ గణాంక శాఖ సంచాలకుడికి ఇందులో ప్రమేయం కల్పించారు. ఈ పథకం కింద ఖరీఫ్‌లో 19 పంటలకు, రబీలో 10 పంటలకు బీమా కల్పించారు. సన్నకారు, చిన్నకారు రైతులకు ప్రీమియంలో 10 శాతం సబ్సిడీ కల్పించారు.
లక్ష్యాలు
  • పంట కోల్పోయిన రైతులకు, వచ్చే సీజన్‌లో రుణ అర్హతను పునరుద్ధరించడం.
  • ప్రగతిశీల వ్యవసాయ పద్ధతులను అవలంభించేలా రైతులను ప్రోత్సహించడం, వ్యవసాయంలో ఉన్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేలా చూడటం.
  • రాబడులు నిలకడగా ఉండేలా చూడటం, ప్రత్యేకించి విపత్తులు వాటిల్లిన సంవత్సరాల్లో నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం.
వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (డబ్ల్యూబీసీఐఎస్)
జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎన్‌ఏఐఎస్) అమలవుతున్నప్పటికీ... రాష్ర్ట రైతుల కోసం ప్రభుత్వం 2009 ఖరీఫ్ సీజన్ నుంచి వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని ప్రారంభించింది. వర్షపాతం, ఉష్ణోగ్రత, సాపేక్ష తేమ తదితర ప్రతికూల పరిణామాల వల్ల పంట దెబ్బతిన్న రైతుల నష్టాలను తగ్గించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఆటోమేటిక్ వాతావరణ పరిశీలన కేంద్రాలు (ఏడబ్ల్యూఎస్)

వాతావరణ పరామితులను కొలవడానికి రాష్ర్టంలో మండలానికి ఒకటి చొప్పున అన్ని మండలాల్లో ఏడబ్ల్యూఎస్‌లను నెలకొల్పారు. ఇవి రాష్ర్టంలో దాదాపు 900 ఉన్నాయి.

జాతీయ పంటల బీమా కార్యక్రమం (ఎన్‌సీఐపీ)

ఎంఎన్‌ఏఐఎస్, డబ్ల్యూబీసీఐఎస్‌లను విలీనం చేసి, రైతుల ప్రయోజనం కోసం 2014 ఖరీఫ్ నుంచి జాతీయ పంటల బీమా పథకం (ఎన్‌సీఐపీ) అమలు చేయాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Published date : 28 Sep 2015 05:08PM

Photo Stories