Skip to main content

జానపద కళలు - కళాకారులు

తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల జానపద కళాకారులు ఉన్నారు. వీరు తమ కళలనే కులవృత్తులుగా చేసుకొని వాటి ద్వారా జీవనం సాగిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ సిలబస్‌లో వీటన్నింటినీ ప్రత్యేక అధ్యాయంగా పేర్కొన్నారు. అందువల్ల అభ్యర్థులు తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, కళారూపాలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
కొలనుపాక భాగవతులు
కొలనుపాక భాగవతులనే గంటె భాగవతులుగా పేర్కొంటారు. వీరికి, ఆంధ్ర ప్రాంతంలో ఉండే గంటె భాగవతులకూ వ్యత్యాసం ఉంది. తెలంగాణలో గంటె భాగవతులు ఎక్కువగా కరీంనగర్ జిల్లా కొలనుపాకలో ఉన్నారు. వీరు రాత్రి వేళల్లోనే ప్రదర్శన చేస్తారు. వీరి ప్రదర్శనలకు సాహిత్యపరంగా అంతగా ప్రాముఖ్యం లేదు. వీరు ప్రదర్శనల్లో ప్రధానంగా గరిటెలను ఉపయోగిస్తారు. అందువల్ల వీరిని గరిటె భాగవతులు, గంటె భాగవతులుగా వ్యవహరిస్తారు. ప్రతి పాత్రధారి చేతిలోనూ ఒక గరిటె ఉంటుంది. అందులో చమురు పోసి, వత్తి వేసి వెలిగిస్తారు. ప్రతి పాత్ర హావభావాలూ, ఆంగిక చలనాలు ఈ గరిటె వెలుతురు వల్ల ప్రేక్షకులకు విశదంగా వెల్లడవుతాయి. ప్రదర్శనలో భాగంగా మధ్య మధ్య నటనను సాగిస్తూ, గరిటెలలోని వత్తిని ఎగదోస్తూ ఉంటారు. గరిట ప్రాముఖ్యంతోనే నాటకాలను ప్రదర్శిస్తారు.

శారదకాండ్రు
శారదకాండ్రు అనే జానపద కళాకారులు కేవలం తెలంగాణాలోనే కనిపిస్తారు. వీరు ఎక్కువగా వరంగల్ ప్రాంతంలో ఉన్నారు. బుర్రకథ వాయిద్యకారులు, శారద కథకులకు మధ్య పెద్ద వ్యత్యాసమేమీ కనిపించదు. బుర్రకథకుల మాదిరిగానే వీరు కూడా డక్కీలను ఉపయోగిస్తారు. వీరు ఉపయోగించే తంబురాను ‘శారద’ అంటారు. అందువల్ల వీరికి శారదకాండ్రు అనే పేరు వచ్చింది.

గంగిరెద్దులాట
ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక చక్కని జానపద కళ. సాధారణంగా పూజగొల్ల కులానికి చెందినవారు గంగిరెద్దులను ఆడిస్తారు. వీరు ఎద్దును చక్కగా అలంకరించి, ఊళ్లలో తిరుగుతూ దాన్ని ఆడిస్తారు. వీరు ప్రధానంగా భిక్షాటన ద్వారా జీవనం సాగిస్తారు. ఒక గంగిరెద్దుతో పాటు ముగ్గురు వ్యక్తులు ఉంటారు. వీరిలో ఒకరు గంగిరెద్దును ఆడిస్తే.. మరో వ్యక్తి డోలు వాయిస్తాడు. మూడో వ్యక్తి సన్నాయి వాయిస్తాడు. ఇది గ్రామస్థులకు మంచి వినోదం. సాధారణంగా వీరు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎక్కువగా కనిపిస్తారు.

ఒగ్గుకథ
ఒగ్గుకథ ఒక కళారూపం. కురు కులానికి చెందినవారు దీన్ని ప్రదర్శిస్తారు. ‘ఒగ్గు’ అంటే త్రినేత్రుడైన శివుడిని ప్రార్థించడం. వీరశైవారాధకుల్లో పురోహితులైనవారు శైవ దీక్ష తీసుకుంటారు. ఒగ్గు దీక్ష తీసుకున్నవారు మల్లన్న, వీరన్న కథలను వల్లె వేస్తారు. కోయతెగకు చెందిన ఒక వంశస్థులు సమ్మక్క కథ చెబుతూ పాటలు పాడతారు.

బుడబుక్కల వాళ్లు
వీరు తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతికి చెందినవారు. వీరు ఊరూరా తిరుగుతూ ఉంటారు. సాధారణంగా వీరు క్షుద్రదేవతలను పూజిస్తారు. తెల్లవారుజామున విచిత్ర వేషధారణతో ఢమరుకం వాయిస్తూ గ్రామాల్లో వీధుల వెంట తిరుగుతారు. జ్యోతిషం చెబుతూ, తాయత్తులు కడుతూ యాచిస్తారు.

బుడగ జంగాలు
బుడగ జంగాలు శివభక్తులు. ఒక చేతిలో గంట వాయిస్తూ, శివుడి గురించి యక్షగానం చేస్తూ భిక్షాటన చేస్తారు. వినసొంపైన జానపద పాటలు పాడుతారు. ప్రజలకు విభూతిని పంచుతారు. అందువల్ల వీరిని ‘జంగమదేవర’ అని పిలుస్తారు. వీరు వాయించే గంటపై చిన్న ‘నంది’ విగ్రహం ఉంటుంది.

భిక్షుక కుంట్లు
వీరు కూడా తెలంగాణా ప్రాంతానికి చెందిన సంచారజాతివారే. వీరు సత్యహరిచ్చంద్ర, మార్కండేయ, భక్త ప్రహ్లాద కథలను ఎంతో రమ్యంగా చెబుతారు. ప్రదర్శనలో నలుగురు కళాకారులు ఉంటారు. ప్రధాన కథకుడు చేతిలో ‘పన్నుకర్ర’ పట్టుకొని అటూ ఇటూ ఊపుతూ కథ చెబుతాడు. మిగిలినవారు మద్దెల, హార్మోనియం, తాళాలు వాయిస్తూ అతడిని అనుకరిస్తారు.

రంజు కళాకారులు
విశ్వ బ్రాహ్మణులపై ఆధారపడి రంజు, పవన, సమయాలు ఇచ్చే ప్రదర్శనలు ఎంతో రమ్యంగా ఉంటాయి. వీరు ‘రంజు’ అనే వాయిద్యాన్ని వాయిస్తారు. వీర బ్రహ్మేంద్ర స్వామి కథ, విశ్వకర్మ పురాణం చెబుతారు. వీరు శైవ మతాన్ని అనుసరిస్తారు.

డోలి కళాకారులు
కోయ జాతికి చెందిన వీరు అడవుల్లో, పర్వత ప్రాంతాల్లో నివసిస్తారు. డోలి కళాకారులు వారి జాతికి చెందిన ఆదిపురుషుల గురించి కథల రూపంలో చెబుతారు. కోయజాతిలో మూడో తరానికి చెందిన ‘పేరంబోయరాజు’ కథను వల్లె వేస్తారు.

బండారు కళాకారులు
వీరు పెరిక కులంపై ఆధారపడి ఉంటారు. బండారు కళాకారులు పెరిక జాతి గొప్పతనం గురించి పురాణకథలు చెబుతారు. వీరు ఏ రకమైన వాయిద్యాలను ఉపయోగించరు. ప్రధాన కథకుడు కథ చెబుతూ ఉంటే మరో ఇద్దరు వంత పాడతారు.

డాఢీల ప్రదర్శన
వీరు లంబాడీ తండాలకు వెళ్లి అక్కడి పెద్దలను కలిసి ప్రదర్శనలు ఇస్తారు. వీరిని ‘భట్టు’ అనే పేరుతో కూడా పిలుస్తారు. వీరు తమ జాతిలో మూలపురుషుల కథలను పాడుతూ సంచారం చేస్తూ భిక్షాటన చేస్తారు. వీరు ఒక బృందంగా ఏర్పడి పాటలు పాడతారు. ఒక్కో బృందంలో అయిదు నుంచి 15 మంది సభ్యులు ఉంటారు.

అసాదులు
తెలంగాణా ప్రజలకు అనేక గ్రామ దేవతలను పూజించే ఆచారం ఉంది. వీరు ప్రకృతి దేవతలను కూడా పూజిస్తారు. ఎల్లమ్మ, పోచమ్మ, నల్లపోచమ్మ, పెద్దమ్మ పేర్లతో దేవతలను పూజిస్తారు. రాష్ట్రంలో అడుగడుగునా ఇలాంటి దేవాలయాలు కనిపిస్తాయి. ఈ దేవాలయాల్లో అన్ని రకాల శూద్ర కులాలకు చెందినవారు అర్చకులుగా ఉంటారు. వీరినే ‘అసాదులు’ అంటారు. ఈ అసాదులు అమ్మవార్లను ‘తాంత్రిక’ పద్ధతిలో పూజిస్తారు. మాల కులంలో మాలదాసరులు ఉన్నట్లుగానే.. మాదిగ కులంలో అసాదులనే తెగకు చెందినవారు ఉంటారు. అసాదులంటే మాల, మాదిగ కులాల్లో పూజారి వర్గానికి చెందినవారని ‘ఆరుద్ర’ పేర్కొన్నారు. వీరు ప్రధానంగా ఎల్లమ్మ కథను గానం చేస్తూ చిందులు వేస్తారు.

కప్పతల్లి
అత్యంత ప్రాచీనమైన జానపద కళ ఇది. నృత్యం, పాట, తప్పెట, లయతో ఈ జానపద కళ ఎంతో రమ్యంగా ఉంటుంది. తప్పెటను ఎదురు రొమ్ముపై పెట్టుకొని వాయిస్తారు. తెలంగాణలో ఈ కళను ‘కప్పతల్లి’గా వ్యవహరిస్తారు.

కాటి కాపరులు
వీరు దహన కార్యక్రమాల్లో పాలు పంచుకొంటారు. శ్మశానంలో అన్ని ఏర్పాట్లు చేస్తారు. మరణించిన వారి గురించి కీర్తిస్తూ పాటలు పాడటం ద్వారా యాచిస్తారు. చనిపోయిన వ్యక్తి దుస్తులను కూడా వీరు స్వీకరిస్తారు.

మాయాజాల కళాకారులు
వీరిని ‘విప్ర వినోదులు’గా పేర్కొంటారు. వీరు గారడి ద్వారా అనేక మాయలను ప్రదర్శించి, యాచిస్తారు.

మందెచ్చు కళాకారులు
వీరు యాదవ కులానికి చెందినవారు. ఈ జానపద కళాకారులు ‘ఒల్లమాదేవి’ కథను పాడుతూ యాచిస్తారు. వీరిలో ప్రధాన కళాకారుడు ఒక చేతిలో కత్తి, మరో చేతిలో చిరుతలు పట్టుకొని కథకు సంబంధించిన పాటలు పాడతాడు. మరో ఇద్దరు.. ఒకరు కత్తి, మరొకరు కర్ర పట్టుకొని ఇతడికి వంత పాడతారు.

తోటి కళాకారులు
గిరిజన, అడవి జాతులకు చెందిన కోయ, గోండు, నాయకపోడు కులాలకు ఆశ్రీత కులం తోటివారు. గిరిజన జాతులన్నీ లక్ష్మీదేవి జాతికి చెందినవి. తోటి కళాకారులు కురువంశానికి చెందినవారిగా, వారికి వారసులుగా భావిస్తారు. వీరు కురువంశ మూలపురుషుల కథలు చెబుతారు.

పెద్దమ్మ కళాకారులు
వీరు సంచార జాతికి చెందిన మహిళా కళాకారులు. సాధారణంగా ముగ్గురు లేదా నలుగురు కలిసి ప్రదర్శనలు ఇస్తారు. పెద్దమ్మ దేవత విగ్రహాన్ని ఒకరి చేతిలో ఉంచుతారు. మరో కళాకారిణి డోలు వాయిస్తుంది. చేతిలో పెట్టిన విగ్రహాన్ని కళాకారిణి తలపై పెట్టుకొని డోలు శబ్దానికి అనుగుణంగా లయబద్ధంగా నృత్యం చేస్తుంది. వీరు నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించిన విప్లవ వీరుడు ‘పండుగ శాయన్న’ గాథను పాడుతూ ప్రదర్శన నిర్వహిస్తారు.

యానాది భాగవతం
యానాది కులానికి చెందినవారు చెప్పే భాగవతాన్ని ‘యానాది భాగవతం’ అంటారు. వీరు చెంచులక్ష్మీ కథను ఎంతో రమ్యంగా చెబుతారు. దీన్నే ‘గరుడాచల భాగవతం’గా వ్యవహరిస్తారు. వీరు నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ కథను వల్లె వేస్తారు.

పర్థాన్ కళాకారులు
ఇది గోండు జాతి పుట్టు పుర్వోత్తరాలకు సంబంధించిన జానపద కళ. ఆదిమవాసీలైన పర్థాన్‌లు ‘దేవాల్ పులాక్’ పురాణగాథను ఆలపిస్తూ ప్రదర్శనలు ఇస్తారు. వీరు డక్కి, తాళాలు అనే వాయిద్యాలను ఉపయోగిస్తారు.

జముకులవారు
పోచమ్మ, ఎల్లమ్మ, అక్కమ్మ, సారంగధర మొదలైన గ్రామ దేవతల కథలను వీరు ఎంతో మనోరంజకంగా చెబుతారు. వీరు ఉపయోగించే వాయిద్యాల్లో ‘జమిడిక’ లేదా ‘బవనిక’ ముఖ్యమైంది.

వీరముష్టివారు
వీరు వైశ్యులకు అనుయాయులు. వైశ్యుల ఆరాధ్య దైవమైన శ్రీకన్యకాపరమేశ్వరి గురించి పాటలు పాడతారు. వీరు ‘జంగాల’ దగ్గర కూడా యాచిస్తారు.

సాతాను వైష్ణవులు
వీరు వైష్ణవ భక్తులు. విష్ణువును ఆరాధిస్తారు. విష్ణువు గురించి పాటలు పాడుతూ యాచిస్తారు.

పిట్టల దొర
తెలంగాణాలో ఆదరణ ఉన్న మరో ముఖ్యమైన జానపద కళాకారుడు ‘పిట్టల దొర’. ఈ వేషాన్నే ‘లత్కోర్ సాబ్’, ‘బుడ్డర్ ఖాన్’, ‘తుపాకి రాముడు’గా పేర్కొంటారు. ఇది పగటి వేషాల్లో ఒక రకానికి చెందింది. వీరు ప్రధానంగా గ్రామాల్లో ప్రదర్శనలు ఇస్తారు. పిట్టల దొర వేషగాళ్లు సమాజంలోని లోపాలు, కుతంత్రాలను హాస్యాత్మకంగా, వ్యంగ్య రూపంలో చెబుతారు. ఖాకీ ప్యాంటు లేదా నిక్కరు, చిరిగిన ఖాకీ షర్టు, తలపై దొర టోపి, కాళ్లకు బూట్లు ధరిస్తారు. టోపిపై ఒక పక్కన తెల్లటి ఈక, చేతిలో కట్టె తుపాకీ, మెడలో రుమాలు ఉంటుంది. వీరు ముఖానికంతా తెల్ల రంగు పూసుకుని, ఫ్రెంచ్‌కట్ మీసంతో దొరలా హంగామా చేస్తూ విరామం లేని వాగ్ధోరణితో ప్రజలను అలరిస్తారు.

మాదిరి ప్రశ్నలు

1.తెలంగాణలో మాయాజాల కళాకారులుగా ఎవరిని పిలుస్తారు?
1) మందెచ్చు కళాకారులు
2) విప్ర వినోదులు
3) ఒగ్గుకథ కళాకారులు
4) శారదకాండ్రు

Published date : 06 Nov 2015 03:44PM

Photo Stories